సాంకేతికతతోపాటు సైబర్ మోసాలూ పెరుగుతున్నాయి. రోజుకో రూపుతో పుట్టుకొస్తూ.. అమాయకులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది జాగ్రత్తగా ఉంటున్నా.. మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతుల్లో వల వేస్తున్నారు. ఫేక్ లింకులు, వెబ్సైట్లు, అకౌంట్ హ్యాకింగ్ టెక్నిక్స్ ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు గూగుల్ కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు విడుదల చేసింది. అవేంటో చూద్దాం!
పండుగలుసెలవులప్పుడు డిస్కౌంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు సైలెంట్‌గా మోసాలు చేస్తున్నారు. ఇంకొందరు మాయగాళ్లు డొనేషన్ పేరుతోనూ డబ్బులు గుంజుతున్నారు. అందుకే, ఆన్లైన్ షాపింగ్, డొనేషన్లు లాంటివి చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఆశ్రయించాలి. సదరు వెబ్సైట్, సంస్థల వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది.
కింది సూచనలను విధిగా ఫాలో అయితే.. ఆన్లైన్ మోసాలబారిన పడకుండా ఉంటారు.
ఇటీవల సోషల్ మీడియాలో ప్రముఖ నటులు, వ్యాపారవేత్తల పేరుతోనూ పెట్టుబడుల స్కాములు పెరుగుతున్నాయి. ‘ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే డబుల్ లాభం!’ అంటూ.. అమాయకులను ఊరిస్తున్నారు. లాభాలకు ఆశపడి వారు చెప్పినట్టు చేస్తే.. ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం. ‘తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం!’, ‘ఒక్క నెలలోనే మీ డబ్బులు డబుల్!’ అంటూ కనిపించే యాడ్స్ వెనక సైబర్ నేరగాళ్ల వలలు ఉంటాయని గుర్తుంచుకోండి. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తెరపై కనిపించే ప్రముఖ ముఖాల్లో హావభావాలు తేడాగా ఉంటే.. ఆ ప్రకటనలూ తేడావేనని తెలుసుకోండి. అవి డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించినవే కావొచ్చు. పెట్టుబడి పెట్టాలనుకుంటే.. అనుభవం ఉన్న ఫైనాన్షియల్ నిపుణుల సూచనలు ఫాలో అవ్వడమే ఉత్తమం. ఈ విషయంలో.. ఈ టిప్స్ చాలా ముఖ్యం!
వెబ్సైట్లలో కొనుగోలు చేసేముందు.. అది నిజమైనదా? కాదా? అన్నది కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా, పెద్దపెద్ద డిస్కౌంట్లు, తక్కువ ధరలకు వస్తువులను ఆఫర్ చేసే సైట్లను ప్రత్యేకంగా పరిశీలించాలి. ఇందుకోసం గూగుల్‌లో ‘About this result’ అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా వెబ్సైట్ విశ్వసనీయతను తెలుసుకోవచ్చు. అంతేగాక, ‘My Ad Center’ ద్వారా ప్రకటనల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇవీ ఫాలో అవ్వండి.
ఇటీవల నకిలీ ఉద్యోగ ప్రకటనలతో యువత నుంచీ అందినకాడికి దండుకుంటున్నారు. ‘జాబ్’ ఆఫర్ అంటూ.. జాదూ చేసేస్తున్నారు. ముఖ్యంగా, ఇంట్లో కూర్చొని పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని చెప్పే ఉద్యోగ అవకాశాలను నిశితంగా పరిశీలించాలి. ఏదైనా కంపెనీ ముందుగా డబ్బు అడిగితే.. అది నకిలీ కావచ్చని గుర్తించాలి. నిజమైన సంస్థలు ఎప్పుడూ ఉద్యోగ అభ్యర్థులను డబ్బు చెల్లించమని అడగవు. అందుకే ఈ నియమాలు..
నిజమైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని అడగవు. కానీ, చాలా ఫేక్ లోన్ యాప్స్ వినియోగదారుల ఫొటోలు, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని.. వారిని భయపెడుతున్నాయి. రుణాల పేరుచెప్పి.. నిలువునా దోచుకుంటున్నాయి. గూగుల్ సూచనల ప్రకారం, ఎప్పుడైనా లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థల ద్వారా మాత్రమే రుణాలు తీసుకోవాలి. ప్లే స్టోర్‌లో అనుమానాస్పదమైన యాప్ ఉంటే.. దాని గురించి రిపోర్ట్ చేయండి. ఈ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పని సరి..
సో.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏది నిజమో.. ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా అవసరం. ఆన్లైన్ మోసాలను అడ్డుకోవాలంటే సందేహాస్పదంగా ఉండే లింకులను క్లిక్ చేయకూడదు. ఏవైనా డీల్స్, ఆఫర్లు చూసిన వెంటనే అధికారిక వనరుల ద్వారా చెక్ చేసుకోవాలి. గూగుల్ ఇచ్చిన ఈ సూచనలను పాటిస్తే, ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండొచ్చు.
ఏదైనా కంపెనీ ప్రతినిధి మీకు కాల్ చేసి.. మీ ఫోన్ లేదా కంప్యూటర్లో సమస్య ఉందని చెబితే నమ్మవద్దు. గూగుల్ ప్రకారం, అసలు కంపెనీలు ఎప్పుడూ ముందుగా వినియోగదారులను సంప్రదించవు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే, ఆ సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా మాత్రమే సహాయం పొందాలి. ఇంకా భద్రత పెంచుకోవాలంటే, 2-Step Verification (2SV)ని ఆన్ చేసుకోవడం మంచిది. ఈ సెక్యూరిటీ చిట్కాలు చూడండి.