బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం! అంటూ వచ్చే కాల్స్ నమ్ముతున్నారా? ఉద్యోగం ఇస్తామని చెప్పే నకిలీ కాల్స్‌తో విసిగిపోయారా? అయితే, మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పుడో ‘డిజిటల్ సెక్యూరిటీ గార్డ్’ ఫీచర్ రాబోతున్నది. అదే CNAP!! ఏంటీ ఫీచర్ అంటే.. దీంతో ఫేక్ కాల్స్ చెక్ పెట్టొచ్చు.. దీంతో మీ డబ్బు, సమయం ఆదా అవుతుంది. అదెలాగో తెలుసుకుందాం!
ఈ రోజుల్లో మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌లో సగం కంటే ఎక్కువ స్పామ్, ఫ్రాడ్ కాల్సే ఉంటున్నాయి. ‘డబ్బు రెట్టింపు చేస్తాం.. KYC అప్డేట్ చేయండి.. ఉద్యోగం ఇస్తాం’ అంటూ మోసాలు పెరిగిపోతున్నాయి. స్పామ్ కాల్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. సగటున ఒక వ్యక్తికి నెలకు 17 స్పామ్ కాల్స్ వస్తున్నట్లు ఒక నివేదిక చెబుతున్నది. ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టడానికి ట్రాయ్ (TRAI) ఓ టెక్నాలజీ అప్డేట్తో ముందుకు వచ్చింది. అదే CNAP (కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్) వ్యవస్థ. ఇదేం చేస్తుందంటే.. మీకు కాల్ వచ్చినప్పుడు నంబర్‌తో పాటు, కాల్ చేసే వ్యక్తి పేరు (ధ్రువీకరించినది) కూడా స్క్రీన్‌పై కనిపించేలా చేస్తుంది. ఈ పేరు, ఇతర వివరాలు ప్రభుత్వ డాక్యుమెంట్స్ (CAF-కస్టమర్ అప్లికేషన్ ఫామ్) ఆధారంగా టెలికాం ఆపరేటర్లు సేకరించిన డేటాబేస్ నుంచి వస్తుంది.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తే.. ఇట్టే పట్టేసి.. వారి పేరు వివరాలు చూపించే ట్రూకాలర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మనం వాడుతున్న ట్రూకాలర్ లాంటి ఇతర యాప్‌లు ఎలా పని చేస్తాయో తెలుసు కదా! ఫోన్లో యూజర్లు సేవ్ చేసిన పేర్లను బట్టి చూపిస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తిని ఓ నలుగురు ఫోన్ వినియోగదారులు ఫేక్ అని నేమ్ ఇస్తే.. ఆ నెంబర్ని అందరికీ అదే పేరుతో చూపిస్తుంది ట్రూకాలర్. కానీ, CNAP వ్యవస్థ అలా కాదు. ఈ సమాచారం టెలికాం ఆపరేటర్లు సేకరిస్తాయి. దీంతో ఆ డేటా కచ్చితమైనది, నమ్మదగినదిగా అనుకోవచ్చు. దీంతో మీకు గుర్తు తెలియని వారి నుంచి వచ్చే కాల్స్‌ని ఇట్టే నిర్ధారించుకోవచ్చు. దీంతో స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడం సులభం అవుతుంది.
పాత పద్ధతి : ‘నేను మీ బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను. మీ OTP చెప్పండి’ అని కాల్ వస్తే, ఫోన్లో పేరు కనిపించదు. దీంతో మోసపోయే ప్రమాదం ఉంది.
CNAPతో : ఆ కాల్ చేసిన వ్యక్తి పేరు ఫేక్ పర్సన్ అయితే… కాలర్ ఐడీలో ఆ వ్యక్తి పేరో, సదరు వ్యక్తికి చెందిన సర్వీస్ పేరో వస్తుంది కానీ, బ్యాంకు పేరు కనిపించదు. దాంతో అవతలి వ్యక్తి ‘బ్యాంకు మేనేజర్’ అని చెప్పినా, మనం గుడ్డిగా నమ్మేయం.
వ్యవస్థలో సమాచారం చేరవేయడానికి ఫోన్ ప్రధాన సాధనం. అందుకే ఇకపై ఈ కమ్యూనికేషన్‌ని మరింత నమ్మదగినది CNAP మార్చేస్తుంది. అదెలాగంటే.. ఏదైనా కంపెనీ మీకు ఉద్యోగం ఇవ్వడానికి లేదా ముఖ్యమైన సమాచారం చెప్పడానికి కాల్ చేసినప్పుడు.. ఆ కంపెనీ వివరాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. అధికారికంగా రిజిస్టర్ చేసిన పేరు, ఇతర వివరాలు స్క్రీన్ మీద వచ్చేస్తాయ్. దీంతో కంపెనీల కమ్యూనికేషన్స్‌పై విశ్వసనీయత పెరుగుతుంది.
గోప్యతకు భద్రత : థర్డ్ పార్టీ యాప్‌ల మాదిరిగా మీ డేటా యాక్సెస్ కోసం ఎలాంటి పర్మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. CNAP టెలికాం ఆపరేటర్ నుంచి అందుబాటులోకి వచ్చిన వ్యవస్థ కావడంతో మీ వ్యక్తిగత డేటాను కోరే అవసరం రాదు. దీంతో థర్డ్‌పార్టీ యాప్‌లపై ఆధారపడటం తగ్గుతుంది.
CNAP అనేది ఫోన్ చేసిన వ్యక్తి పేరును రియల్ టైమ్‌లో తెలియజేస్తుంది. ప్రతి టెలికాం ఆపరేటర్‌కు (జియో, ఎయిర్ టెల్) సురక్షితమైన డేటాబేస్ ఉంటుంది. ఇది ప్రతి మొబైల్ నంబర్‌ను దాని యూజర్ పేరుకు మ్యాప్ చేస్తుంది. మీరు ఎవరికైనా వ్యక్తికి కాల్ చేసినప్పుడు.. మీ నెట్వర్క్ (ఉదా: జియో) మీ పేరును వారి నెట్‌వర్క్‌కు (ఉదా: ఎయిర్‌టెల్‌కు) పంపుతుంది. ఎయిర్టెల్ సిస్టమ్ ఆ పేరును వెంటనే తీసుకుని.. కాల్ అందుకుంటున్న వ్యక్తి స్క్రీన్‌పై చూపిస్తుంది. ఈ సదుపాయాన్ని ట్రాయ్ మొదటిగా 4G, 5G నెట్‌వర్క్‌లలో అమలు చేయాలని కసరత్తు చేస్తున్నది. ఎందుకంటే పాత 2G, 3G సిస్టమ్స్‌లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 2022లోనే ట్రాయ్ ఈ ఆలోచనను మొదలుపెట్టింది. ఎయిర్టెల్, జియో లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే మహారాష్ట్ర, హరియాణా రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో CNAP ట్రయల్స్ మొదలుపెట్టాయి. ఇవి విజయవంతం అయితే, 2026లో CNAP దశలవారీగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
ప్రైవసీ టెన్షన్: యూజర్ అనుమతి లేకుండా పేరును చూపించడం అనేది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌ని ఉల్లంఘించినట్టు అవుతుంది. అందుకే TRAI యూజర్ల అనుమతి తీసుకునే విధానంలో పారదర్శకత ఉండాలని నిపుణులు కోరుతున్నారు.
డేటా లీక్ భయం: టెలికాం కంపెనీలు రియల్ టైమ్‌లో పేర్లను పంచుకునేటప్పుడు డేటా లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.