ఇన్స్పెక్టర్ రుద్ర ఐదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో, భయపడిపోతూనే శరత్.. ‘ఈ చంద్రముఖి.. ఆ చంద్రముఖీ దేవి ఒకటే’ అంటూ కండ్లతోనే సైగ చేశాడు. ఆ వెంటనే.. ‘ఏయ్.. శరత్! నువ్వు చంపింది గంగను, చంద్రముఖిని కాదురా.. చంద్రముఖీ దేవిని’ అంటూ గట్టిగా అరిచాడు రుద్ర. అసలేం జరుగుతుందో అర్థంకాక అక్కడున్న వాళ్లంతా నిశ్చేష్టులై ఉండిపోయారు.
వెంటనే తన మొబైల్ ఫోన్‌ను అందుకొన్న రుద్ర.. అప్పటికే పోస్ట్‌మార్టంకి పంపించిన డెడ్ బాడీలను వెంటనే వెనక్కి తీసుకురావాలని తన సిబ్బందిని ఆదేశించాడు. రుద్ర అంతగా కంగారుపడుతుండటంతో ఏమిటీ? అంటూ ఆరా తీసింది జయ. రుద్ర చెప్పడం ప్రారంభించాడు. ‘కాంచన తమ్ముడిగా పుట్టిన గంగాధర్ మామూలు వ్యక్తి కాదని అంటారు. తమ పూర్వికుల దైవాంశ శక్తులు అతనిపై ప్రభావం చూపిస్తాయని చెప్తారు. ప్రత్యేక దినాల్లో అతనిపై వాళ్ల తాతమ్మ చంద్రముఖీదేవి ఆవహించి.. ఈ తండావాసుల కష్టాలను తీరుస్తూ.. సమస్యలకు దారి చూపిస్తుందని ఇక్కడివారి నమ్మకం.
గంగాధర్ అలియాస్ చంద్రముఖీదేవి నీరు లేకుండా ఆచరించే స్నానంలో ఎన్నో శక్తులు వశమై ఉన్నాయంటారు. ఆమె నీటితో వేకువజామున.. ఆ తర్వాత నీరు లేకుండానూ ప్రత్యేక సందర్భాల్లో స్నానం చేస్తుంది’ అంటూ రుద్ర చెప్తుండగా.. మధ్యలో కలుగజేసుకొన్న జయ.. ‘అంటే నువ్వు చెప్పేది.. మంత్ర స్నానాల గురించా?’ అని అడిగింది. అవునంటూ తలూపిన రుద్ర.. ఇలా కొనసాగించాడు.
‘మంత్రాలతో దేహాన్ని ఆవహించేలా చేసే ‘మంత్ర స్నానం’, దేహానికి విభూది రాసుకొనే ‘భౌమ స్నానం’, మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ విభూదిని రాసుకొనే ‘ఆగ్నేయ స్నానం’, ఆవుడెక్కల వల్ల ఏర్పడిన మట్టిని శరీరానికి పూసుకొనే ‘వాయు స్నానం’, ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో ఎండలో నిలబడే ‘దివ్యస్నానం’, తడి వస్ర్తాలతో శరీరాన్ని తుడుచుకొనే ‘మానసిక స్నానం’, తులసి చెట్టులోని జలాన్ని చల్లుకొనే ‘ధ్యాన స్నానం’ ఇలా ఈ అన్ని మంత్ర స్నానాలను ప్రత్యేక దినాల్లో గంగారామ్ చేసేవాడని చెప్తారు. అంటే ఆ సమయాల్లో అతని మీదకు వాళ్ల తాతమ్మ చంద్రముఖీదేవి ఆవహించినట్టు అర్థం చేసుకోవాలి’ అంటూ రుద్ర కాస్త ఆగాడు.
ఇంతలో కలుగజేసుకొన్న శరత్.. ‘అవునురా.. రుద్ర. వాడేదో అమ్మాయిలా ఏవో మంత్రాలు లోలోపల చదువుతూ.. పక్కనే ఉన్న తులసి చెట్టులోని జలాన్ని చల్లుకొంటున్నాడు. అదే సమయంలో మేం వాడిని బంధించి చంపేశాం’ అంటూ ఏదో ఘనకార్యం చేసిన వాడిలా చెప్పాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన రుద్ర.. ‘శరత్ చేసిన పనికి వాడేకాదు.. మనం కూడా ప్రమాదంలో పడినట్లే. చంద్రముఖీదేవి చనిపోయిన విషయం తెలుసుకొని తండావాసులు ఇక్కడికి వచ్చేలోపు మనం వేరేచోటుకి వెళ్లాలి’ అంటూ రుద్ర అందరినీ అలర్ట్ చేశాడు. ఇంతలో కాంచన, గంగ డెడ్‌బాడీలను తీసుకొస్తున్న వ్యాన్ లోయలో పడిందన్న విషయం తెలుసుకొన్న రుద్ర అండ్ టీమ్ షాకయ్యారు. ఇక, అక్కడ ఉండటం మంచిది కాదనుకొని.. శివుడు సాయంతో మరోచోటికి శరత్‌ను తరలించారు.
