అది ఓ పూర్వ విద్యార్థుల సమావేశం. కాలేజి వదిలిన ఇరవై ఏళ్లకు వాళ్లందరూ ఒకచోటుకు చేరుకోగలిగారు. వాట్సాప్ గ్రూపుల్లోనో, ఒకే ఊళ్లో ఉండటం వల్లనో కొందరు తరచూ కలుసుకుంటున్నా… అందరూ కలిసి కబుర్లు కలబోసుకున్న సందర్భం అదే! నువ్వేం చేస్తున్నావంటే.. నువ్వేం చేస్తున్నావనే
పలకరింపులతో సమావేశం మొదలైంది. ఆశ్చర్యం! అప్పట్లో చాలా ప్రతిభావంతులైన కొంతమంది కెరీర్లో వెనకబడి, ఉద్యోగాలకు ఇబ్బందిపడటం కనిపించింది. అరకొరగా స్థిరపడతారనుకున్న మరికొందరు అద్భుతంగా రాణిస్తున్నారు.
దీనికి విధి, పరిస్థితులు, దురదృష్టం లాంటి కారణాలు చెప్పుకోవచ్చు. కానీ, కొన్ని విషయాల్లో మన అలసత్వం, చిన్నవే కదా అనుకునే బలహీనతలే జీవితాన్ని శాసిస్తాయి. వాటిని కూడా మనం సరిచేసుకోవచ్చు. కానీ, మన పనితీరును, జీవితాన్ని మెరుగుపరుస్తాయనే భ్రమలో కొన్ని తప్పులు చేస్తుంటాం. అవి తప్పు కాదన్న విషయమే గ్రహించం కాబట్టి… సరిదిద్దుకునే ప్రయత్నమే జరగదు. అలాంటి కొన్ని అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నమిది.
చెట్టు మీద పక్షి కన్నును మాత్రమే చూసి బాణం గురిపెట్టిన అర్జునుడికి ఆ రోజున ఏ పరధ్యానాలూ లేకపోవచ్చు. కానీ, కాలం మారింది. అరచేతిలో వైకుంఠంలా తోచే మొబైల్ ఫోన్ దగ్గర నుంచీ నట్టింట తాండవమాడే ఓటీటీ వరకూ అన్నీ మన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసేవే. మరోవైపు లక్ష్యాల తీరు కూడా మారిపోయింది. ఒక ప్రభుత్వ ఉద్యోగమో, ఓ సొంత ఇల్లో మాత్రమే ఇప్పటి గురికి సరిపోవడం లేదు. ఖండాలు దాటి వెళ్లాలి, గజాల కొలతల్ని మించిన భవనాలు కొనాలి, అంతులేని ఎత్తులకు ఎదగాలి. అందుకోసం మరింతగా ప్రయత్నించాలి. కాలాన్నీ, డబ్బునూ, ప్రతిభనూ మరింత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆ నేపథ్యంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కెరీరే కాదు జీవితమే పరిపూర్ణంగా మారుతుంది.
