ఓఆర్ఆర్పై జరిగిన మర్డర్ తానే చేశానని ఒప్పుకొన్నాడు క్రాంతి. ఎందుకు చేశావని ఇన్స్పెక్టర్ అడిగితే ‘చీకటి శక్తి చెప్తే చేశాన’ని తలాతోకా లేని సమాధానాలు చెప్తూపోయాడు. హైడ్రోజన్ సైనేడ్‌ను ఎక్కువ మోతాదులో డైరెక్ట్‌గా పీల్చడంవల్లే కుర్రాడు చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆ తర్వాత ఆ బాడీని ఓ కుక్క రక్కినట్టు రిపోర్ట్‌లో ఉంది.
అది ఎవరు
దీంతో క్రాంతి చెప్పిన ‘సార్.. గత కొన్నిరోజులుగా నన్ను ఓ చీకటి శక్తి వెంటాడుతున్నది. అది చెప్తేనే నేను ఈ అబ్బాయి మీదకు ఆ వాయువును వదిలా’ అన్న మాటలు రుద్రకు గుర్తొచ్చాయి. దాంతోక్రాంతి గతం తెలుసుకొందామని అతని ఇంట్లోవాళ్లను పిలిపించాడు. ‘సార్.. నా పేరు సుజాత’ పరిచయం చేసుకొంది క్రాంతి అమ్మగారు. ‘అమ్మా.. మీ అబ్బాయి కేసు తెలిసే ఉంటుంది. అసలేం జరిగింది? పూర్తిగా చెప్తారా?’ నెమ్మదిగా అడిగాడు రుద్ర. ‘సార్. క్రాంతి బ్యాంకులో క్యాషియర్. నాన్నంటే వాడికి ప్రాణం. ఏడాది కిందట యాక్సిడెంట్లో ఆయన పోయారు. ఆ ఘటన క్రాంతి మనసుపై చాలా ప్రభావం చూపింది. వాడు ఎంతో కుంగిపోయాడు. డ్యూటీ సరిగ్గా చేయడంలేదని తీసేశారు. రోజురోజుకూ వాడి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో డాక్టర్ కృపాకర్‌కు చూపించాం.
ఆయన సలహామేరకు సైకియాట్రిస్ట్ అశ్విన్‌ను కలిశాం’ కాస్త ఊపిరి పీల్చుకొంది సుజాత. ‘రెండు మూడు సెషన్లు పూర్తయినా క్రాంతిలో ఏ మార్పూ కనిపించలేదు. తర్వాత మరో సైకియాట్రిస్టు నీరజ్‌ను అప్రోచ్ అయ్యాం. అశ్విన్ వద్దని వారించాడు. తాను నయం చేస్తానన్నాడు. కానీ, మేం వినలేదు. నీరజ్ దగ్గర నాలుగు సెషన్లు పూర్తయ్యాక క్రాంతి కొంచెం మామూలు మనిషవ్వడం ప్రారంభించాడు. కానీ, చీకటి కనిపిస్తే చాలు.. అక్కడ ఎవరో నిల్చున్నట్టు ఎవరితోనో మాట్లాడుతుంటాడు. ఉన్నపళంగా సైలెంట్ అవుతాడు. అప్పుడే భయపడిపోతాడు, అంతలోనే నవ్వుతాడు’ చెప్తూ ఏడవడం మొదలుపెట్టింది.
‘నీరజ్‌ను అప్రోచ్ అయ్యాకనే ఇలా జరగడం మొదలైందా?’ సూటిగా ప్రశ్నించాడు రుద్ర.. ‘అవును సార్. దాన్ని తగ్గించడానికి మరో ట్రీట్మెంట్ సెషన్‌ను కొత్తగా ప్రారంభించాడు నీరజ్.. ఇంతలోనే ఇలా..’ ఘొల్లుమంది సుజాత.
రుద్ర ఆదేశాలతో ఇద్దరు సైకియాట్రిస్టులు నీరజ్, అశ్విన్, డాక్టర్ కృపాకర్ స్టేషన్‌కు వచ్చారు. సుజాత చెప్పిన విషయాలే వాళ్లూ చెప్పారు. దీంతో కేసులో ఏ కొత్త క్లూ దొరక్కపోవడంతో రుద్ర ఓ నిర్ణయానికి వచ్చాడు. ‘డాక్టర్స్.. యూఎస్ నుంచి వచ్చిన సైంటిస్ట్ జేమ్స్ ఫ్రాంక్ మన క్రాంతికి ఓ కొత్త మందు ఇచ్చారు. మెదడు పొరల్లోకి వెళ్లి గతాన్ని తవ్వితీస్తుంది అది. అలాగే, అతణ్ని ఎవరైనా హిప్నోటైజ్ చేసినా అదీ బయటపెడుతుంది’ అన్నాడు రుద్ర. అర్థమయ్యీ కానట్టు తలూపారు ముగ్గురు. ‘ఈరోజు రాత్రిలోపు అది బాగా పనిచేస్తుందని సైంటిస్ట్ చెప్పారు. దీంతో క్రాంతితో ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారో తెలిసిపోతుంది. అయితే, మందు పనిచేయాలంటే క్రాంతి 5 గంటలపాటు ఏకాంతంగా ఉండాలట. అందుకే నిద్రపోయేలా ఇంజెక్షన్ ఇస్తా. హోటల్లో ఓ ప్రత్యేక రూమ్ బుక్ చేయిస్తా. అతని రూమ్‌లోకి ఎవ్వరం వెళ్లొద్దు. ఏదైనా ప్రాబ్లం వస్తే.. జేమ్స్తోపాటు మీరు ముగ్గురూ అందుబాటులో ఉండాలి. మీకోసం వేరే రూమ్ బుక్ చేస్తా. ప్లీజ్ ఈ ఒక్క రాత్రి సాయం చేయండి’ అంటూ రుద్ర అభ్యర్థించాడు. సరేనన్నారు ఇద్దరు సైకియాట్రిస్టులు. అయితే, తనకు ప్రత్యేక రూమ్ కావాలని పట్టుబట్టాడు కృపాకర్. దీంతో అందరికీ వేర్వేరు రూమ్స్ బుక్ చేయించాడు రుద్ర.
రాత్రి 10 గంటలైంది. గదిలో క్రాంతి నిద్రపోతున్నాడు. అప్పటికే మందు ఇచ్చి నాలుగున్నర గంటలు పూర్తికావొచ్చింది. ఇంతలో క్రాంతి గది తలుపును ఎవరో తట్టారు. డోర్ తెరుచుకొంది. ‘ఎందుకొచ్చారు? రావొద్దన్నాను కదా!’ తలుపుకొట్టిన నీరజ్‌ను రుద్ర గద్దించాడు. ‘క్రాంతి లేచాడా? లేదా? చూద్దామని వచ్చా. సారీ! అయినా.. క్రాంతి ఒంటరిగా ఉండాలి అన్నారుగా? మీరేం చేస్తున్నారు ఇక్కడ?’ సూటిగా ప్రశ్నించాడు నీరజ్. కోపంతో డోర్ వేసుకొన్నాడు రుద్ర. పది నిమిషాలు గడిచాయి. క్రాంతి రూమ్ డోర్‌ను మళ్లీ ఎవరో తట్టారు. డోర్ తీయగానే అశ్విన్ ఉన్నాడు. రావొద్దని చెప్పినా ఎందుకు వచ్చావని నిలదీశాడు రుద్ర. ‘బోర్ కొడితే కింద గ్యాలరీలోకి వెళ్లా. వచ్చేప్పుడు నా రూమ్ అనుకొని పొరపాటున తలుపు తట్టా. సారీ’ అని చెప్తూ అశ్విన్ వెళ్లిపోయాడు. ఇంతలో ఏదో ఫోన్ వస్తే, మాట్లాడటానికి రుద్ర బయటకు వచ్చాడు. ఫోన్ మాట్లాడి.. క్రాంతి రూమ్‌లోకి వస్తుండగా.. కృపాకర్ అదే రూమ్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించాడు రుద్ర. ‘బోర్ కొడితే బయటకు వచ్చా. క్రాంతి రూమ్ డోర్ తెరిచి ఉండటం చూశా. ఏంటా అని లోపలికి వెళ్లి చూస్తే, పడుకొనే ఉన్నాడు.
