ఓ చిన్న మెసేజ్.. ఒక ఘాటైన కామెంట్.. ఏదైనా నెగెటివ్ ఎమోజీ. టైప్ చేయడానికి పట్టేది కేవలం సెకన్లే. కానీ, ఆ పదాలు ఇంటర్నెట్లో శాశ్వతంగా ఉండిపోతాయని, అవి ఎవరి మనసునైనా విరిచేస్తాయని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ‘నోటి మాట.. చేతి రాత వెనక్కి తీసుకోలేం’ అనే సామెత నేటి డిజిటల్ ప్రపంచానికి పక్కాగా సరిపోతుంది. అదెలాగంటే.. మీరు ఎంతో ఇష్టపడి ఫొటోనో, ఏదైనా అభిప్రాయాన్నో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వంద మంది ‘సూపర్’ అన్నా పట్టించుకోని మీ మనసు.. ఎవరో తెలియని వ్యక్తి పెట్టిన ఒక్క ‘నెగెటివ్’ కామెంట్ దగ్గరే ఆగిపోతుంది. రోజంతా దాని గురించే ఆలోచిస్తూ, ఆ వ్యక్తిపై కోపంతోనో లేదా బాధతోనో కుంగిపోతుంటారు. అసలు మన మెదడు నెగెటివిటీకి ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది? అపరిచితుల మాటలు మన ప్రశాంతతను ఎందుకు దూరం చేస్తున్నాయి?
నెగెటివిటీ బయాస్.. మన మెదడు చేసే మాయ! మానవ పరిణామ క్రమంలో మన మెదడు ఎప్పుడూ ప్రమాదాలను, ప్రతికూల అంశాలను గుర్తించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీన్నే ‘నెగెటివిటీ బయాస్’ అంటారు. అందుకే పది మంచి మాటల కంటే, ఒక్క చెడు మాట మన మెదడులో బలంగా నాటుకుపోతుంది. ఆన్లైన్ ప్రపంచంలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువ. ఎందుకంటే అక్కడ విమర్శించే వ్యక్తి ముఖం మనకు కనిపించదు, దాంతో మన ఊహలు ఆ విమర్శను ఇంకా భయంకరంగా చిత్రీకరిస్తాయి. ఈ విపరీతానికి అడ్డుకట్ట వేయడానికి కొన్ని సంస్థలు ‘వర్డ్స్ ఆర్ పర్మినెంట్’ తరహా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్లో మన ప్రవర్తనను మార్చుకోవాల్సిందేనని ఇవి గట్టిగా చెబుతున్నాయి.
జీవితకాలపు మచ్చ!
ఆన్లైన్లో ఎవరినైనా విమర్శించడం లేదా వేధించడం (Cyber bullying) ఇప్పుడు చాలా సులభమైపోయింది. ముఖం కనిపించదు కదా అని మనం వాడే పదజాలం అవతలి వ్యక్తిని మానసిక కుంగుబాటులోకి నెట్టేస్తుంది. మీరు ఆ కామెంట్‌ని డిలీట్ చేయొచ్చు కానీ, ఆ వ్యక్తి మనసుపై పడిన గాయం మాత్రం అలాగే ఉండిపోతుంది. స్క్రీన్ మీద టైప్ చేశాం.. పోస్ట్ చేశాం.. స్క్రోల్ చేసేశాం! అంతేకదా.. అనుకుంటే కాదు. సోషల్ మీడియాలో మనం వదిలే ప్రతి అక్షరం మన డిజిటల్ ఫుట్‌ప్రింట్‌లో భాగమేనని గుర్తుంచుకోవాలి. మనలో చాలామంది ‘ఏముందీ.. ఒకవేళ తప్పుగా మాట్లాడితే డిలీట్ చేస్తాను.. ఎడిట్ చేస్తాను.. ప్రాబ్లమ్ సాల్వ్!’ అని అనుకుంటూ ఉంటారు.
కానీ, స్క్రీన్ నుంచి మాట వెళ్లిపోవచ్చు.. కానీ మనసు నుంచి అది అంత సులభంగా వెళ్లదు! ఆన్లైన్ కామెంట్స్, మెసేజెస్‌కి ఆఫ్‌లైన్ మాటల కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది! ఎందుకంటే అవి టెక్ట్స్ ఫార్మ్‌లో ఉంటాయి. వాటిని మళ్లీ మళ్లీ చదవొచ్చు. షేర్ చేయొచ్చు. స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఒక నెగెటివ్ మాట చదివిన వ్యక్తి మనసులో.. ఆ కామెంట్ గంటలపాటు, రోజులపాటు, కొన్నిసార్లు సంవత్సరాలపాటు తిరుగుతుండొచ్చు! అంతేకాదు మనం ఫేస్-టు-ఫేస్ మాట్లాడేటప్పుడు టోన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఉంటాయి. అవి ఆ మాట తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ టెక్ట్స్‌లో అలాంటి చాన్స్ ఉండదు. అందుకే ఆన్లైన్లో మరింత జాగ్రత్తగా, ఎంపతీతో మాట్లాడాలి!
