పుస్తకాలు చూస్తూ పాఠాలు చెప్పే సార్లను చూసుంటాం. బోర్డుపై బొమ్మలు గీసి బోధించే టీచర్ల గురించీ తెలుసు. కానీ, మానవ శరీర నిర్మాణాన్ని ఒంటిపై ధరించి.. ఒక్కో అవయవం గురించి వివరిస్తుంటారు మంచిర్యాల జిల్లాకు చెందిన బయాలజీ టీచర్ భీమ్‌పుత్ర శ్రీనివాస్. ఎన్ని కష్టాలు ఎదురైనా టీచర్ కావాలన్న తన లక్ష్యాన్ని అందుకున్నారు. సర్కారు నౌకరీ రాగానే హాయిగా రిలాక్స్ అయిపోలేదాయన. వినూత్న బోధనతో పిల్లలకు దగ్గరయ్యారు. బట్టీ పట్టించే విధానానికి స్వస్తి పలికి.. కఠినమైన పాఠాలను పిల్లలకు ఆటపాటలతో అవలీలగా అర్థం చేయిస్తున్న భీమ్‌పుత్ర శ్రీనివాస్ ‘బతుకమ్మ’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
‘అల్లరి చేస్తే.. బడికి పంపిస్తా, లెక్కల సార్‌కు చెప్తా’ అంటూ చాలామంది తల్లిదండ్రులు పిల్లలను భయపెడుతుంటారు. ఆ మాటతో పిల్లలు సైలెంట్ అయిపోతారు. ఇలా కొంతమంది స్కూల్‌ను, టీచర్లను పిశాచుల్లాగా చూపించడం నాకు నచ్చలేదు. స్కూల్ అనగానే పిల్లలు ఎగిరి గంతేయాలి. ఆదివారం కూడా బడి ఉంటే బాగుండూ అనుకోవాలి. ‘అమ్మో ఆ టీచరా!’ అనుకోకుండా.. ‘ఆ సార్ క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందా’ అనుకునేలా నా బోధన ఉండాలని భావించాను. అందులో భాగంగానే వినూత్న బోధనా పద్ధతిని ఎంచుకున్నాను. 2020లో స్కూల్ యూనిఫాం వేసుకొని పాఠశాలకు వెళ్లడం ప్రారంభించి విద్యార్థుల్లో ఒకడినయ్యా! భయపెడుతూ, బట్టీపట్టించడం నాకు నచ్చదు. పిల్లలు ఏదైనా ఆడుతూపాడుతూ, ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలన్నది నా ఉద్దేశం.
వందశాతం సక్సెస్ అయ్యా..
సైన్స్ టీచర్ అయిన నేను 2021 వరకు కప్ప, మేకల శరీర అవయవాలు చూపిస్తూ పాఠాలు చెప్తుండేవాణ్ని. మానవ శరీర నిర్మాణంపై పాఠాలు చెప్పే సమయంలో వివరణ ఇవ్వడం కొంత ఇబ్బందిగా అనిపించింది. దాన్ని అధిగమించడానికి మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన బొమ్మలు ఉన్న టీషర్ట్లు ధరించాను. ఇందుకోసం వివిధ అవయవాల బొమ్మలను డౌన్లోడ్ చేసుకొని టీషర్ట్‌పై ప్రింట్ వేయించాను. చాలామంది వింతగా చూశారు. పిల్లలు మాత్రం ఆశ్చర్యంగా చూశారు. చక్కగా అర్థం చేసుకున్నారు. పూర్తి మానవ శరీరాన్ని చూపించాలనుకున్నాను. దానికోసం నెదర్ల్యాండ్, స్పానిష్ దేశాలకు చెందిన కొన్ని వీడియోలు చూసి టైలర్‌తో అనుకున్న రీతిలో మానవ శరీరాన్ని ప్రతిబింబించే డ్రెస్ కుట్టించాను. మన శరీరంలోని ప్రతి అవయవం గురించి విద్యార్థులు తెలుసుకునేలా చేసిన నా ప్రయత్నం వంద శాతం సక్సెస్ అయింది.
ఆటంకాలను అధిగమించి..
మాది మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని మారుమూల గ్రామమైన చిన్నవెంకటాపూర్. నాన్న సింగరేణిలో చిరుద్యోగి. అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది. నాకు చదువంటే ఇష్టం. ఇంట్లో నాకన్నా పెద్దవాళ్లు ఇంటర్‌తోనే చదువు ఆపేశారు. నా ఇంటర్ అయిపోగానే నన్నూ చదువు మానేయమన్నారు నాన్న. నాకు చాలా బాధనిపించింది. అప్పుడు మా గురువు శ్రీనివాస్ సార్ ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇచ్చారు. అక్కడ పనిచేస్తూనే డిస్టెన్స్‌లో బీఎస్సీ (బీజెడ్సీ) పూర్తిచేశాను. 2002లో డీఎస్సీలో టీచర్‌గా అపాయింట్ అయ్యాను. ఉద్యోగం చేస్తూనే కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, డిస్టెన్స్‌లో ఎంఏ సోషియాలజీ, సైకాలజీ చేశాను. ప్రస్తుతం డిస్టెన్స్‌లో ఎంఏ తత్వశాస్త్రం చేస్తున్నాను.
సంతృప్తిగా ఉంది..
ఉపాధ్యాయుడిగా బొగుడగూడెం నా మొదటి పోస్టింగ్ యూపీఎస్ పాఠశాలలో వచ్చింది. గ్రామంలోని పిల్లలంతా బడికి రావాలంటేనే భయపడేవాళ్లు. తల్లిదండ్రులు సైతం వాళ్లను పొలానికి తీసుకెళ్లేవారు. ఆ పిల్లలను బడికి తీసుకురావడమే పనిగా పెట్టుకున్నా. మిగతా టీచర్ల సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచాను. తర్వాత కొన్నాళ్లు భీమిని మండలం గొల్లగూడలో పనిచేశాను. 2010లో మా సొంత మండలానికి బదిలీ అయ్యాను. 14 ఏండ్లపాటు అక్కడే పనిచేశాను. బంజారా కుటుంబాలు ఉన్న ప్రాంతం కావడంతో పిల్లలకు తెలుగు అర్థమయ్యేది కాదు. పిల్లల భాష మాకు అర్థమయ్యేది కాదు. వాళ్లను ఇబ్బంది పెట్టలేక నేను బంజరా భాషను నేర్చుకున్నా. పాఠాలు కూడా వాళ్ల భాషలోనే చెప్పడం ప్రారంభించా. ప్రస్తుతం మందమర్రిలో పనిచేస్తున్న నేను వినూత్న బోధనలో భాగంగా పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉత్తరాలు రాస్తుంటాను. భవిష్యత్తులో పిల్లలకు నచ్చేలా పుస్తకాలు రాయాలన్నదే నా కోరిక!
అన్నీ ఆటపాటలతోనే…
సోషల్ పాఠాలు కూడా వినూత్నంగా చెబుతుంటాను.. ప్రధానంగా క్లాత్‌పై నమూనాలు తయారు చేయించి బోధిస్తుంటా! అందులో భాగంగా అష్టాచమ్మాతో అన్నీ చుట్టేద్దాం కాన్సెప్ట్‌తో క్లాత్‌పైన భారతదేశ పటాన్ని వేయించాను. అష్టాచమ్మా ఆడుతూ రాష్ర్టాల నుంచి ఢిల్లీకి చేరడం వల్ల… రాష్ర్టాలు, రాజధానులు, ప్రధాన నగరాలు పిల్లలకు బాగా గుర్తుండిపోతాయి. అలాగే మైదానంలో వరల్డ్ మ్యాప్ గీసి.. గేమ్ ఆడుతూ దేశాలను గుర్తించే ఏర్పాటు చేశాను. ఇలా ఆటపాటలతో పాఠాలు బోధిస్తే.. పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటారు.
…? రాజు పిల్లనగోయిన