సీ॥ అక్షయ క్ష్మాభార దక్ష దక్షిణ భుజా
కౌక్షేయక క్షత్త్ర రక్షితంబు
కూటకోటీ శాతకుంభ కుంభ ప్రభా
మండితాంభోజాప్త మండలంబు
గంధసింధుర గాన గంధాంధమత్త పు
ష్పంధయ ఝంకార బంధురంబు
విశ్వవిశ్వంభరానశ్వరైశ్వర్య ప్ర
దాశ్వరత్న వ్రాత శాశ్వతంబు
తే.గీ॥ సంతతోత్సవ తోషిత శంభులింగ
సమ్ముఖేందు శిలానంద చారు మంట
పస్థలీ నృత్యదంగ నాపాద రణిత
నూపురంబగు నేకశిలా పురము!
ఇది చరిగొండ ధర్మన్న రచించిన ‘చిత్ర భారతం’ అనే కావ్యంలోని ఓరుగల్లు పట్టణ వర్ణన. గంటకు నూరు పద్యాలు చెప్పగల శతావధాని ఆయన. షితాబ్ ఖాన్ (సీతాపతి) అని పిలుచుకునే ఓరుగల్లు రాజు వద్ద మంత్రిగా ఉన్న ఎనుములపల్లి పెద్దనకు ఈ కృతిని అంకితం చేశారు. చరిగొండ ధర్మన్న చిత్ర భారతాన్ని తెలుగు భాషలో తొలి తెలుగు ప్రబంధంగా భావిస్తారు ప్రముఖ సాహిత్య పరిశోధకులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు.
నాటి ఓరుగల్లు పట్టణ వైభవం ఎలాంటిదో ఈ పద్యంలో చక్కని శ్లేష ద్వారా తెలియ జేస్తున్నారు కవి. అక్షయమైన భూమి భారాన్ని మోయడంలో దక్షుడైన రాజు (షితాబ్ ఖాన్) దక్షిణ హస్తంలోని ఖడ్గంతో రక్షణ పొందుతున్నది. దక్షిణ భుజా అనడంలో పలువురు నాయికలందు సమానమైన ప్రేమను చూపువాడుగా ఆ రాజు లక్షణం గమనించవచ్చు. కుంభ అంటే వారాంగనలు అనే అర్థంలో అతిశయించిన బంగారు పాలిండ్లు గల వేశ్యలనే అంభోజలతో అలంకృతమైన మండలంగా అభివర్ణించారు కవి. మరో కోణంలో కుంభ అంటే ఏనుగు కుంభ స్థలం అనే అర్థం.
బంగారు కుంభ స్థలాలు గల శ్రేష్టమైన ఏనుగుల సమూహంతో అలంకరించిన సూర్య మండలంలా ప్రకాశిస్తున్న పట్టణంగా భావించవచ్చు. ఆ ఏనుగుల నుంచి స్రవిస్తున్న మదజలం గ్రోలుతూ మత్తులో ఝంకారాలు చేస్తున్న తుమ్మెదలతో కూడి ఉందట ఓరుగల్లు. భూమిపై శాశ్వత సంపదలుగా భాసిల్లే మేలు జాతి గుర్రాలను కలిగి ఉంది. ఎల్లప్పుడూ ఉత్సవాలు జరిగే ఆనందం కలిగించే శంభు లింగేశ్వరుని ఎదురుగా గల అందమైన శిలా మంటపంలో నృత్యం చేస్తున్న పాదాల నూపురాల శబ్దమై విలసిల్లుతున్నది ఓరుగల్లు పట్టణం అంటారు కవి. అంటే నిత్య చైతన్యంతో అలరారుతున్నదని వర్ణించారు.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