కథ… ఇది లేకపోతే జీవితం లేదు, నాటకం లేదు, సినిమా లేదు, పుస్తకం లేదు, వెబ్ పత్రికా లేదు. ఈ 24 కథల పుస్తక సంకలనం పేరు ‘వెంటాడే కథలు’. పేరు వినగానే ‘ఏదైనా క్రైమ్, డిటెక్టివ్ బాపతు కథల సంకలనమేమో!’ అనుకొన్నాను. తీరా పుస్తకం చేతికి తీసుకున్నాక, పేజీకి పేజీ తిరగేసి వరసగా చదవడం మొదలెట్టాను. అప్పుడు అర్థమైంది ఈ సంకలనానికి ఆ పేరు ఎందుకు పెట్టారో! ఇందులో తెలుగు, ఒరియా, బెంగాలి, హిందీ, తమిళం, గుజరాతి, సింధి, కాశ్మీరి, కన్నడ వంటి భారతదేశ కథలే కాకుండా, జర్మన్, ఆఫ్రికన్, ఫ్రెంచ్, హంగేరి, బెల్జియం, చైనీస్, పాకిస్థానీ వంటి విదేశీ కథలనూ స్పృశించారు రచయిత చంద్ర ప్రతాప్ కంతేటి.
ఈ పుస్తకంలో ప్రతి కథను ఆయన గుర్తుంచుకొన్నంతవరకు స్పష్టంగా వివరిస్తూ, ముగింపులో ఆ కథను విశ్లేషించడం కొసమెరుపు. ఇక ఈ 24 కథల గురించి చెప్పాల్సి వస్తే, ప్రతి కథా ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉంది. ‘ప్రొఫెసర్ గారి స్వయంకృతం’ కథలో వృద్ధాప్యంలో ప్రొఫెసర్ లాంటి ఒంటరితనాన్ని అనుభవించే వాళ్లెందరో మనకు కనిపిస్తారు. దశాబ్దాలనాటి కథ ఇది.
కానీ నేటికీ నడుస్తున్న చరిత్ర. ‘అవినీతి’ అంశంతో వచ్చిన రెండో కథ కూడా నేటికీ సమాజంలో మనకు తెలిసినా, తెలియకపోయినా జరుగుతున్న యదార్థగాథే. ‘మట్టిమనిషి’ కథాంశం కూడా వృద్ధాప్యంలో సమస్యే. ‘మాయా మకరి’ కథ డబ్బే చోదకశక్తి అనే దానిచుట్టూ జరిగే అరాచకాలను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. మానవీయతను చాటిచెప్పే కథ ‘హ్యాపీ టైమ్స్’. ఈ చైనీస్ కథ సినిమాగా వచ్చింది. యూట్యూబ్లో కూడా లభ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ 24 కథల నేపథ్యం నిత్య యవ్వనంగా ఉండి, అందరినీ అలరిస్తాయి.
రచయిత: చంద్ర ప్రతాప్ కంతేటి
పేజీలు:168, ధర: రూ.250
ప్రతులకు: తపస్వి మనోహరం
ఫోన్: 7893467516
రామాయణం అంటే… దండకారణ్యంలో అపహరణకు గురైన సీతమ్మవారి జాడ కనుక్కోవడమే. తప్పిపోయిన సీతను కనుక్కోవటానికి రాముడు ఎంతగానో ప్రయత్నించాడు. దుర్గమమైన అడవుల్లో తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సంచరించాడు. చివరికి సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరులతో కలిసి లంకా నగరంలో రావణుడి అశోకవనంలో బందీగా ఉన్న సీతమ్మను విడిపించుకున్నాడు. అయోధ్యకు తెచ్చుకున్నాడు. ఈ వృత్తాంతం స్ఫూర్తిగా హనుమంతుడు సీతమ్మవారి జాడను కనిపెట్టే వరకు గల రామాయణ ఘట్టాలను వాల్మీకి మహర్షి మార్గంలో క్లుప్తంగా అలతి అలతి పదాలతో 228 ఆటవెలది, తేటగీతి ఛందస్సలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య ‘సీతాన్వేషణము’ పేరుతో రమ్యంగా రచించారు. ఎన్ని రామాయణాలు వచ్చినా దేని ప్రత్యేకత దానిదే అన్నట్టు… భూమయ్య ‘సీతాన్వేషణము’ కూడా ఆ కోవలోదే.
రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పేజీలు: 118; ధర: రూ. 100
ప్రతులకు: ఫోన్: 88970 73999