e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ఆరోగ్యం హెల్త్‌ బిట్స్‌

హెల్త్‌ బిట్స్‌

ఎన్నేండ్లయినా పదహారేండ్లే!

హెల్త్‌ బిట్స్‌

వయసుమీద పడే కొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజువారీ పనులు చేసుకునే సత్తువకూడా తగ్గుతుంది. ఇది రహస్యమేమీ కాదు. కానీ, ఈ విషయాన్ని కొంతవరకు ప్రభావితం చేసే మార్గాన్ని మాత్రం కనుగొన్నారు ‘అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌’ పరిశోధకులు. ‘అసలు వయసుకంటే మేం యవ్వనంగానే ఉన్నాం’ అన్న భావన ఉన్నవారిలో మెరుగైన ఆరోగ్యం కనిపించింది. వీరి మెదడు మరింత చురుగ్గా పని చేయడంతో పాటు, ఆసుపత్రి పాలు అవుతున్న సందర్భాలుకూడా తక్కువే. ఈ పరిశోధనలో భాగంగా 40 ఏండ్లు పైబడిన అయిదు వేలమందిని ప్రశ్నించారు. ‘మీ వయసు ఎంత ఉంటుందని నమ్ముతున్నారు?’ అని అడిగారు. శారీరకంగా కనిపించే వయసుకంటే మానసికంగా తమ వయసు తక్కువని నమ్మేవారిలో పైన పేర్కొన్న పాజిటివ్‌ ధోరణులను గమనించారు. ఇలా భావించేవారిలో సహజంగానే సానుకూల దక్పథం, ఒత్తిడిని తట్టుకునే గుణం ఎక్కువగానే ఉంటాయి. అందుకనే వారి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి?మీ వయసు ఎంత ఉండవచ్చని అనుకుంటున్నారు?

మంచి సినిమాలతో సానుకూల భావనలు

హెల్త్‌ బిట్స్‌

లాక్‌డౌన్‌లో ఓటీటీలే సినిమా హాళ్లకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. కానీ, అందుబాటులో ఉన్నాయని, ఏ సినిమా పడితే ఆ సినిమా చూసేస్తున్నారా? అయితే, ఈ పరిశోధన గురించి చదవండి. మంచి సినిమాలు చూడటం వల్ల జీవితంలో కష్టాలను దాటుకునే ధైర్యం వస్తుందని తేల్చారు ఒహియో విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చేందుకు వారు వెయ్యిమందికి 20 హాలీవుడ్‌ సినిమాలు చూపించారు. వీటిలో మానవీయ కోణం ఉన్న ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘షిండర్స్‌ లిస్ట్‌’ వంటి సినిమాలు కొన్నయితే ‘క్యాచ్‌ మీ ఇఫ్‌ యు కెన్‌’ లాంటి ఫక్తు కమర్షియల్‌ సినిమాలూ మరికొన్ని. వీటిలో సానుకూలమైన సినిమాలు చూసిన ప్రేక్షకులు, జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనీ, ఉన్నతమైన విలువలతో జీవించాలనీ, కష్టసుఖాలు జీవితంలో భాగమేననీ వంటి సానుకూల భావనలు మెరుగు పరుచుకున్నారు. ఇతరత్రా సినిమాలు చూడటం వల్ల అలాంటి దృక్పథమేమీ బలపడలేదు. కాబట్టి, ఓటీటీలో సినిమాలు తప్పక చూడండి.కాకపోతే, కాస్త జాగ్రత్తగా ఎంచుకోండి.

సూక్ష్మజీవిలో తలరాత

హెల్త్‌ బిట్స్‌

డాక్టర్‌ దగ్గరకు చెకప్‌కోసం వెళ్లగానే ఓ చిన్న పరీక్ష చేసి ‘మీరు మంచి ఆహారం తీసుకోవడం లేదు. మద్యం ఎక్కువగా తాగుతున్నారు. వ్యాయామం కూడా సరిగా చేయడం లేదు. ఇలాగైతే ఫలానా వయసుకు మించి మీరు బతకరు’ అంటూ తలరాతను తేల్చేస్తే! ఇలాంటి పరిస్థితులు త్వరలోనే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మన జీర్ణాశయంలో ఉండే enterobacteria అనే సూక్ష్మజీవులను గమనించడం ద్వారా మన అలవాట్లను, తద్వారా మన ఆయుష్షునూ పసిగట్టేయ వచ్చని చెబుతున్నారు ఫిన్లాండ్‌ శాస్త్రవేత్తలు. 7000 మందిమీద ఏకంగా 15 సంవత్సరాలపాటు సాగిన పరిశోధన తర్వాత తేల్చిన విషయమిది. జీర్ణాశయంలోని సూక్ష్మజీవులకూ, ఆయుష్షుకూ మధ్య సంబంధాన్ని స్పష్టం చేసిన అతిపెద్ద పరిశోధన ఇది. ఎప్పటికప్పుడు ఈ బ్యాక్టీరియా జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించి తగిన సూచనలు, హెచ్చరికలు అందించే అవకాశం రాబోతున్నది.

నిద్రలేమికి మందులొద్దు

హెల్త్‌ బిట్స్‌

నిద్రలేమి అనేది ఇప్పుడు చాలా సహజమైన సమస్య. మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిళ్లు వెరసి నిద్రను దూరం చేస్తున్నాయి. మందులు వాడటం అంత మంచిది కాదని తెలిసినా, నిద్రలేమికి రకరకాల ఔషధాలను వినియోగిస్తున్నారు. అయితే, వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని పెదవి విరిచేశారు పరిశోధకులు. అమెరికాకు చెందిన 200మందికి పైగా మధ్యవయసు మహిళలను గమనించిన తర్వాత తేల్చిన విషయమిది. నిద్రపోయేందుకు చాలా సమయం పట్టడం, మధ్యమధ్యలో మెలకువ రావడం, లేచేసరికి నిద్ర తీరక పోవడం లాంటి సమస్యల ఆధారంగా వీరిలో నిద్రలేమి తీవ్రతను గుర్తించారు. రెండేండ్లపాటు మందులు వాడిన తర్వాత కూడా సమస్య అదేస్థాయిలో ఉండటాన్ని గమనించారు. నిద్రలేమి ఉన్నా ఎలాంటి మందులూ వాడని వారితో పోలిస్తే వీరి సమస్యలో అంతగా మార్పు లేకపోవడం గమనార్హం. ఇందుకు స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సాధించగలిగితే నిద్రలేమి మూలాలను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెల్త్‌ బిట్స్‌

ట్రెండింగ్‌

Advertisement