పుస్తకంలేని ఇల్లు.. ఆత్మలేని శరీరం లాంటిది.
అందరికోసం..
చీకోలు సుందరయ్య ‘తరతరాల తెలుగు విశేషాంశాలు, సాహిత్యాంశాలు’ సాహిత్యంతో పాటు తెలుగువారి సంస్కృతి, జీవనశైలి, మనస్తత్వం, ఇతర భాషలతో ఉన్న సంబంధాలను, పరస్పర ప్రభావాలను, ఉద్యమాలను, శైలీ విన్యాసాలు తదితరాలను స్పష్టం చేస్తాయి.
మొదటిదైన
‘తరతరాల తెలుగు విశేషాంశాలు’ ప్రధానంగా భాష కేంద్రంగా సాగుతుంది. అయినా, ఇందులో తెలుగువారి నవ్వులు, ఏడుపుల వివరణ ఉంది. భోజన ప్రియత్వం, వంటలు, తాంబూల సేవనం ముచ్చటా ఉంది. అలంకరణలు, రకరకాల పెళ్లిళ్ల గురించి తెలిపారు. పురాణాల్లో స్త్రీ పాత్రల గురించి, వారి వ్యక్తిత్వాలు, పగలు, ప్రతీకారాలు, తిరుగుబాట్ల గురించి చర్చించారు. తెలుగు తీయదనాన్ని ఎవరెవరు ఏ విధంగా వర్ణించారో చెప్పారు. ఇక ‘తరతరాల తెలుగు 2’ (సాహిత్యాంశాలు) మొత్తం సాహిత్యం మీద దృష్టి సారించింది. సాహిత్య పత్రికల గురించి, తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సంస్థల గురించి ఇందులో విస్తృతంగా చర్చించారు. ఇవి సాహితీప్రియులకు, వివిధ పోటీ పరీక్షార్థులకు ఎంతో ఉపయోగం.
తరతరాల తెలుగు – 1 (విశేషాంశాలు), తరతరాల తెలుగు- 2 (సాహిత్యాంశాలు)
రచన: చీకోలు సుందరయ్య
పేజీలు: 261, 268
ధర: రూ. 320 (రెండిటికీ కలిపి)
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు
…? కె.వి.కిశోర్‌కుమార్
Books
సరళ సుందరం, గానయోగ్యం
సాహిత్య లక్ష్యాలలో ప్రధానమైంది సన్మార్గ దర్శనం. కంతేటి చంద్రప్రతాప్ కలం నుంచి జాలువారిన ‘సూర్యశతకం’ కూడా అలాంటిదే. సరళత, గాన సౌలభ్యత ఉండేలా ఈ శతకాన్ని రూపుదిద్దారు. సంప్రదాయం నుంచి ప్రయోగం దిశగా పరుగెత్తిన ఈ శతకం ముందుతరం శతకకర్తలకు మార్గదర్శనం చేసేదిగా ఉంది. సూర్యశతకంలో రచయిత అర్థశుద్ధితో పదాలను వాడి సూర్య మహిమను జగత్తుకందించాలన్న లక్ష్యసిద్ధిని పొందారు. ఆస్తికులకూ నాస్తికులకూ, జాతి మత కుల వర్గ లింగ చరాచర భేదాలకు అతీతంగా సూర్యభగవానుడు అందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో దైవమే.
అంతటి కర్మసాక్షి, ప్రత్యక్ష దైవమూ, దినకరుడూ అయిన ప్రభాకర ప్రతాపాన్ని చంద్రప్రతాప్ ప్రస్ఫుటంగా ప్రతి పద్యంలోనూ నింపి అందించారు. పుస్తకంలో చాలా చోట్ల అరుదైన సూర్య భగవానుడి చిత్రాలను జోడించడం వల్ల పాఠకులలో భక్తి భావం మరింత పెంపొందుతుంది. సూర్య శతకాన్ని సరళ సుందర పదాలతోనూ, చక్కగా పాడుకోవటానికి వీలుగా ఉండేలా తీర్చి
దిద్దటంలో కవి కృతకృత్యులయ్యారు.
సూర్యశతకం
రచన: కంతేటి చంద్రప్రతాప్
పేజీలు: 104, వెల: రూ. 100
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు
…? శ్రీమల్లి