సుగంధ ద్రవ్యాల్లో రారాజు మిరియాలు. ఇవి చల్లని ప్రదేశాల్లో పండుతాయి. నేను కేరళలో మిరియాల తోటను మొదటిసారి చూశాను. కొబ్బరి చెట్లకు పాకిన ఈ మిరియాల తీగలను చూసి తమలపాకు తీగలని భ్రమపడ్డాను. మిరియాల పాదు కూడా తమలపాకు తీగలనే పోలి ఉంటుంది. కాకపోతే మిరియాల తీగ కొంచెం గట్టిగా ఉంటుంది. మిరియాల ఆకు తమలపాకు ఆకారంలో ఉంటుంది. కానీ, తమలపాకు కన్నా దళసరిగానూ, పెళుసుగానూ ఉంటుంది. మూడు సంవత్సరాల క్రితం శృంగేరీ తీర్థ యాత్రలో ఉన్నప్పుడు మిరియాల మొక్కను తీసుకువచ్చాను.
ఎక్కువ ఎండలేని వాతావరణంలో పెరుగుతుంది. నేల మీద పాకుతున్న తీగల కణుపుల నుంచి వేళ్లూనుతుండటం గమనించి దాదాపు 10 మొక్కలను తయారు చేశాను. భారతీయులు మిరప పంటను ఎరుగక ముందు మిరియాల పొడిని వంటల్లో కారంగా ఉపయోగించేవారు. ఆహార రుచి పెంచే మిరియాలను ఇప్పుడు కూడా మనం మసాలా దినుసుగా వాడుతున్నాం. మనకు ఎక్కువగా అందుబాటులో ఉండే నల్ల మిరియాలే కాకుండా తెల్ల మిరియాలు, ఆకుపచ్చ మిరియాలు, ఎర్ర మిరియాలు కూడా ఉన్నాయి. ఈ గింజల్లో ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజ పోషకాలు ఉన్నాయి.
ఆయుర్వేదంలో ‘కృష్ణ మరీచం’ గా పిలుస్తారు. ఇవి తలనొప్పి, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, అజీర్తి వంటి జబ్బులకు ఉపశమనం కలిగిస్తాయి. మిరియాలను రోమన్లు, గ్రీకులు ప్రాచీన కాలంలో ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇండియా మిరియాల ఎగుమతి ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జిస్తోంది. ఇది తీగజాతి పంట కాబట్టి పాకడానికి అనువుగా, నిటారుగా పెరిగే చెట్లను ముందుగా పెంచుకోవాలి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నారుమడి పోసుకుని మే, జూన్ నెలల్లో మొక్కలు నాటుకుంటారు. అరకు లోయలోని కాఫీ తోటల్లో మిరియాలు విరివిగా పండుతున్నాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు