వంటకానికి అన్ని దినుసులూ కలిసి రుచిని కల్పిస్తాయి. సువాసన అద్దేది మాత్రం కరివేపాకే. దీన్ని ‘కల్యమాకు, కర్రీపత్తా, కర్రీ లీవ్’ అని కూడా పిలుస్తారు. కరివేపాకు చెట్టు మధ్యస్తంగా పెరిగే మొక్క. గోరింట, దానిమ్మ చెట్లలాగే 10 నుంచి 12 అడుగుల ఎత్తు పెరుతుంది. మా స్నేహితురాలి ఇంటి దొడ్లో మామిడి చెట్టుతో పోటీ పడి ఎదిగిన కరివేపాకు చెట్టు ఒకటుంది. కరివేపాకు కొమ్మకు ఉండే రెమ్మలు తుంచిన కొద్దీ కొత్తవి పిలకలు వేస్తాయి. ఆకులు వేపాకును పోలి ఉన్నా అంచులు మాత్రం సాఫీగా ఉంటాయి. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని పెరుగుతుంది.
అనేక దేశాల్లో వంటకాల్లో సువాసన కోసం కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకు వేసిన పోపుతో కలిపిన పులిహోర తినని తెలుగువాళ్లు ఉండరు. సుగంధ భరితమైన ఆకును వంటల్లో ఉపయోగించినా, తినేముందు ఆకును తీసివేయడం ఎక్కువమందికి అలవాటు. దీని ఔషధ గుణాలు తెలిస్తే కరివేపాకుని తప్పకుండా తింటారు. కరివేపాకుని ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. దీనిలో భాస్వరం, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజ మూలకాలున్నాయి. విటమిన్ ఏ అధికంగా ఉండే కరివేపాకు తింటే కంటిచూపు మెరుగవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. జుట్టు సమస్యలనూ పరిష్కరిస్తుంది.
కరివేపాకుని రైతులు వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. దీని సాగుకు శ్రమ తక్కువ కాబట్టి ఎకరాల కొద్దీ సాగు చేస్తున్నారు. లాభాలు పండిస్తున్నారు. మా ఔషధవనంలో అర ఎకరాకుపైగా కరివేపాకు వనం సాగు చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి మంచి దిగుబడినిస్తున్నది. చెట్టు కొమ్మలను నరికినా మళ్లీ మళ్లీ అంతకంటే రెండింతల కొమ్మలు చిగురిస్తున్నాయి. కరివేపాకు కాయలు కందిగింజ పరిమాణంలో గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ కాయలు ఎండిన తర్వాత విత్తుకోవచ్చు. మా ఇంటి ముందు పెద్ద రావి చెట్టు ఉంది. అది అనేక పక్షుల గూళ్లకు ఆలవాలం. వాటిలో పక్షులు తిని పడేసిన అనేక కరివేపాకు గింజలు వానకాలం వస్తే చాలు మా తోటంతా మొలకెత్తేవి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు