కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎంతో ప్రమాదంలో చిక్కుకుంటాం. అలాంటి స్థితిలో అక్కణ్నుంచి బయటికి రాలేక, అక్కడే ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాం. అందులోనూ నాకు మొహమాటం ఎక్కువ. ఎవరైనా రెండుసార్లు అడిగితే.. నా పని కూడా పక్కనపెట్టి వాళ్ల పని చేసిపెట్టే రకం నేను.
కార్తిక మాసంలో మా ఇంటి పక్కల కొంతమంది నోములు, వ్రతాలు చేసుకుని మా అమ్మను పిలిచేవాళ్లు. అమ్మకెందుకో అప్పుడప్పుడూ కుదిరేది కాదు. కొన్నిసార్లు ఇంటికి చుట్టాలు రావడం వల్ల పని తీరేదికాదు. మా నానమ్మకు బయటికి వెళ్లాలని బాగా సరదా. “పసుపు కుంకుమకు పిలిస్తె పది ఆమడల దూరమైనా పోవాలె! ఊర్కోవొద్దు!” అంటుండేది. అమ్మ తను వెళ్లలేనప్పుడు నన్నూ, అక్కనూ పంపించేది. ఆ పూజ అయినంత సేపూ చిన్నగదిలో కిక్కిరిసి కదలకుండా కూర్చోవడం నాకు ఎంతమాత్రమూ ఇష్టముండేది కాదు. అందుకని ఏదో వంకపెట్టి ఎగ్గొడుదామని చూసేదాన్ని. కానీ, అమ్మ.. “మా అమ్మవు గాదూ.. నువ్వూ, అక్కా పోయిరాండి. పిలిచినాంక పోకపోతె బాగుండదు. నా బదులుగ మీరు.. అంతే!” అనేది. ఆ మాటకు కరిగిపోయి అమ్మకు మహోపకారం చేస్తున్నట్టు ఫీలైపోయి తయారై వెళ్లేవాళ్లం. మేమెంత తాత్సారం చేసి వెళ్లినా.. మా ఖర్మకాలి ఆ నోమేదో అయ్యగారు లేటుగా వచ్చి అప్పుడే మొదలయ్యేది. ఇక మా అవస్థ చూడాలి.. వాళ్లేదో మర్యాద చేసి ఓ గోనెసంచి పరిచి మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్లు.
అప్పటికే అందరూ కూర్చుని ఆ గది నిండిపోయి.. మాకు తలుపు పక్కన చోటు దొరికేది. పూలు అందించేవాళ్లు, పళ్లు తెచ్చేవాళ్లు, చెంబులో నీళ్లు తెచ్చేవాళ్లు, తమలపాకులు ఇచ్చేవాళ్లు, కొబ్బరి ముక్కలు కట్ చేయడానికి కత్తిపీట అందించేవాళ్లు.. ఇలా ఒకళ్లో, ఇద్దరో కాదు.. ఏదో పనికి తిరిగే ప్రతివాళ్లూ మమ్మల్ని చిన్నదో పెద్దదో ఓ తన్ను తన్ని వెళ్తుండేవారు. పైగా, “అయ్యో! తప్పయింది!” అనడమో.. “అయ్యో! గీ తొవ్వల కూసున్నరేందమ్మా? లోపట కూర్సోకపోయిన్రు!” అని ఉచిత సలహా పారేయడమో చేసేవారు. “లోపట జాగ చూపిస్తె కూచుంటం!” అనేది అక్క. పూజ చేయించే అయ్యగారు ఆలస్యంగా రావడంతో మొదటినుంచీ చివరిదాకా ఆ ఇరుకులోనే నోరు మూసుకుని కదలకుండా, మాట్లాడకుండా ఉండాల్సి రావడం.. నాలాంటి వాగుడు కాయలకు, ఒకేచోట కూచోలేనివారికి ఎంత కష్టమో కదా! అయినా అమ్మ కోసం భరించేవాళ్లం. ఇక అసలు బాధంతా ఆఖరున ఉండేది. కథలన్నీ చెప్పడం అయిపోయాక హారతిచ్చి ప్రసాదం పెట్టగానే.. అది అందుకుని ఇంటికి తుర్రుమందామంటే కుదిరేది కాదు. ఆ ఇంటావిడ మహాలక్ష్మి మూడు సుదీర్ఘమైన మంగళహారతులు పాడేదాకా వదిలిపెట్టేది కాదు. పాపం.. ఆమె ఇల్లు, ఆమె పూజ, ఆమె ఇష్టం కానీ.. ఆ మంగళ హారతుల సమయం ఎంతో సుదీర్ఘంగా ఉండేది. శృతి గానీ, లయ గానీ, మాధుర్యం గానీ ఏమాత్రం లేని ఆ పాటలు మా గుండెల్ని పిండేసేవి.
“శుక్రవారపు లక్ష్మి.. ఇవాల నిన్నేమి కోరుకుందు? నేను వేణుకుందు (వేడుకుందు)?! కొంగు పర్సుకుందు?! నాకొక్క పెండ్లి దయచేయమని కోరుకుందు.. నాకొక్క ఇల్లు దయచేయమని కోరుకుందు.. నాకొక్క కొడుకును దయచేయమని కోరుకుందు.. నాకొక్క ఒడ్డాలం దయచేయమని కోరుకుందు.. నాకొక్క కంటె దయచేయమని కోరుకుందు.. నాకొక్క నకిలీసు దయచేయమని కోరుకుందు..” అంటూ కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్లు, బోలెడు నగలు అప్పటికే ఉన్నావిడ మొత్తం కోరికల లిస్టులో తన వేదనంతా వెలిబుచ్చేది. ఇక ముగిస్తుందేమో అనిపించే వేళకు మళ్లీ మరో పాట ఎత్తుకునేది. ఈసారి ‘గంగా గౌరీ సంవాదము’.. అదొక అరగంటకు పైగా నడిచేది. అది అవగానే మరొక పాట. ఇలా జీవిత చరిత్రలన్నీ మంగళహారతులుగా మార్చి ఆమె పాడుతుంటే మేము లోపల్లోపల గిజగిజలాడేవాళ్లం.
ఈలోగా వచ్చిపోయేవాళ్ల తన్నుళ్లు మాకు అదనం! మెల్లగా జారుకుని ఇంటికెళ్లి పోదామంటే ఎవరో ఒకరు చూసి.. “ఉండండి అమ్మాయిలూ! ప్రసాదం కొంచబోదురు. ఇగ అయిపాయె.. ఒక్క రెండు నిమిషాలు.. గంతే!” అంటూ ఆపేవారు. ఆ రెండు నిమిషాలు మరో గంటదాకా సాగేవి. మహాలక్ష్మి మంగళ హారతులు చదవడం పూర్తి కాగానే.. ‘హమ్మయ్య!’ అనుకునే లోపు వరంగల్ నుంచి వచ్చిన వాళ్ల చెల్లెలు విశాలాక్షి ఎంతో దయతో పాటలు పాడటానికి ముందుకొచ్చేది. “మూడు మంగళ హారతులు అయిపోయినయ్ గద.. సరిపోతది!” అని ఎవరైనా అంటే.. మహాలక్ష్మికి బాగా కోపం వచ్చేది. “మీకేమైతున్నది?! మా చెల్లె మంగళారతి చదువొద్దా?! వరంగల్ నుంచి ఒచ్చె!” అనేది. ఆ చెల్లెలు కూడా అక్క బడిలోనే చదివి ఉంటుంది కదా! ఆమెకూడా అక్కగారి అడుగుజాడల్లోనే నడిచి మూడు పాటలు పాడందే వదిలి పెట్టేదికాదు. అప్పటికే కొంతమంది ఏదో పని పెట్టుకుని బయటికి వెళ్లే ప్రయత్నం చేసేవారు. వారిలో కొందరు సఫలీకృతులయ్యేవారు కూడా! చివరికి వాళ్ల మరదలు జయలక్ష్మి, తోడికోడలు పార్వతి.. ఇలా వంతులవారీగా అందరూ మంగళ హారతులు పాడాకనే.. ఆ పళ్లాన్ని కింద పెట్టేవారు. అప్పటికి చాలామందికి శోష వచ్చి పడిపోయేలా అయ్యేవారు. మేము ప్రసాదం చేతిలో పడగానే ఇంటికి తుర్రుమనేవాళ్లం. వెళ్లగానే అమ్మ మీద అలిగితే.. అమ్మ నవ్వి “మరి అట్లాటివి చూస్తెనే మీకు ఓపిక పెరుగుతది!” అనేది.
మరోసారి ఇలాగే ఓసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆవిడ మాకు బంధువులు కూడా. పూలతో అమ్మవారిని ఎంతో బాగా అలంకరించి, పూజ బాగా చేశారు. ఆ తరువాతే అసలు కథ మొదలయ్యింది. మంగళ హారతి వరకు వచ్చేసరికి ఆమే స్వయంగా రంగంలోకి దిగి.. “వరలక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా?! ఎట్లా నిన్నెత్తుకుందు.. ఆట్లాడే బాలవు నీవు!” ఇదీ పాట. అయితే.. ‘ఎట్లా’ అనే మాటను ఆవిడ రకరకాలుగా పలుకుతూ పాడేది. ముఖ్యంగా గొంతు ఎత్తినప్పుడు కీచుగా రకరకాలుగా పోయి ఓసారి తలుపు గట్టిగా పడుతున్నపుడు వచ్చే చప్పుడులాగా, మరోసారి కుక్కను కర్రతో కొడితే అది మూలిగినట్టుగా, ఇంకోసారి చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా వచ్చేది. ఏమనడానికి గానీ, ఆపడానికి గానీ వీల్లేని పరిస్థితి ఉండేది. చివరికి ఓ గంట తరువాత ఆ హింస నుంచి బయటపడేవాళ్లం. రేడియోలో ఎన్నో శ్రావ్యమైన భక్తి గీతాలు విని ఆనందించిన నాకు.. ఈ పాటలు వినడం పెద్ద శిక్షలా అనిపించేది. వీళ్లు పూజ మామూలుగా చేసి ఎవరైనా బాగా పాడగలిగే వాళ్లతో పాడించవచ్చుగా.. వచ్చిన వాళ్లకు ఈ చిత్రహింసల శిక్షలేమిటి? అనిపించేది.