హైదరాబాద్ బిర్యానీకీ ప్రసిద్ది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ ఖ్యాతికెక్కిందనే చెప్పాలి. ఆ బిర్యాని రుచికి మూలం మసాలా దినుసులేనని జగమెరిగిన సత్యం. ఆ దినుసుల్లో ముఖ్యమైనది బగారా ఆకు. బిర్యానీ రుచికే కాదు సువాసనకూ ఇది ముఖ్యమైన దినుసు.అందుకే దీనిని బిర్యానీ ఆకు అని కూడా పిలుస్తారు. హిందీలో దీన్ని తేజ్ పత్తా అంటారు. బగారా ఆకు ఒక రకమైన సుగంధం కలిగి ’మామిడాకు’ ఆకృతిలో ఉంటుంది. మొక్క నుంచి పచ్చని ఆకు తెంపి నోట్లో వేసుకుని నమిలినా నోరంతా సువాసన పరిమళం అలుముకుంటుంది.
బిర్యానీ ఆకు కషాయం తాగితే కడుపులో మంట తగ్గుతుంది. మసాల దినుసులతో చేసిన వంటకాలు తింటే అజీర్తి చేస్తుంది. దాన్ని బగారా ఆకు తగ్గిస్తుంది. ఈ ఆకుని అరోమా థెరపీలో ఉపయోగిస్తారు. దాదాపు 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు ఈ చెట్లు ఎదుగుతాయి. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా హిమాలయాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. కొంచెం నీడ ఉండే ప్రదేశాల్లో మన దగ్గర కూడా పెంచుకోవచ్చు. మంచి ఆధాయాన్ని ఇచ్చే ఈ చెట్టు తగిన జాగ్రత్తలు తీసుకుని పెంచితే రైతులకు వాణిజ్యపరంగా కూడా లాభదాయకం.