వింధ్య పర్వత సానువుల్లో ఉంటుంది చిత్రకూట్. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులు పంచుకున్న ఈ ప్రదేశం.. యుగాల కిందట సీతారాముల జీవితాన్ని పంచుకుంది. సీతారాముల వనవాస కాలాన్ని మధుమాసంగా మార్చిన ప్రకృతి సౌందర్యం చిత్రకూట్ సొంతం. అత్రి, మార్కండేయ మహర్షి వంటి తపోధనుల పరిచయ భాగ్యం రామయ్యకు కలిగించిన పుణ్యతీర్థమిది.
అనసూయదేవి అనుగ్రహం సీతమ్మకు లభించిన చోటిది. ఇక్కడున్నంత కాలం కష్టమేంటో తెలియకుండా సాగిపోయింది రామయ్య జీవితం ఆనాటి పౌరాణిక ఘట్టాలను చిత్రకూట పర్వతంపై నేటికీ చూడొచ్చు. రామయ్య జలకాలాడిన రామ్ ఘాట్, సీతమ్మ స్నానమాడిన సీతాకుండ్, సౌమిత్రి కాపలా ఉన్న లక్ష్మణ గిరి, భరతుడు శ్రీరాముణ్ని కలిసిన నెలవు ఇవన్నీ రామాయణ కావ్యాన్ని దృశ్యరూపంలో చూపుతాయి.
చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణ చేస్తే.. కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఐదు కిలోమీటర్లు నడిచి గిరి ప్రదక్షిణ చేస్తారు. దారిపొడవునా ఉన్న రామాయణ విశేషాలను, ఆలయాలను చూసి తరిస్తారు. ఈ పుణ్యధామంలోనే తులసీదాసుకు రామసాక్షాత్కారం లభించిందని చెబుతారు. నేటికీ ఎందరో భక్తులు చిత్రకూట్ వచ్చి.. రామనామ సాధనలో కాలం గడుపుతుంటారు.
నెలల తరబడి అక్కడే ఉండిపోతారు. ఇక్కడ గుప్త గోదావరి (గుహలో నది పారుతుంటుంది) సందర్శించాల్సిన మరో ప్రదేశం. చిత్రకూట్ సమీపంలో రామాయణ ప్రాశస్త్యాన్ని తెలిపే క్షేత్రం చిత్రకూట్ ధామ్ కూడా దర్శనీయమే.
చేరుకునేదిలా: హైదరాబాద్ నుంచి సత్నాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి చిత్రకూట్‌కు (78 కి.మీ.) బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. సత్నా నుంచి చిత్రకూట్ధామ్కు రైళ్లు కూడా ఉన్నాయి.