Child Writers | అ.. అమ్మ, ఆ.. ఆవు దగ్గరే నేటి తరం తెలుగు వికాసం ఆగిపోతున్నది. పాఠ్యాంశాల్లోని తెలుగు గేయాలు, కథలు మార్కులు సాధించడం వరకే అక్కరకొస్తున్నాయి. బాల సాహిత్యం ఊసులేకుండా బడి చదువు పూర్తి చేసుకుంటున్నారు నేటి విద్యార్థులు. అందుకే పేరుకే మాతృభాషగా తెలుగు మిగిలిపోతున్నది. ఈ పరిస్థితికి చరమగీతం పాడుతూ బాల్యంలోనే భాషా పరిమళాలను పరిచయం చేస్తున్నది ‘ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక’. ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు అన్నిటినీ బాలసాహిత్యమనే గొడుగు కిందికి తీసుకొచ్చి విద్యార్థుల భాషా వికాసానికి దోహదం చేస్తున్నది. బాలల సాహిత్యాన్ని బాలలే రాసేలా వారిని తీర్చిదిద్దుతున్నది. బాల కవులకు వేదిక నిర్మించి మాతృభాషను మరోతరానికి చేరువ చేస్తున్నది.
చందమామ కథలు.. పిల్లల్లో భాషా సామర్థ్యాలను పెంచుతాయి. బాలల సాహిత్యం వారి మేధస్సుకు పదను పెడుతుంది. పెరిగిన సాంకేతికత పిల్లల్లో పఠనాసక్తిని నిర్వీర్యం చేస్తున్నది. కథలు, కవితలు రాయడం మాట అటుంచితే.. చదవడం కూడా మానేసింది ఈ తరం. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక’ నూతన ఒరవడికి నాంది పలికింది. క్లాస్రూమ్ పాఠాలు విజ్ఞానాన్ని చెప్పేవి అయితే, బాలసాహిత్య వేదిక వారిలో సాహిత్యంపై జిజ్ఞాసను పెంపొందిస్తున్నది. కొందరు ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు కలిసి నిర్మించిన ఈ వేదిక బాలసాహిత్యాన్ని వేడుకగా విద్యార్థులకు చేరువ చేస్తున్నది. గ్యాడ్జెట్ల రేడియేషన్తో సృజనాత్మకత అడుగంటిన పసి హృదయాలను ఊహాలోకంలో విహరింపజేస్తున్నది. బాలసాహిత్యం ఎంత విరివిగా లభిస్తే అంతగా బాలల మనో వికాసానికి దోహదం చేస్తుందనే సత్యాన్ని నమ్ముతారు ఈ వేదిక సభ్యులు. అందుకే కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు.. ఇలా ఏ రూపంలో అయితేనేం.. బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేసే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.
వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు మంచి పుస్తకాలు సేకరించి, అడిగిన వారికి అందిస్తున్నారు వేదిక సభ్యులు. బాలసాహిత్యం మీద ఆసక్తి చూపించే పాఠశాలల్లో సృజన కార్యశాలలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాస్థాయిలో విద్యార్థులకు కవితా, కథా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. బాల కవి సమ్మేళనాలు, నాటిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. విశిష్ట సేవలు అందించిన బాలసాహితీవేత్తలను సత్కరించి ప్రోత్సహిస్తున్నారు. బాలసాహితీ సృజనలో రాష్ట్రస్థాయి బహుమతులు పొందిన కవులను ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థుల కవితలు, కథలతో సంకలనాలు ప్రచురిస్తున్నారు. బాలసాహిత్య పుస్తకాల ఆవిష్కరణకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. బాలసాహిత్యం మీద కృషి చేస్తున్న పరిశోధకులకు చేయూతను అందిస్తున్నారు. బాలసాహిత్య పుస్తకాలను ఒకచోట భద్రపరిచే ఆలోచనతో ఉన్నారు. పిల్లలు రాసిన కవితలు, గేయాలు, కథల్లో మంచివాటిని ఎంపిక చేసి పుస్తకాలుగా తీసుకువస్తున్నారు. ఇలా బాలసాహిత్యాన్ని, బాలల్లో సాహితీ అభిలాషను పెంపొందించేలా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నది ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక.
బాలసాహిత్యం రెండు రకాలు. పిల్లలు పిల్లల కోసం రాసేది ఒకటైతే, పిల్లల కోసం పెద్దలు రాసేది మరొకటి. పిల్లల్లో మంచి ప్రవర్తన, మంచి ఆలోచన కోసం పెద్దలు వివిధ ప్రక్రియల్లో సాహిత్య రచన చేస్తారు. పిల్లలు తమ ఆలోచనలు, సృజన, భావుకత, భావ వ్యక్తీకరణ, పరిసరాలను గమనించిన తీరును అక్షరీకరిస్తారు. అయితే పిల్లల కోసం పిల్లలతో రాయించడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నది ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక. అలాగని పెద్దలు అందించిన బాలసాహిత్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం తమ ఉద్దేశం కాదని చెబుతారు సాహిత్య వేదిక నిర్వాహకులు. సుమారు 50 మంది సభ్యులతో లక్ష్యం వైపు వడివడిగా సాగుతున్న ఈ వేదిక మరెందరో భావి కవులను అందించి కొత్త ఒరవడిని సృష్టించాలని ఆకాంక్షిద్దాం!!
ఈ సంస్థ నెలకొల్పిన మొదటి మాసంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టారు వేదిక నిర్వాహకులు. ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు కాసర్ల నరేశ్రావు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయనకు మద్దతుగా ప్రవీణ్ శర్మ, శ్రీనివాస గుప్త, శారదాహన్మాండ్లు ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ‘ఉగాది బాల కవి సమ్మేళనా’లను నిర్వహించిందీ సంస్థ. నిజామాబాద్ జిల్లా గుండారం, తడ్పాకల్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఈ వేడుకలకు వేదికలయ్యాయి. నిజామాబాద్లో నిర్వహించిన బాలకవి సమ్మేళనం విద్యార్థుల పటిమకు అద్దం పట్టింది. నిన్నమొన్న కలం పట్టి తమ చిట్టి చేతులతో పొట్టి పొట్టి కథలు రాస్తున్న చిన్నారులు అంతర్జాతీయ కథా సదస్సులో పాల్గొంటున్నారంటే ఈ వేదిక సభ్యుల ద్వారా వారు పొందుతున్న తర్ఫీదు ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.