కవిత్వపు జెండాతో బయలుదేరిన డాక్టర్ సి.నారాయణ రెడ్డి అటు మహాకావ్య రచనను, ఇటు లలిత సినీ గేయసృజనను సమపాళ్లుగా, సార్థకంగా
కొనసాగించారు. తళుకుబెళుకుల సినీ రంగం ఎంతగా ఆకర్షించినా.. తనవైన గీతాలు రాస్తూనే ప్రాయికంగా అభ్యుదయ కవిగా నిలిచి వెలిగారు.
సమన్వయ దృక్పథంతో ప్రగతిశీల మానవతావాదాన్ని తన ఎజెండాగా చేసుకున్నారు సినారె.అటువంటి ఓ అందమైన గీతం ఈ వారం..‘
గాలికీ కులమేది.. ఏది నేలకు కులమేది… మింటికి మరుగేది, ఏది కాంతికి నెలవేది’ (కర్ణ), ‘ఇంతేలే నిరుపేదల బతుకులు అవి ఏనాటికి బాగుపడని అతుకులు’ (పుణ్యవతి), ‘ఎవడిదిరా ఈ భూమి.. ఎవ్వడురా భూస్వామి’ (మనుషులంతా ఒక్కటే), ‘వందేమాతరం గీతం వరస మారుతున్నది’ లాంటివి పైన పేర్కొన్న శైలిలో సాగిపోయే వాటిలో కొన్ని. మహాకవి సినారెకు ఇటువంటి మరో మంచి ప్రగతిశీల భావాలున్న గీతం రాసే అవకాశం ‘మంచి మిత్రులు’ చిత్రంతో కలిగింది. ఇది ఇద్దరు కథా నాయకులు ఆలపించే అభ్యుదయ ఛాయలున్న యుగళగీతం.
పల్లవి
ఎన్నాళ్లో వేచిన ఉదయం
ఈనాడే ఎదురౌతుంటే ॥ఎన్నాళ్లో॥
ఇన్నినాళ్లు దాచిన హృదయం
ఎగిసి ఎగిసి పోతుంటే
ఇంకా తెలవారదేమి?
ఈ చీకటి విడిపోదేమి? ॥ఇంకా॥
ఈ గీతంపై నటించిన ఇద్దరు కథానాయకుల్లో ఒకరు శోభన్‌బాబు, మరొకరు కృష్ణ. శోభన్‌బాబు పాత్ర సామ్యవాద భావాలు కలిగిన పోలీస్ అధికారి. కృష్ణ పాత్ర విషయానికి వస్తే సాయుధ పోరాటం ద్వారానే సమాజంలో పరివర్తన కలుగుతుందని నమ్మిన విప్లవవాది. ఈ ఇద్దరి భిన్న మనస్తత్వాలను, వ్యక్త్తిత్వాలను ఒకే పాటలో ఆవిష్కరించే పనిని కవి సినారెకు అప్పగించారు. అందులోనూ సన్నివేశం ఇంకా భిన్నమైంది. ఏన్నో సంవత్సరాల కిందట విడిపోయిన ఈ ఇద్దరు మిత్రులు.. కలుసుకునే అరుదైన సందర్భం. తెల్లవారక ముందే ఉత్సాహంగా బయలుదేరి మిత్రుణ్ని కలుసుకోవాలనే ఆరాటంతో ఇద్దరూ సాగిపోతుంటారు. అందుకు చక్కని పల్లవిని ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం/ ఈనాడే ఎదురౌతుంటే… / ఇంకా తెలవారదేమి?/ ఈ చీకటి విడిపోదేమి?’ అంటూ కూర్చిన సినారె ఎందుకు తెలవారలేదని ప్రశ్నిస్తారు.
చరణం
మంచిని పెంచిన మనిషిని
ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడువానికి
ఏ నాటికి ఓటమి లేదని ॥నీతికి॥
నే చదివిన జీవితపాఠం
నీకే నేర్పాలని వస్తే ॥ఇంకా॥
సినారె మాటల్లోనే చెప్పాలంటే నిజాయతీ గల పోలీసు అధికారి అయిన శోభన్‌బాబు పాత్ర ఎప్పుడైనా, ఎక్కడైనా మంచికి మాత్రమే విజయం కలుగుతుందన్న నమ్మకం కలవాడు. అదే విశ్వాసంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. అన్యాయాలు, అక్రమాలకు ఎదురు నిలిచి ఆయుధాన్ని ధరిస్తాడు. అందుకే ఆ జీవిత పాఠాలను తన మిత్రుడికి చెప్పాలని అతని ఆరాటం. నిజానికి ఇదీ సినిమా కోసం రాసిన గీతమే అయినా, విడిగా చదివితే అభ్యుదయ చైతన్య గీతంలా కనిపిస్తుంది. ఇక కృష్ణ పాత్ర విషయానికి వస్తే.. తాను చూసిన సమాజాన్ని గురించి మిత్రుడికి చెప్పాలని ఇలా పాడుకుంటాడు..
చరణం
నాగులు తిరిగే కోనలో
ఏ న్యాయం పనికిరాదని ॥నాగులు॥
కత్తిని విసిరే వానిని
ఆ కత్తితోనె గెలవాలని
నే నెరిగిన చేదు నిజం
నీకే చెప్పాలని వస్తే ॥ఇంకా॥ ఎన్నాళ్లో॥
తన పంథాను, మార్గాన్ని ఇందులో నిక్కచ్చిగా చెబుతుంది కృష్ణ పాత్ర. నిజానికి ఇది కవి మార్గం కూడా కావచ్చు. నిరంతరం కుట్రలు, కుతంత్రాలతో కూడిన ఈ లోకం మంచి చెబితే వినదనీ, అది ఏకంగా నాగుల ‘కోన’ అని కవి భావం. గాంధీ మహాత్మునిలాగా ఒక చెంపపైన కొడితే మరో చెంప చూపించడం సరైనది కాదని, కత్తులు విసిరేవాళ్లకు ఆ కత్తులతోనే సమాధానం చెప్పాలని, ఆ కత్తితోనే లోకాన్ని గెలవాలని “నే నెరిగిన చేదునిజం’ అంటూ కృష్ణ పాత్రతో చెప్పిస్తారు కవి.
గతంలోనూ ఒకచోట ‘తమ్మునితో చేతులు కలపకున్నా.. దమ్మును మాత్రం మెచ్చుకుంటున్నా’ అన్నారు సినారె సాయుధ వామపక్ష పోరాటాల గురించి. అందుకే తనకు తెలిసిన లోకపు అచ్చమైన నిజాన్ని తన మిత్రునికి చెబుతామని వస్తే ఇంకా తెలవారక పోవడమేమిటని ఇందులోని భావం. వాచ్యంగా చూస్తే అన్నీ కళ్లముందే కనిపిస్తున్నా ఇంకా చూడలేకపోతున్నారా అన్న అర్థం కూడా ఇందులో దాగి ఉంది.
ఈ గీతంలో మరో విశేషముంది, గాయక చక్రవర్తి ఘంటసాల కృష్ణ పాత్రకు గాత్రదానం చేస్తే, అప్పటి ఉదీయమాన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం శోభన్‌బాబు గొంతుకలో వినిపిస్తుంది. సంగీత దర్శకత్వం కోదండపాణి నిర్వహించారు. తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఎవరి విధానం గొప్పదో… ఎవరి పద్ధతి ఆచరణీయమైందో అన్న అంశాన్ని తెలిపేందుకు, ఇద్దరు కథా నాయకులు ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచేందుకు ఈ గీతం రాశారు సినారె.
-పత్తిపాక మోహన్