ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ తేనీరు దినోత్సవంగా జరుపుకొంటారు. సందర్భం ఏదైనా సరే భారతీయులకు ఓ కప్పు టీ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తంగా చూస్తే మనకు టీ అంటే పానీయానికంటే ఎక్కువే. అదో రోజువారీ సంస్కారం, పనిలో విరామం, నలుగురూ ఓచోట చేరడానికి, మాట్లాడుకోవడానికి ఓ సాకు. అది ఉషోదయం వేళ మరిగే తొలి కప్పు చాయ్ అయినా, మధ్యాహ్న విరామంలో మిత్రులతో పంచుకునేదైనా వేడివేడి టీ మనకు కొన్ని అనుభూతుల్ని తప్పకుండా మిగులుస్తుంది. ఓ కప్పు చాయ్ అంటే నలుగురు కలిసి చేతులు కలుపుకోవడం మాత్రమే కాదు, ప్రేమను పంచుకోవడం కూడా. ఇలాంటి స్ఫూర్తికి పశ్చిమబెంగాల్ రాష్ట్రం సెరాంపూర్‌లో కొలువైన ఓ చిన్న చాయ్ దుకాణం నిలువెత్తు నిదర్శనం. అలాగని ఇది ఏదో రోడ్డువారగా ఉండే మామూలుగా టీ కొట్టు మాత్రం కాదు. ఈ దుకాణంలో ఉద్యోగులు ఉండరు. జీతభత్యాలు ఉండవు.
అయినప్పటికీ వందేండ్లకు పైగా ఈ దుకాణం నమ్మకం, ప్రేమ పునాదులుగా నడుస్తూ లెక్కలేనన్ని కప్పుల చాయ్‌ను జనాలకు అందించింది. ఈ దుకాణం యజమాని అశోక్ చక్రబర్తి పొద్దునే కొట్టు తెరుస్తాడు. సాయంత్రం 7 గంటల వరకు టీ అమ్ముతాడు. ఈ వ్యాపారంలో స్థానికులు, అదీ రిటైరైన ఉద్యోగులు, చాలాకాలంగా వస్తున్నవాళ్లు ఓ పది పన్నెండు మంది ఆయనకు సహకరిస్తూ కనిపిస్తారు. వాళ్లు ఆ టీ కొట్టుకు యజమానులు కాకపోయినా టీ తయారీలో అశోక్‌తోపాటు తామూ ఓ చేయి వేస్తారు. వచ్చేవాళ్లకు టీ అందిస్తారు. స్థలాన్ని శుభ్రం చేస్తారు. టీ తాగినవాళ్లు కూడా అక్కడున్న గల్లాపెట్టెలో డబ్బులు నిజాయతీగా ఉంచి వెళ్లిపోతారు. ఇవన్నీ చేసినందుకు అశోక్ చక్రబర్తి నుంచి వాళ్లెవ్వరూ కూడా ఒక్క రూపాయి ఫలితాన్ని ఆశించరు. అలాగని ఇదేం ఒప్పందం కాదు. తామంతా ఒక్కటనే భావనతోనే ఇలా చేస్తారు. అలా చాయ్ దుకాణాన్ని ఓ అడ్డాగా, అనధికారిక సమావేశ స్థలిగా మార్చేశారు. ఈ క్రమంలో కథలు చెప్పుకొంటారు. వాడివాడి చర్చలు కొనసాగుతాయి. జోకులు పేలుతూ ఉంటాయి. వచ్చేవాళ్లు వస్తుంటారు. వెళ్లేవాళ్లు వెళ్తుంటారు. మిగిలిపోయేవి అనుభూతులు మాత్రమే. అక్కడికి వచ్చే వాళ్ల మాటల్లో చెప్పాలంటే ఇది కేవలం చాయ్ దుకాణం మాత్రమే కాదు ఓ సంస్థ.