e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home బతుకమ్మ ‘టైటిల్‌' సాంగ్స్‌ స్పెషలిస్ట్‌!

‘టైటిల్‌’ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌!

‘టైటిల్‌' సాంగ్స్‌ స్పెషలిస్ట్‌!

సినిమా సన్నివేశాలను పాటలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చేయి. అందమైన పదాల సొబగుతో అద్భుతమైన పాటలను అల్లడంలో తనది ప్రత్యేక శైలి. వినూత్న భావ పరిమళాలు వెదజల్లే పాటలెన్నో ఆ కలం నుండి జాలు వారాయి. యువతరాన్ని ఉర్రూతలూగించే ప్రేమ గీతాలెన్నో ఆ కలానికి గులాములయ్యాయి. ఆయనే టైటిల్‌ సాంగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ కె.కృష్ణకాంత్‌.

అద్భుతమైన ప్రేమపాటలతో, సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు కె.కృష్ణకాంత్‌. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట స్వస్థలం. బాల్యం నుంచే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. రానురానూ దర్శకత్వంపైనా ఆసక్తి ఏర్పడింది. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మొదట్లో ఓ టీవీ చానల్‌లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత గీత
రచన వైపు దృష్టి పెట్టారు. 2009లో ‘కలయో నిజమో..’ పేరిట ఓ ప్రైవేటు ఆల్బమ్‌ విడుదల చేశారు. సినీకవిగా రాణించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు ప్రారంభించారు.

- Advertisement -

‘అందాల రాక్షసి’తో
2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు కృష్ణకాంత్‌. ఇందులో ‘నేను నిన్ను చేర వచ్చేలా.. ఏదేదో చేసి’ అనే ప్రేమగీతం ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. సాహితీ ప్రియులనూ మెప్పించారు. ‘దూరమే దూరమై.. నేరుగా సిందూరమై తాకే.. తొలి తొలి నీ రాక, తొలిగేనా ఇన్నాళ్ల అలక’ వంటి వినూత్నమైన పంక్తులతో ప్రతి ఒక్కరినీ అలరించారు. ఈ పాట అందించిన అపూర్వ విజయంతో అవకాశాలు వెల్లువెత్తాయి. తర్వాత ‘జిల్‌’ (2015) సినిమాలో ‘ఏమైందీ వేళ.. నేను పుట్టాను ఇంకోలా’ అంటూ మరో అద్భుతమైన ప్రేమ
పాటను అందించారు. ఇందులో ‘నీతో పాటుండేలా ఈ లైఫంతా ఇల్లాగా వచ్చింది రేపే నేడులా ముందుగా..’ అంటారు. రేపే నేడులా ముందుకు రావడమనేది సరికొత్త అభివ్యక్తి. ఇలాంటి పోలికలు ఆయన పాటల్లో కోకొల్లలు.

వీర ‘ప్రేమ పాట’లు
ఒక సినిమాలోని అన్ని పాటలనూ ఒకే కవి రాయడం అరుదైన సందర్భం. కృష్ణకాంత్‌ విషయంలోనూ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ద్వారా ఇది ఆవిష్కారమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రంలోని అన్ని పాటలూ బహుళ జనాదరణ పొందాయి. ముఖ్యంగా ‘నువ్వంటే నా నువ్వు.. నేనంటేనే నువ్వు’ పాటద్వారా తనలోని కవితా సౌందర్యాన్ని వ్యక్తీకరించారు. ఇందులో, ‘నీ అడుగేమో పడి నేల గుడి అయినదే.. నీ చూపేమో సడిలేని ఉరుమైనదే’ అంటారు. ఆమె పాదముద్రలు పడిన నేలపై గుడి వెలసిందట. ఆమె చూపు శబ్దం చేయని ఉరుమై తోచిందట. ఇది గొప్ప కల్పన. ఇదే చిత్రంలో ‘వెండిచీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెల..’ పాట తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ పాటలో పదాల పొందిక, వాక్య మాధుర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వీటితోపాటు ‘రారా రావేరా..’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ పాటలూ ప్రశంసలందుకున్నాయి.