ఉన్న సమయం తక్కువ. సాధించాల్సింది కొండంత. అందుకే అందరూ మల్టి టాస్కింగ్ మీద దృష్టి పెడుతున్నారు. కోడింగ్ చేస్తూనే ఆఫీస్ కాల్, ప్రాజెక్ట్ గురించి సమాచారం వెతుకుతూనే మెయిల్, వంట చేసుకుంటూనే జూమ్ మీటింగ్. ప్రతీ రంగంలోనూ ఈ మల్టి టాస్కింగ్ కనిపిస్తున్నది. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధన మల్టి టాస్కింగ్ మరింత ఒత్తిడికి దారి తీస్తుందని తేల్చింది. మల్టి టాస్కింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల హృదయ స్పందన పెరిగిపోవడాన్ని పరిశోధకులు గమనించారు. అంతేకాదు! ఏకాగ్రతతో చేయాల్సిన పనిని మరో పనితో జోడించినప్పుడు ఏ సమాచారం విలువైంది, ఏ విషయంలో చర్యలు తీసుకోవాలి లాంటి కీలకమైన అంశాలలో పొరపాట్లు చేస్తామట. మన స్వల్పకాలిక జ్ఞాపక శక్తి (Short term memory) మీద తీవ్రమైన ప్రభావం చూపడమే ఇందుకు కారణం. ఉదాహరణకు ఆఫీస్ కాల్ వింటూ పనిచేసుకుంటున్నామని మనం అనుకుంటాం. కానీ, ఆ కాల్లో అతిముఖ్యమైన విషయం మన చేజారిపోయి, అల్పమైన సందర్భమేమో గుర్తుండిపోతుంది. ఇదే విశ్వవిద్యాలయంలో జరిగిన మరో పరిశోధన, మల్టి టాస్కింగ్ వల్ల పొరపాట్లు కూడా ఎక్కువ అవుతాయని తేల్చింది. ఇలాంటి ఎన్నో కారణాలు వల్ల… మల్టి టాస్కింగ్ చేసేటప్పుడు మన ఉత్పాదకత కనీసం 20 శాతం తగ్గిపోతుందని ఓ అంచనా. దురదృష్టం ఏమిటంటే… ఈ ప్రక్రియను సమర్థతకు ప్రతీకగా భావించడం. ఆ దృక్పథం సైతం ప్రతికూలమైన ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.
ఏం చేసినా పరిపూర్ణంగా (perfect) చేయాలని చాలామందికి ఉంటుంది. వినడానికి బాగానే ఉంటుంది. అది ఓ గొప్ప లక్షణంగానూ అనిపిస్తుంది. ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలని అనుకున్నారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు. దీనికోసం ఉద్యోగాలకు సంబంధించిన ఓ 95 పరిశోధనల సారాన్ని గమనించారు. వీటన్నిటిలో వ్యక్తమైన అభిప్రాయం ఒక్కటే! ప్రతిదీ పరిపూర్ణంగా చేయాలనుకునే తత్వం, ఉద్యోగానికీ విజయాలకూ అడ్డంకిగా నిలుస్తున్నది. పైకి చూసేందుకు పరిపూర్ణవాదులు అవసరానికి మించి శ్రద్ధ కనబరుస్తున్నట్టుగా, ఎక్కువగా గంటలు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ, దీర్ఘకాలంలో అది ఒత్తిడి, కుంగుబాటు లాంటి పరిస్థితులకు దారితీస్తున్నది. పని ఒక వ్యసనంగా మారిపోవడం, దానివల్ల ఒంటరితనం, అనుకున్నది నూరు శాతం సాధించలేనప్పుడు నిరాశ… లాంటి సవాలక్ష సమస్యలు కనిపించాయి. అన్ని విషయాల్లోనూ పరిపూర్ణంగా ఉండాలనుకునే తత్వం ఓ వ్యక్తి చుట్టూ కనిపించని గోడను కట్టేస్తుంది. తినే ఆహారం దగ్గర నుంచీ తన చుట్టూ ఉన్న బంధాల వరకూ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకునే ప్రయత్నం నిరంతరం యుద్ధానికి దారితీస్తుంది. మరి దీన్ని నియంత్రించడం ఎలా? తేలికే! ఎక్కడ ఆగాలో స్పష్టత ఏర్పరుచుకోవడం, తప్పులు సహజమని మనకు మనం ఒప్పుకోవడం, సమస్యను ఎవరో ఒకరితో పంచుకోవడం… ఇవేవీ కుదరకపోతే థెరపిస్టును కలవడం తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి.
