అది 1990. అప్పట్లో ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక బడి, నాలుగు పచారీ కొట్లు, పంచాయతీ కార్యాలయంతో పాటుగా… ఆ పల్లె జీవితంలో భాగమయ్యేది ఓ చిన్న క్లినిక్. పిల్లలకి జ్వరం వచ్చినా, చెవిపోటు మెలిపెట్టినా, పెద్దోళ్ల మోకాళ్ల నొప్పులైనా, రక్తపోటు లాంటి జీవితకాలపు సమస్యలైనా… ఆ దవాఖానకే దారి. డాక్టరుగారు సౌమ్యంగా ఉన్నా చిర్రుబుర్రులాడినా జనం దృష్టిలో తను దేవుడే. తన హస్తవాసి అలాంటిది మరి. కిటకిటలాడే గదిలో ఒకరి తర్వాత ఒకరుగా రోగ లక్షణాలు చెబుతుంటే, వింటూనే ఠకఠకా మందులు రాసేస్తారు. ఆ లక్షణాలు తగ్గకపోయినా, పరిస్థితి విషమంగా తోచినా… వెంటనే పెద్దాసుపత్రికి సిఫార్సు చేసేస్తారు.
రోగిని ఇంతని ఫీజు అడగకపోవచ్చు. తర్వాత ఇస్తానన్నా పట్టించుకోకపోవచ్చు. జన్మనిచ్చిన తల్లిలాగే, పెద్దచేసే తండ్రిలాగే, చదువు చెప్పే గురువులాగే… ఆయన కూడా మనల్ని ఆరోగ్యంగా చూసుకునే బాధ్యతను తీసుకున్నారు మరి. అందుకే ఇప్పటికీ చాలామందిని వాళ్ల ఊరి జ్ఞాపకాలు గుర్తుచేస్తే అందులో ఆ ఫ్యామిలీ డాక్టర్ తప్పకుండా గుర్తుకొస్తాడు. వాళ్లలో చాలామంది ఆర్ఎంపీలు కావచ్చు.
ఎంబీబీఎస్లూ ఉండవచ్చు. సర్జ్న్లూ కనిపించవచ్చు. కానీ ఫ్యామిలీ డాక్టర్‌గా ఇంటిల్లిపాదినీ కాచుకున్న చరిత్ర వాళ్లది. కానీ ఇప్పుడు పిల్లలకి, మోకాళ్ల నొప్పులకీ, డయాబెటిస్‌కీ, కిడ్నీ రాళ్లకీ… అన్నిటికీ వేర్వేరు డాక్టర్లు. తప్పేం కాదు. కానీ ఈ హడావుడిలో మాయమైపోతున్న ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ, దానివల్ల కలుగుతున్న నష్టాలను మాత్రం ఓసారి తలుచుకోవాల్సిందే!
ఓ యాభై ఏళ్ల గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. రోగాన్ని గుర్తించడం, చికిత్స, మందులు అన్నిటిలోనూ సౌలభ్యం పెరిగింది. రవాణాలో మార్పు వల్ల ‘పెద్దాసుపత్రులు’ మరింత చేరువయ్యాయి. కానీ మన కుటుంబాన్ని గమనించుకోవాల్సిన ఫ్యామిలీ డాక్టర్ అవసరం మాత్రం అలాగే ఉంది. ఇంకా మాట్లాడితే తన బాధ్యత మరింత పెరిగింది. కానీ అటువైపు వెళ్తున్న వైద్యులు, వారి దగ్గర చికిత్సను కోరుకునే రోగుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోతున్నది. నిశ్శబ్దంగా వచ్చిన ఈ మార్పు వెనుక కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. దానికంటే ముందు కాస్త మంచిని తల్చుకుందాం…
