కావలసిన పదార్థాలు :
కాలిఫ్లవర్ కాడలు: పెద్ద కప్పు
మిరపకాయలు: అయిదారు
మినుపపప్పు: టేబుల్ స్పూను
శనగపప్పు: టేబుల్ స్పూను
మెంతులు: పావు టేబుల్ స్పూను
ఆవాలు: అర టేబుల్ స్పూను
చింతపండు రసం: రేగుపండు అంత
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఇంగువ: కొద్దిగా
పోపుగింజలు: స్పూను
నూనె: రెండు స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
ముందుగా కాలిఫ్లవర్ కాడలను తీసుకుని బాగా కడగాలి. తర్వాత సన్నగా తరిగి బాణట్లో వేసి కాస్త వేగనిచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి మినుపపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు వేసి వేగనివ్వాలి. తర్వాత సగానికి కోసిన పచ్చి మిరపకాయల్ని కూడా జోడించి నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి. కాస్త చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా పట్టాలి. ఇప్పుడు చల్లారిన కాలిఫ్లవర్ కాడలను మిక్సీలో వేసి ఓ రెండు తిప్పులు తిప్పాలి. అంటే మరీ ముద్ద కాకుండా కచ్చాపచ్చాగా కొబ్బరి పచ్చడిలా ఉండాలన్న మాట. తర్వాత బాణట్లో కాస్త నూనె వేసి పోపుగింజల్ని చిటపటలాడనిచ్చి, తర్వాత కొంచెం ఇంగువ చల్లి ఈ పచ్చడి ముద్దను అందులో వేయాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర రెమ్మల్ని కూడా కలుపుకొంటే… కాలిఫ్లవర్ కాడల పచ్చడి రుచిచూడొచ్చు!