‘గాలికన్నా వేగమైనది ఏది?’ అన్న యక్ష ప్రశ్నకు ‘మనసు’ అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. క్షణంలో వెయ్యోవంతు కూడా అది పని లేకుండా ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలాంటి మనసును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు స్వాధీనమైపోతుంది. కామ క్రోధాదులను బలపరుస్తుంది. ఇంద్రియాలకు వశుడైన మనిషి ఏది చేయాలో, ఏది చేయకూడదో అన్న విచక్షణను కోల్పోతాడు. క్షణికమైన సుఖాల కోసం వెంపర్లాడటం మొదలవుతుంది. నాటి నుంచి అతని పతనం ప్రారంభం అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెబుతుంటారు పెద్దలు. మనసును ఇంద్రియాల వశం కాకుండా కాపాడుకోవాలి. నిబద్ధత, సత్సాంగత్యంతో దానిని అదుపులో పెట్టుకోవాలి. అదే మనో నిగ్రహం.
మనసు ప్రాకృతికమైనప్పటికీ అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దానితోనే మనం దేవుణ్ని ప్రసన్నం చేసుకోగలం. యథార్థ జ్ఞానమే ఆ జ్ఞాన నేత్రం. అది సత్యానికి భిన్నమైంది కాదు. దేవుడు సత్యస్వరూపుడు. సత్యం ద్వారానే అతణ్ని చేరుకోగలం. మనం నిద్రించినప్పుడు మనతోపాటు మన మనసు ఉండదు. అందుకే గాఢ నిద్రలో మనం పరమానందాన్ని అనుభవిస్తాం. అలాగే సమాధి స్థితిలో మనసు మనతో ఉండదు. అప్పుడు కూడా పరమానందం కలుగుతుంది. అంతేకాదు మోక్షస్థితిలోనూ మనసు మనతో ఉండదు. కాబట్టి బ్రహ్మానందాన్ని అనుభవిస్తాం.
పరమానందాన్ని పొందడానికి మనసు కారణం కాకపోయినా, అది దేవుడి సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతుంది. జ్ఞాన సాధనమైన మనసు మంచిదే కానీ అది మనల్ని ప్రపంచ బంధనాల్లో ఉంచుతుంది. కాబట్టి మనసును జయించాలి. జీవుడు మనోమయుడైనంత కాలం ఆనందమయుడైన దేవుణ్ని చేరుకోలేడు. అందుకే మానవుడు మనసు నుంచి విడివడి కేవలుడుగా మిగిలిపోవాలి. అప్పుడే అతనికి కైవల్యం సిద్ధిస్తుంది. దేవుడి సాక్షాత్కారం తప్పకుండా లభిస్తుంది.