పూల గుత్తులు..
పండుగ ముస్తాబులో భాగంగా.. రకరకాల పూలను జడలో తురుముకుంటారు అతివలు. కానీ పూల సొగసు కాసేపే. మల్లెలైనా, కనకాంబరాలైనా కొద్దిగంటల్లోనే వాడిపోతాయి. ఇప్పుడా బాధ లేదు. కలకాలం తళుకులీనే కృత్రిమ పుష్పాలు వచ్చేశాయి. ప్లాస్టిక్, నైలాన్, థర్మాకోల్‌తో రూపొందించే ఈ అందమైన పూలకు మరింత మెరుపునిచ్చేందుకు ముత్యాలు, రంగురాళ్లను కూడా జతచేస్తున్నారు. గులాబీలు, మల్లెలు, సన్నజాజులు.. ఇలా రకరకాల ఆకృతులిస్తున్నారు. తేలికగా అలంకరించుకునేందుకు వీలుగా పిన్నుల సాయంతో గుత్తుల్లా కూర్చుతారు. వీటిని విడివిడిగానూ ధరించవచ్చు. ఆన్లైన్లోనే కాదు, స్థానిక మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటాయి.
చేతినిండా గాజులు..
ముత్తయిదువలు నిండుగా అలంకరించుకుని మరీ బతుకమ్మను కొలుస్తారు. ఒంటినిండా నగల సంగతేమో కానీ, చేతినిండా గాజులు ఉండాల్సిందే. అందులోనూ ఇది పూల పండుగ కాబట్టి, పూల డిజైన్ గాజులైతే చేతులకు నిండుదనాన్ని ఇస్తాయి. బతుకమ్మ స్పెషల్‌గా వచ్చిన పూల గాజులు ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. బంగారమే కాదు.. సిల్క్, త్రెడ్, వన్‌గ్రామ్ గోల్డ్‌లోనూ పూల గాజులు లభిస్తాయి.
ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.500.
పండుగ డిజైన్లతో..
బతుకమ్మ పండుగొచ్చిదంటే కొత్త బట్టలు కొనాల్సిందే. అందుకే ఏటా కొత్తకొత్త డిజైన్లు మార్కెట్లో సందడి చేస్తాయి. ఈసారి ఏకంగా బతుకమ్మలే డిజైన్లుగా మారిపోయాయి. చీరలు, డ్రెస్సులు, బ్లౌజులపై బతుకమ్మ బొమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు నవతరం డిజైనర్లు. రంగురంగుల పూల వరుసలను పోలిన..
రంగురంగుల దారాలతో వస్త్ర బతుకమ్మలు అందంగా మెరిసిపోతున్నాయి. షాపింగ్‌కు బయల్దేరండి మరి.
వెండి బతుకమ్మ
పెద్దల అమావాస్య (పెత్రమాస) మొదలు సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులూ తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తాం. మామూలుగా అయితే.. తంగేడు, గునుగు, గుమ్మడి వంటి రంగురంగుల పూలు తెచ్చి.. కట్టలు కట్టి ఒక్కోవరుసగా పేరిస్తే చక్కని బతుకమ్మ తయారవుతుంది. అయితే పట్టణాలు, నగరాల్లో గులాబీలు, బంతిపూలు, మల్లెపూలు మాత్రమే దొరుకుతాయి. అంతేకాదు వాటితో ఒద్దికైన బతుకమ్మను పేర్చడమూ కష్టమే. ఎలాంటి ఇబ్బందీ లేకుండా పేర్చేందుకు అనువుగా వచ్చినవే వెండి బతుకమ్మలు. వీటికి గ్లూ సాయంతో అందుబాటులో ఉన్న పూలను నచ్చిన డిజైన్‌లో అతికించుకోవచ్చు. అన్నట్టు, కోలాటానికి వెండి కోలలు కూడా అందుబాటులో ఉన్నాయి.