ఏదో ఊసుపోక పని మధ్యలో మొబైల్ చూస్తాం. ఓసారి అలా స్క్రీన్ కదుపుతామా… ప్రతి 30 సెకన్లకీ ఓ కొత్త వీడియో కనిపిస్తుంది. ఏదో ఓ వైరల్ వార్త పలకరిస్తుంది. చూస్తుండగానే 30 సెకన్లు కాస్తా 30 నిమిషాలుగా మారిపోతాయి. ఉపశమనం రాదు సరికదా… అలసట కూడా తీరదు. 77 శాతం మంది ఉద్యోగులు పని సమయంలో సోషల్ మీడియాలో మునిగిపోతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఓ ఆరున్నర వేల మంది ఉద్యోగుల మీద సోషల్ మీడియా ప్రభావాన్ని అంచనా వేసింది. ‘ఊరికే ఓ వీడియో చూడండి. ఆ తర్వాత పని చేస్తారా లేకపోతే అలాంటి వీడియోనే చూస్తారా!’ అనే సందర్భాన్ని సృష్టించినప్పుడు వరుస వీడియోలకే ఓటు పడటాన్ని గమనించింది. మన దేశానికే చెందిన NIMHANS సంస్థ చేసిన మరో పరిశోధనలో… ఒకసారి సోషల్ మీడియాలో తలదూర్చి తీస్తే, మళ్లీ పని మీద పూర్తి ఏకాగ్రత కలగడానికి ఏకంగా 23 నిమిషాలు పడుతుందని తేలింది. సోషల్ మీడియా వల్ల పనితీరే కాదు… మానసిక, శారీరక సమస్యలు కూడా వస్తాయన్న విషయం తెలిసిందే. ఆ నష్టాల జాబితా మొదలుపెడితే ఇక అంతే ఉండదు. అందుకే సోషల్ మీడియా వ్యసనం మనకు కూడా ఉందేమో అని సరిచూసుకోవాలి. చూడకుండా ఉండలేకపోవడం, నియంత్రణ లేకపోవడం, తగ్గించే ప్రయత్నం చేస్తే చిరాకు, ఎక్కువ సమయం గడపడం లేదంటూ అబద్ధాలు చెప్పాల్సి రావడం లాంటివన్నీ ఆ వ్యసనానికి లక్షణాలే. నోటిఫికేషన్స్ తీసేయడం, కొన్ని యాప్స్ డిలిట్ చేయడం, ఆఫీసులో సాధారణ ఫోన్ వాడటం… లాంటి ఎన్నో చర్యల ద్వారా ఈ వ్యసనం మీద నియంత్రణ సాధించవచ్చు.
మనస్తత్వశాస్త్రంలో ఫ్రాగ్మెంటేషన్ అనే మాట ఉంది. నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఉద్వేగాలలో చిక్కుకోవడం. అయితే ఉద్రేకంగా లేదా నిస్సత్తువగా ఉండటం, మనసుకు నచ్చింది చేయాలని ఉన్నా తీవ్రమైన విముఖత, శరీరం మీద కూడా అభిమానం లేకపోవడం, ఎవరితోనూ సన్నిహితంగా ఉండలేకపోవడం, జీవితం పట్ల విరక్తి… ఇలాంటి లక్షణాలు ఉండే స్వభావమిది. చిన్నతనంలో నిర్లక్ష్యం, హింస, కష్టాలు ఎదుర్కొన్నవారిలో ఈ తీరు ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఓ సమస్య అని కూడా ఎవరూ గుర్తించకపోవడమే అసలైన సవాలు. దాన్ని గుర్తించి అధిగమించే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది. తన సమస్యను దగ్గరి వారితో పంచుకోవడం, అనుబంధాలను పెంచుకునే ప్రయత్నం చేయడం, ఏకాగ్రత పెరిగే అలవాట్లు చేసుకోవడం, ప్రకృతి మధ్య గడపడం, తనలో ఉన్న వైరుధ్యాలను అవసరమైతే నోట్ చేసుకుని విశ్లేషించుకోవడం… లాంటి సవాలక్ష సూచనల ద్వారా దీన్ని సరిదిద్దుకోవచ్చు. ఇవేవీ పనిచేయకుంటే థెరపిస్టుల దగ్గరకు వెళ్లినా చాలా ఉపయోగం ఉంటుంది.