అలా వేరే చోటికి వెళ్లగానే.. నోటితో విజిల్ వేస్తూ శరత్ ఇలా అన్నాడు. ‘ఒరేయ్.. రుద్ర బంగారం. నన్ను బాగానే షిఫ్ట్ చేశావ్ గానీ.. ఒక్క విషయం మరిచిపోయావ్రా. ఇప్పుడు అది మీ టీమ్ మొత్తానికి ప్రమాదకరంగా మారింది’ అంటూ నవ్వాడు. ‘ఏం మాట్లాడుతున్నావ్‌రా.. ’ అంటూ రుద్ర గద్దించేలోపే.. ‘వెయిట్ బ్రదర్.. ఈ గేమ్ ఇక ైక్లెమాక్స్‌కు వచ్చింది. ఆ సంగతేంటో చెప్పాలంటే.. 5 క్వశ్చన్ల పజిల్ సాల్వ్ చెయ్యి. లేట్ చేశావో నువ్వే బాధపడతావ్’ అంటూ నవ్వాడు. గతంలో ఇలాంటి భయానక అనుభవాలనే ఎదుర్కొన్న రుద్ర.. అడగమంటూ సైగ చేశాడు. గేమ్ స్టార్ట్ చేశాడు శరత్.
మొదటి ప్రశ్న: కొత్త దంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలంటారు. అత్తా-కోడళ్లూ ఒకే గడప దాటొద్దంటారు ఎందుకు?’ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘ఏమ్.. రుద్ర. పెండ్లికాకముందే.. బాగానే స్టడీ చేశావ్’ అంటూ నవ్విన శరత్.. రెండో ప్రశ్న అడిగాడు. ఇంటి ముందు ఉన్న గడపకు పసుపు రాస్తారు ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..’ రుద్ర సమాధానం చెప్పాడు.
మూడో ప్రశ్న: చనిపోయేవారిని ఊరేగించేటప్పుడు పైసలు చల్లుతారు? ఎందుకు?? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు.
నాలుగో ప్రశ్న: ఉప్పును ఎందుకు దొంగిలించవద్దు అంటారు? చేబదులు కూడా ఇవ్వొద్దంటారు.. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ..’ రుద్ర సమాధానం చెప్పాడు.
ఐదో ప్రశ్న: తండ్రీ కొడుకులు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. తండ్రి చనిపోయాడు. చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకును హాస్పిటల్లో చేర్చారు. చికిత్స చేయాల్సిందిగా డాక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ఇతను నా కొడుకు. వాడిని చూస్తూ.. చికిత్స చేయలేను’ అంటూ ఏడ్చారు డాక్టర్. అదెలా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్, టూ, త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. అన్ని ప్రశ్నలకు రుద్ర కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో.. రుద్ర అండ్ టీమ్ ఎదుర్కోబోతున్న ప్రమాదం ఏంటో వివరించి చెప్పాడు శరత్. ఆ విషయం పక్కనబెడితే, శరత్ అడిగిన 5 ప్రశ్నలకు రుద్ర ఏమని సమాధానమిచ్చాడో కనిపెట్టారా?
సమాధానం 1: ఆషాఢమాసం అనారోగ్య మాసం. ఆ నెలలో విపరీత గాలుల వల్ల దుమ్మూ, ధూళీ లేచి పరిసరాలను, నదీతీర ప్రాంతాలను కలుషితం చేస్తాయి. దానికి తోడు వ్యవసాయ పనులనూ ఇప్పుడే ప్రారంభిస్తారు. కొత్తగా వచ్చిన భార్యతో సుఖంగా ఇంట్లోనే ఉంటే ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుంది. దానికి తోడు ఈ మాసంలో గర్భం ధరిస్తే, నెలలు నిండే సమయానికి ఎండలు ముదురుతాయి. అందుకే ఈ నియమం.
సమాధానం 2: పూర్వం పల్లెల్లో పాములెక్కువ. అవి ఇండ్లల్లోకి రావొద్దని రక్షణగా గుమ్మాలకు, గడపకు పసుపు రాసేవారు. దాని ఘాటుకు పాములు, క్రిమికీటకాలు లోపలికి వచ్చేవికావు.
సమాధానం 3: ఎంత ధనం సంపాదించినా.. ఒక్కపైసా కూడా తీసుకెళ్లడంలేదు అని తెలియజేయడానికే ఈ ఆచారం.
సమాధానం 4: పూర్వం ఉప్పు దొరకడం కష్టం. ఉప్పును అమూల్యమైన సంపదగా చూసేవారు. అందుకే దాన్ని దొంగిలించకుండా ఉండేందుకే ఇలా అనేవారు. లాటిన్ పదం సాల్ట్ నుంచే ఇప్పటి శాలరీ వచ్చింది.
సమాధానం 5: డాక్టర్ పేషెంట్ తల్లి
– రాజశేఖర్ కడవేర్గు