సైబర్‌సెల్ క్యాంపెయిన్ ముఖ్యాంశాలివే: ‘వర్డ్స్ ఆర్ పర్మినెంట్’ లాంటి అవగాహన సదస్సులో నొక్కి చెబుతున్న పాయింట్లు ఇవే:శాశ్వతత్వం: ఇంటర్నెట్లో మీరు పోస్ట్ చేసినది ఏదైనా అది ఎక్కడో ఒకచోట రికార్డ్ అయ్యే ఉంటుంది. స్క్రీన్ షాట్ల రూపంలో అది ఎప్పుడైనా బయటికి రావచ్చు.ఎంపతీ: స్క్రీన్కు అవతలి వైపు ఉన్నది కూడా ఒక మనిషేనని, వారికి భావోద్వేగాలు ఉంటాయని గుర్తించడం. టైప్ చేసే ముందు ‘ఈ మాట ఎవరైనా అంటే నేను ఎలా ఫీల్ అవుతాను?‘ అని ఆలోచించడం.బాధ్యతాయుతమైన ప్రవర్తన: ఆన్లైన్లో మనం వదిలే నెగెటివిటీ మన వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తుంది. మంచి మాటలు చెప్పలేకపోయినా ఫర్వాలేదు కానీ, చెడును ప్రచారం చేయకుండా ఉండటమే గొప్ప విషయం.
జర భద్రం.. ఈ సూత్రాలు పాటించండి!
నెట్టింట్లో స్పందించే ముందు ఈ ‘డిజిటల్ ఎథిక్స్’ గుర్తుంచుకోండి:థింక్ బిఫోర్ యు టైప్: ఆవేశంలో ఏదీ పోస్ట్ చేయకండి. 10 సెకన్లు ఆగి ఆలోచిస్తే ఆ పదాల తీవ్రత మీకే అర్థమవుతుంది.స్టాప్ ద స్ప్రెడ్: ఎవరినైనా కించపరిచే మీమ్స్ లేదా పోస్టులను షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఆ హింసలో భాగస్వాములు అవుతున్నారని మర్చిపోవద్దు. ఎవరైనా ఈ తరహా సైబర్ బుల్లీయింగ్‌కి గురవుతుంటే.. సైలెంట్‌గా ఉండకుండా బాధితులకు పక్షాన నిలవండి.రిపోర్ట్ అండ్ బ్లాక్: నెగెటివిటీని ప్రోత్సహించే అకౌంట్లను వెంటనే రిపోర్ట్ చేయండి. వాటితో వాదనకు దిగడం కంటే మౌనంగా బ్లాక్ చేయడం ఉత్తమం.సామాజిక బాధ్యత: టెక్నాలజీ మనల్ని దగ్గర చేసింది కానీ, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నది. ‘వర్డ్స్ ఆర్ పర్మినెంట్’ అనేది కేవలం ఒక స్లోగన్ కాదు.. అది ఒక సామాజిక బాధ్యత.పాజిటివ్ వర్డ్స్ వాడాలి: నెగెటివ్ కామెంట్స్ చదివిన వ్యక్తికి ఆందోళన, సెల్ఫ్-డౌట్, సోషల్ విత్డ్రాల్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ వర్డ్స్ వాడాలి. అవి అంతే శక్తిమంతంగా పనిచేస్తాయి.. ఒక మంచి మాట ఎవరి రోజునైనా మార్చేయగలదు!సెల్ఫ్ చెక్: ‘నేను ఈ మాటను ఫేస్-టు-ఫేస్ చెప్పగలనా?’ అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే టైప్ చేయండి పిల్లలకు చెప్పాలి: మనం వాడే ప్రతి పదం గౌరవప్రదంగా ఉండాలి. రేపు మన పిల్లలు మన డిజిటల్ హిస్టరీని చూసినప్పుడు, మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించామనే గర్వం కలగాలి. సో.. ఇకపై టైప్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. ఎందుకంటే అక్షరం శాశ్వతం!
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్