దీంతో బయటకు వచ్చేశా’ అంటూ చెప్తూ డాక్టర్ వెళ్లిపోయాడు. క్రాంతి రూమ్‌లోకి వెళ్లిన రుద్ర.. అక్కడే పరదా వెనుక దాక్కున్న జేమ్స్‌తో.. ‘ముగ్గురిలో అతనే కదూ..’ అంటూ నవ్వాడు. అవునన్నట్టు తలూపాడు జేమ్స్. మరుసటి రోజు సుజాతతో.. ‘అమ్మా.. మానసికంగా కుంగిపోయిన మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్, సైకియాట్రిస్ట్‌లను ఆశ్రయించారు. అయితే, తన వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి క్రాంతిని ఓ ఆయుధంగా వాడుకొన్నాడు ఓ వ్యక్తి. చిన్నప్పటి నుంచి చీకటి అంటే భయపడే క్రాంతికి అదే చీకటి శక్తి పేరిట ఓ భ్రాంతిని కలుగజేశాడు. ఏదో ఓ శక్తి తనతో ఇలా చేయిస్తుందంటూ క్రాంతి మైండ్‌ను నెగెటివ్ హిప్నోటైజ్ చేశాడు. అలా ఓఆర్ఆర్పై కుర్రాడిని క్రాంతితో చంపించాడు. క్రాంతి దొరికితే తానూ దొరకొచ్చని భావించి, టోల్‌ప్లాజాలోని సీసీటీవీలో ఓఆర్ఆర్ నుంచి కారు వెళ్లిన దృశ్యాలు రికార్డవుతాయని తెలుసుకొని క్రాంతితోనే పోలీసులకు ఫోన్ చేయించాడు. బ్యాటరీ డౌన్ అంటూ క్రాంతితో చెప్పించి తొలిసారిగా తప్పులో కాలేశాడు ఆ హంతకుడు. హత్యకేసులో క్రాంతి ఇరుక్కోవడంతో తాను బయటపడ్డానని అనుకొన్నాడు. ఎప్పుడైతే, జేమ్స్ ఓ మందు ఇచ్చాడని, అది పనిచేయబోతున్నదని మేం చెప్పామో.. ఇక, తన పేరు బయటపడటం ఖాయమని భావించిన అతను నిన్న రాత్రే ఒంటరిగా ఉన్నాడనుకొని క్రాంతిని చంపడానికి ట్రై చేశాడు. కానీ, నేను రూమ్‌లో ఉండటంతో అతని పాచిక పారలేదు. ఇక్కడే, తానే హంతకుడినని ఓ క్లూని వదిలిపెట్టాడు. ఆ హంతకుడు ఎవరంటే??’.. అంటూ అశ్విన్‌ను చూపించాడు రుద్ర. ఇంతకీ అతనే హంతకుడని రుద్ర ఎలా కనిపెట్టాడు?
సమాధానం
ఒంటరిగా ఉన్నాడనుకొని క్రాంతిని చంపుదామని అతని రూమ్‌లోకి వెళ్దామనుకొన్న అశ్విన్ డోర్ తట్టాడు. అప్పటికే నాలుగున్నర గంటలు గడిచిపోవడంతో మందు ప్రభావం తగ్గి క్రాంతి మెలకువలోకి వచ్చి డోర్ తీస్తాడనుకొన్నాడు. అయితే, రుద్ర డోర్ తెరవడంతో కంగుతిన్నాడు. దీంతో ఏం చెప్పాలో తెలీక.. తన రూమ్ అనుకొని పొరపడ్డట్టు చెప్పాడు. ప్రతీ ఒక్కరికీ వేర్వేరు రూమ్‌లు ఇచ్చినప్పుడు వారి వారి రూమ్ తాళంచెవులు వారిదగ్గరే ఉంటాయి. పొరపాటుపడ్డా తన రూమ్ డోర్ తట్టాల్సిన అవసరంలేదు. ఇదే పాయింట్ రుద్ర పట్టుకొన్నాడు. సిటీలో హైడ్రోజన్ సైనేడ్ వాడేందుకు లైసెన్స్ ఉన్నవాళ్లలో అశ్విన్ కూడా ఉన్నాడు. దీంతో రుద్ర అనుమానం మరింత బలపడింది. తనదైన శైలిలో విచారిస్తే, తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే వేరే కులానికి చెందిన ఆ కుర్రాడిని క్రాంతి ద్వారా హత్యచేయించినట్టు అశ్విన్ ఒప్పేసుకొన్నాడు. తన దగ్గరకొచ్చిన క్రాంతిని రెండు మూడు సెషన్లలోనే హిప్నొటైజ్ చేసేశాడు. కాగా తనకు తెలియకుండా జరిగిన ఈ హత్యలో క్రాంతి శిక్ష అనుభవించవద్దని భావించిన రుద్ర.. ఇందుకు సంబంధించిన లీగల్ రెమెడీస్‌ను వెతికే పనిలో పడ్డాడు.
-రాజశేఖర్ కడవేర్గు