మహానుభావుడే!
టైటిల్‌ సాంగ్స్‌ రాయడంలో కృష్ణకాంత్‌ నిజంగా మహానుభావుడే. 2017లో వచ్చిన
‘మహానుభావుడు’ చిత్రంలో రాసిన ‘మహానుభావుడవేరా.. నా మహానుభావుడవేరా’ పాట సినీ ప్రియులను అలరించింది. ఇదే సినిమాలో ‘మై లవ్‌ ఈజ్‌ బ్యాక్‌’, ‘కిస్‌ మి బేబీ’ పాటలుకూడా రాశారు. అదే ఏడాది ‘దర్శకుడు’ చిత్రంలో ‘ఆకాశం దించి మేఘాల్తో సెట్టు వేస్తా’ అంటూ మరో హుషారు గీతం అందించారు. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయాలనే దర్శకత్వ ప్రతిభ ఉన్న కళాకారుడిని ఈ పాటలో చూపించారు. ‘కథలో రాజకుమారి’ (2017) చిత్రం కోసం రాసిన ‘నల్లని కన్నులలో నచ్చిన రంగులే నింపిన అల్లరి కాలమిదే’ పాట ఎంతో లాలిత్యంగా సాగుతుంది. ప్రేక్షకులను ప్రేమ సందడిలో పులకరింపజేస్తుంది. ప్రేమ చేసే తుంటరి పనులేవో తెలుపుతుంది. ఇదే సినిమాలో ‘నా కథలో యువరాణి’, ‘తిక్కలోడి వేషం’ పాటలు కూడా కృష్ణ కలం నుండి జాలు వారినవే! ‘నెక్ట్స్‌ నువ్వే’ చిత్రంలో ‘అలమేడమీద ఎలా వాలెనమ్మా పదారేళ్ళ జాబిల్లి జాణై’ పాట ప్రేమికుల గుండెల్లో అల్లరి చేసింది. తొలిసారిగా ప్రేయసిని చూసిన ప్రియుడి ఎదలో మొదలైన పులకరింతను తెలియజేసింది. ‘మిస్టర్‌’ (2017) సినిమాలో లోకం పోకడను తెలియజేస్తూ ‘కదిలే లోకం మొత్తం అద్దమే కదా! సరిగా నువ్వున్నట్టే నీకు చూపదా!’ అంటూ ఓ పాట రాశారు. ‘లోకమే ఒక అద్దమై నీ ప్రతిబింబాన్ని, నీ ఉనికినీ తెలుపుతుందని’ ఎంతో తాత్వికతతో చెప్పారు.

పడి పడి లేచిన పాట
2018లో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ చిత్రం సినీగీత రచయితగా కృష్ణకాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఇందులో రాసిన ‘పదపద పదపదమని పెదవులిలా పరిగెడితే.. పరిపరి పరివిధముల మదివలదని వారిస్తే’ పాట ఎంతో హుషారుగా సాగుతుంది. మధురమైన ప్రేమబంధాన్ని, అవ్యక్తమైన అనుభూతుల్ని ఎంతో స్పష్టంగా తెలుపుతుంది. ఈ సినిమాలోని ‘ఉరికే చెలి చిలకా’,
‘హృదయం జరిపే’ పాటలుకూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. తర్వాత ‘టాక్సీవాలా’(2018)లోని ‘పెరిగే వేగమే తగిలే మేఘమే.. మాటే వినదుగ వినదుగ వినదుగ’ పాట యువతరాన్ని హుషారెత్తించింది. మనసు మాట వినని తీరునూ, ప్రేమ చిగురించిన వైనాన్నీ వివరించారీ పాటలో. ‘ప్రతి రోజూ పండగే’ (2019) సినిమాకోసం మరో మంచి టైటిల్‌ సాంగ్‌ అందించారు. ‘మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే.. పదిమంది ఉండగా ప్రతి రోజు పండగ’ అంటూ అదరగొట్టారు. ‘కలిసిమెలిసి ఉంటే అదే పండగ’ అనే చక్కని సందేశాన్నిచ్చారీ పాటలో. వీటితోపాటు పీఎస్‌వీ గరుడవేగ, హుషారు, ఒరేయ్‌ బుజ్జిగాడు, ఇదం జగత్‌ .. మొదలైన సినిమాలకూ పాటలు అందించారు. తన పాటల పదనిసలతో మురిపించే కృష్ణకాంత్‌ నిరంతరం ప్రవహించే ఓ సాహితీ స్రవంతి.

తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘టైటిల్‌' సాంగ్స్‌ స్పెషలిస్ట్‌!
‘టైటిల్‌' సాంగ్స్‌ స్పెషలిస్ట్‌!
‘టైటిల్‌' సాంగ్స్‌ స్పెషలిస్ట్‌!

ట్రెండింగ్‌

Advertisement