చాలామంది అద్భుతంగా పనిచేస్తారు. ప్రతిభతో మెప్పిస్తారు. కానీ, గడువు పెడితే మాత్రం గడగడలాడిపోతారు. ఈ పని చేసి తీరాలి, ఇది నిబంధన ప్రకారం సాగాలి అన్న మాటలు వినిపించగానే వాటిని వాయిదా వేయడం మొదలుపెడతారు. చూసేవాళ్లకు అది బద్ధకంగా కనిపిస్తుంది. నిజానికి వాయిదా వేయడం అనేది జ్వరంలాగా ఓ లక్షణం మాత్రమే. వ్యక్తిత్వంలో ఉన్న భయాలకు అది చిహ్నం. వాటిని గుర్తించనంత వరకూ వైఫల్యాలను కప్పిపుచ్చుకోక తప్పదు. ఫలితం అప్పటికప్పుడు కనిపించాలనే అసహనం (Present Bias), పెంపకంతోపాటు పెరిగిన ఆత్మన్యూనత, తేలికైన ఎంపికనే కోరుకునే తీరు (pleasure principle), కుంగుబాటు, విజయం సాధిస్తానో లేదో అనే ఒత్తిడి (performance anxiety)… లాంటి ఎన్నో కారణాలు ఇందుకు దారితీస్తాయి. వాయిదా వేయడానికి ఎప్పుడైతే కారణాలు వెతుక్కుంటున్నామో, వాయిదా వేస్తున్నామనే మాటను పడుతున్నామో… అప్పుడే మనలో సమస్య ఉందని గుర్తించి తీరాలి. అనుకున్న పనిని వెంటనే చేసెయ్యడం, సమయ పాలన (టైం మేనేజ్మెంట్)కు సంబంధించిన POSEC లాంటి చిట్కాలను పాటించడం, భయం మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లాంటి చర్యలతో దీన్ని సరిదిద్దుకోవచ్చు.
ఆయన ఒక్కసారి కూడా సెలవు పెట్టలేదు, తన పనేదో తనది, క్రమశిక్షణకు మారుపేరు. ఇలాంటి మాటలు పొగడ్తలుగా బాగుంటాయి. కానీ, సంస్థకు నష్టం వచ్చినప్పుడు? అందుకే జీవితం అంటే ఆఫీసు కుర్చీనో, ఉద్యోగమో మాత్రమే కాదు. ఓసారి తలెత్తి చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆఫీసులో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మార్కెట్లో ఎలాంటి నైపుణ్యాలకు విలువ పెరుగుతున్నది అన్న విషయం మీద ఎరుక ఉండాలి. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ల భవిష్యత్ అవసరాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆలోచనా ఉండాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంట్లో మొబైల్ చూసుకుంటూనో, నిద్రపోతూనో కాదు… కలిసి కాలం గడపడం అని గుర్తించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి పెయింటింగ్… ఏదో ఒక చుక్కతోనో గీతతోనో పూర్తయ్యేది కాదు. జీవితం ఓ అందమైన దృశ్యంలా ఉండాలంటే ఇల్లు, ఆఫీసు, చెట్లు, కొండలూ… అన్నీ ఉండాల్సిందే!
అసలే కదలని మెదలని సెడెంటరీ లైఫ్ ైస్టెల్. దానికి తోడు పోషకాలు లేని ఆహారం. ఆపై ఉద్యోగంలో ఒత్తిడి. ఆరంకెల జీతాన్ని, కారు మోడళ్లనీ గమనించుకుంటే సరిపోదు. నడివయసుకు చేరుకోక ముందే అకస్మాత్తుగా మాయం అవుతున్న నేస్తాలు చేస్తున్న హెచ్చరిక ఇదే! అందుకే కెరీర్లో ఎదుగుతూనే ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన Lifes Simple 7 అనే సూచనను చాలామంది పాటిస్తున్నారు. వేలమంది ఆరోగ్యశైలిని వారిలోని కోట్లాది జన్యువులనూ పరిశీలించిన తర్వాత రూపొందించిన నివేదిక ఇది. ధూమపానం చేయకపోవడం; బరువును నియంత్రణలో ఉంచుకోవడం; కనీస వ్యాయామం; పౌష్టికాహారం; కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం… ఈ ఏడు సూత్రాల మీద పట్టు సాధిస్తే… నిండైన జీవితం మన సొంతం అవుతుందనీ, పరిపూర్ణ ఆయుష్షు సాధ్యమవుతుందని గణాంకాలతో సహా నిరూపిస్తున్నదీ నివేదిక.