ఒకప్పుడంటే పది రూపాయల ఫీజు తీసుకున్నా ఆదాయం కింద చెల్లిపోయేది. కానీ రోజులు మారాయి. వైద్య విద్య పూర్తిచేయడానికి అయ్యే విపరీత ఖర్చులతో పాటు ప్రపంచీకరణ పుణ్యమా అని జీవనశైలి ఖర్చులూ పెరిగిపోయాయి. క్లినిక్‌ల నిర్వహణ వ్యయాలూ పెరిగాయి. ఓ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్ డాక్టర్‌గా పనిచేసినా, కడుపులో చల్ల కదలకుండా వచ్చే ఆదాయం… ప్రత్యేకమైన క్లినిక్‌ల ద్వారా రావడం లేదన్నది చాలామంది ఆవేదన. కేవలం ఆర్థికపరమైన సమస్యలే కాదు! ఇతరత్రా చాలా సమస్యలూ వారిని వేధిస్తున్నాయి.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఫ్యామిలీ మెడిసిన్ రంగంలో మరో స్పెషలైజేషన్ చేస్తే ‘ఫ్యామిలీ ఫిజీషియన్’గా గుర్తింపు దొరుకుతుంది. రోగ నిర్ధారణ మొదలుకుని రోగులతో అనుబంధం పెంచుకోవడం వరకూ ఈ కోర్సులో ఓ కుటుంబ వైద్యుడికి ఉండాల్సిన అన్ని నైపుణ్యాలనూ నేర్పిస్తారు. అలాగని వీరు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్లుగా చెలామణీ అవ్వాలనే నిబంధన ఏమీ లేదు. ఎంబీబీస్తో ఆగిపోయినవారు, ఎంబీబీఎస్ తర్వాత సర్టిఫికెట్ కోర్సులు చేసినవారు, ఆర్ఎంపీ లాంటి కొన్ని గుర్తింపులు తెచ్చుకున్నవారూ… అంతదాకా ఎందుకు! ఏదన్నా రంగంలో స్పెషలైజేషన్ చేసినా కూడా అన్నిరకాల వ్యాధులనూ పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నవారు ఫ్యామిలీ డాక్టర్లే!
మన దేశంలో ప్రతీ 834 మందికీ ఓ వైద్యుడు ఉన్నాడని గణాంకాలు చెబుతున్నాయి. చాలా దేశాలతో పోలిస్తే ఇది మెరుగైన సంఖ్యే అని ప్రపంచ ఆరోగ్య సంస్థే చెబుతున్నది. కానీ వీళ్లలో ఎక్కువ శాతం నగరాల్లోనే ఉంటున్నారు. పల్లెల్లో ఉంటున్న నాలుగో వంతు మంది వైద్యులకు తోడు, ఆర్ఎంపీలు, ప్రాథమిక ఆరోగ్య నిపుణులే అక్కడి వైద్యానికి కీలకం. 65 శాతం జనాభా గ్రామాల్లోనే ఉండే మన దేశంలో చిన్నాచితకా సమస్యలన్నిటికీ ఫ్యామిలీ డాక్టర్లే సంజీవని. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలకైనా, కొవిడ్ లాంటి ఉపద్రవాల్లో అయినా ఈ ఫ్యామిలీ డాక్టర్లదే ముఖ్యపాత్ర. మరో విషయం… అపరిశుభ్రత, కలుషిత నీరు లాంటి సమస్యలు అక్షరాస్యత, అవగాహన తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ. వీటి విషయంలో హెచ్చరించే బాధ్యత తీసుకుంటున్నారు అక్కడి వైద్యులు.
మన స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 2.1 శాతం మాత్రమే బడ్జెట్లో వైద్య రంగం కోసం కేటాయించినట్టు తెలుస్తుంది. దీన్నిబట్టి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందాల్సిన అగత్యం ఉంది. అందుకు ఒకటే జవాబు! కుటుంబ వైద్యుడు. తను అండగా లేకపోతే దేశంలోని మధ్య, దిగువ తరగతి ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంగా మారిపోతుంది. ఇప్పటికీ అయిదురూపాయల డాక్టరు, పదిరూపాయల డాక్టరు అంటూ నామమాత్రపు ఖర్చుతో చికిత్స చేసే వైద్యుల గురించి గొప్పగా చెప్పుకొంటున్నాం అంటే కారణం… మానవతా దృక్పథం ఉన్న వైద్యుల పట్ల మనకు ఉన్న అభిమానమే. అలాంటి వైద్యులకు అండగా నిలిచే ఫ్యామిలీ డాక్టర్ రంగాన్ని ఆదరించి, నిలబెట్టడం మన చేతుల్లో కూడా ఉంది.
– కె.సహస్ర