ఇవే కాదు రిస్క్ తీసుకునేందుకు భయపడటం, దక్కినవాటి పట్ల కృతజ్ఞతగా లేకపోవడం, ఎవరి జీవితం వారిదే అనుకుంటూ ఇతరులకు సాయం చేసేందుకు వెనకాడటం… లాంటి ఎన్నో విషయాలు చాలామందిని తమ ప్రతిభకు తగిన స్థాయిలో ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి చిన్నచిన్న అడ్డంకులను దాటుకుంటే ప్రతీ జీవితమూ అద్భుతంగా మారిపోతుందనడంలో అనుమానం లేదు. కావాలంటే ఓసారి పాటించి చూడండి.
జాగ్రత్త ముఖ్యమే. లక్ష్యాన్ని నిర్ణయించుకునేటప్పుడూ, ప్రణాళికలు రూపొందించుకునేటప్పుడూ… దారిలో ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకోవడమూ అవసరమే. అలాగని నిరంతరం అడ్డంకుల మీదే మనసును సారిస్తే… తెలియకుండానే దాని వైపు ప్రవర్తిస్తాం. రోడ్డు మీద ప్రయాణించేవారికి ఇది అనుభవమే. దారి పక్కనే ఉన్న దిమ్మెను తప్పించాలి అని మనసులో నిశ్చయించుకుని… నేరుగా వెళ్లి దాన్నే గుద్దుకుంటారు. అందుకే పైలట్లకు శిక్షణలో ఓ ముఖ్యమైన సూచన చేస్తూ ఉంటారు. Focus on the path… Not on the obstacles అని. రన్వే మీదకు దిగేటప్పుడు, వేల అడుగుల ఎత్తున ఎగిరేటప్పుడు దారి మీద కాకుండా పక్కన ఉన్న ప్రమాదాల మీద దృష్టి పెడితే ఏకాగ్రతే కాదు, పట్టు కూడా తప్పుతుంది. అర్జునుడు పక్షి కన్నుకే గురిపెట్టిన కథ ఇందుకే చెప్పుకునేది!
ఓ కొత్త ఉద్యోగంలో చేరాం. మిగతావాళ్లకంటే భిన్నమని ఎలా నిరూపించుకోవాలి? జీతంలో, పదోన్నతిలో పై మెట్టుకు ఎలా చేరాలి? ఇంతవరకూ ప్రశ్నలు సబబుగానే ఉంటాయి. కానీ, అంతకు మించితేనే సమస్య. సృజన చూపిస్తే, శ్రమిస్తే… మన సత్తా ఎలాగూ తెలుస్తుంది. ఒకరి మెప్పు కోసమో, మరొకరిని తక్కువ చూపించడానికో ప్రయత్నిస్తే మాత్రం దీర్ఘకాలంలో పతనం తప్పదు. సాటి ఉద్యోగి తప్పు చేయాలని ఎదురుచూస్తూ… చేస్తే దాన్ని ప్రచారం చేస్తూ సంతోషించడం, గ్రూపులుగా విడిపోవడం, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకోకపోవడం, ఇతరుల గురించి చెడుగా మాటలు, పై అధికారిని పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవడం… లాంటివన్నీ ఆఫీసు రాజకీయాల కిందకే వస్తాయి. ఆఫీసులో ఇలాంటి వాతావరణం ఉంటే స్పష్టంగా తెలిసిపోతుంది. మనం కూడా అందులో భాగస్వాములు కావాలా వద్దా అనే జంజాటమూ మొదలవుతుంది. చాలామంది ఏదన్నా సంస్థలో కొన్నేళ్లకు మించి పనిచేయకపోవడానికి కారణం ఆఫీసు రాజకీయాలే! వాటిలో మునిగిపోయి, అవమాన భారంతో సంస్థ నుంచి బయటికి వచ్చి… రాజకీయాలకు బలైపోయానని చెప్పుకోవడం బాధాకరమే. కానీ, వీటిని తప్పించుకోవడం తేలికే అన్నది కార్పొరేట్ పండితుల మాట. ఇందుకోసం చాలా సూచనలే వినిపిస్తాయి కానీ అందులో ముఖ్యమైన కొన్ని అంశాలు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఆది నిష్టూరమే మేలు: సరే అని ఒప్పుకోవడం తేలిక… ఆ తర్వాత తప్పుకోవడం అసాధ్యంగా మారిపోవచ్చు. పై అధికారి పెట్టే బాధ్యత కావచ్చు, కొలీగ్ అడిగే సాయం కావచ్చు, వచ్చిన పనిలో నాణ్యత కావచ్చు… తలాడించే ముందు ఒక్క క్షణం ఓపిక పడితే, ఆ పని చేయడంలో సాధకబాధకాలను ముందే నివృత్తి చేసుకుంటే పని సజావుగా సాగిపోతుంది. లేకపోతే తిట్టుకుంటూ పని చేయడం అటుంచితే… వాయిదాలు వేయడం, మాటామాటా పెరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
తీవ్రతను బట్టి ప్రతి వైఫల్యమూ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ఆ విస్ఫోటనంలో అసహనం బయటపడటం సహజం. దాంతో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడమో, తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడమో జరుగుతుంటుంది. గెలుపోటములలో ఒక భాగంగా వైఫల్యాన్ని అంగీకరించినప్పుడు, పరిస్థితులను అంచనా వేసేందుకు గొప్ప అవకాశంగా భావించినప్పుడు… అసహనం ఉండదు.
నిరూపించుకోవాలంటే కష్టపడి తీరాల్సిందే. శక్తియుక్తులను పూర్తిగా వినియోగించాల్సిందే! కానీ, అటు శరీరమూ, ఇటు మనసూ ఒత్తిడిలోకి జారకుండా, నీరసించి పోకుండా గమనించుకుంటూ ఉండాలి. పనికీ పనికీ మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, పనిగంటల విషయంలో పరిమితి గమనించుకోవడం, కుటుంబంతో కాసేపు సమయం గడపడం, వ్యాయామానికీ తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
పని అన్నాక రకరకాల సలహాలు వినిపిస్తాయి. వినడంలో తప్పు లేదు. వాటి గురించి కాసేపు విశ్లేషించడం వల్ల సమయం వృథా కాదు. మెదడుకి మూతపెట్టేసి, సలహా వినిపిస్తే చిరాకుపడిపోతే… కొన్నిసార్లు విలువైన సూచనలు చెవి పక్క నుంచి జారిపోవచ్చు. సలహాలు వినేందుకు సానుకూలంగా లేకపోతే అనుభవజ్ఞులు దూరమైపోవచ్చు.
అందరికీ ప్రతి విషయంలోనూ అన్నీ తెలియాలని లేదు. సకలశాస్త్ర పారంగతుడు ఈతలో ప్రావీణ్యుడు కాకపోవచ్చు. కానీ, చాలామంది ఇతరులను అడిగేందుకు సిగ్గుపడతారు. చులకన అవుతామని వాపోతారు. సాంకేతికంగానే కాదు… ఏదన్నా కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని ఇతరులతో పంచుకునేందుకు మొహమాటపడతారు. సలహా అయినా, ఓదార్పు అయినా నోరు తెరిచి అడిగినప్పుడు అంతరాలు కరిగిపోతాయి. పరిష్కారానికి ఎంపికలు పెరుగుతాయి.
– కె.సహస్ర