e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home బతుకమ్మ ఒంటరితనం హుష్‌ కాకి!

ఒంటరితనం హుష్‌ కాకి!

ఒంటరితనం హుష్‌ కాకి!

సమస్త ప్రకృతినీ సృష్టించినా ఆ దేవుడికి తనివి తీరలేదు. “ఆస్వాదించేందుకు ఓ ప్రాణి లేనప్పుడు ఈ భూమిమీది అద్భుతాలన్నీ అడవి కాచిన వెన్నెలే కదా!” అని బాధపడి పోయాడు. అందుకే, మనిషిని రూపొందించాడు. భూమి మీదున్న అన్ని జీవులకంటే ఉన్నతంగా తీర్చిదిద్దాడు. దేవుడినీ, ఆయన సృష్టినీ గుర్తించడానికి ‘మనిషి’ పుట్టాడు. మరి, ఆ మనిషిని గుర్తించడం కోసం సాటి మనిషి ఉండాల్సిందే కదా? అలా కాకుండా, తను ఒంటరి అన్న భావనలో మనిషి మునిగిపోతే? సమూహంలో ఉన్నా తన మనసు సందడి చేయడం మానేస్తే? పర్యావరణం నుంచి అనుబంధాల వరకూ తన చుట్టూ ఉండే ప్రతి భావనా వ్యర్థమే అనిపిస్తుంది. బతుకు వేదనగా మారుతుంది.

మనిషి.. ఈ లోకంలోకి ఒంటరిగానే వస్తాడని నానుడి. అది పూర్తి నిజం కాదేమో! తల్లి గర్భంలోని బిడ్డకు ఇంద్రియాలు ఏర్పడగానే బయటి శబ్దాలకు స్పందిస్తుంది. ఆ అపురూపమైన జీవిని ఈ కొత్త ప్రపంచంలోకి ఆహ్వానించేందుకు ఇక్కడ అంతా సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు, ఇంటి పెద్దలు, వైద్యులు.. అందరూ కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు. ఇక ఈ లోకంలోకి రాగానే ఆ బిడ్డ, తల్లి పొత్తిళ్లలో ఒత్తిగిలి పోతుంది. తనను చూసి మురిసిపోయే పది చేతుల మధ్య కేరింతలు కొడుతుంది. మనిషి పోయాక కూడా ఆ దేహానికి నలుగురి చేతులమీదుగా సగౌరవ వీడ్కోలు దక్కుతుంది. ప్రాణం ఉన్నంతసేపూ మనిషి ఒంటరి కానేకాదు. ఒకవేళ తను ‘ఒంటరిని’ అని భావిస్తుంటే అది సహజమైన విషయం కాదు.నిజానికి ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. చాలామంది ఏకాంతాన్ని ఇష్ట పడుతారు! ఏకాంతం ఆలోచనలు సరైన దిశలో సాగేలా చేస్తుంది. సమస్యమీద దృష్టిని మెరుగు పరుస్తుంది. కష్టసుఖాలను బేరీజు వేసుకునే తత్త్వాన్ని అలవరుస్తుంది. ఒక్కమాటలో ‘ఏకాంతం’ అంటే ‘మనతో మనం గడపడం’. జీవితాన్ని మరింత దగ్గరగా చూడటం. కానీ, ఒంటరితనం అలా కాదు. నిరంతరం తెలియని బాధలో మునిగి పోవడం! పువ్వులమధ్య ఉన్నా, నవ్వులు వినిపిస్తున్నా, సమూహం మధ్య ఉన్నా, నిద్రలోకి జారుకుంటున్నా ‘ఈ లోకం నాది కాదు’ అనే భావనతో కుంగి పోవడం. రాన్రానూ ఈ ఒంటరితనం పెరిగిపోతూ, ఓ మహమ్మారిలా మారిపోతున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఒంటరితనం హుష్‌ కాకి!
- Advertisement -

ఎందుకీ ఒంటరితనం?
‘ఇలా ఉంటే ఒంటరితనం దరిచేరదు’ అనుకోవడానికి వీలు లేదు. జగమంత కుటుంబం ఉన్నా, కెరీర్‌ విజయపథంలో సాగుతున్నా ఒంటరితనం ఆవహించవచ్చు. ఓ చిన్న అలలా మొదలయ్యే వేదనతో ‘నేను ఒంటరిని’ అనే భావన ఒక ఊబిలా మారిపోయి, అందులోకి జీవితం యావత్తూ జారిపోవచ్చు. ‘ఒంటరితనం ఎందుకు వస్తుంది?’ అన్న ప్రశ్నకు పరిశోధకులు రకరకాల కారణాలు చెబుతున్నారు.

సాంస్కృతికం
తాజా జనాభా లెక్కల ప్రకారం, మన దేశంలో వలస జీవితాలను గడుపుతున్నవారి సంఖ్య 45 కోట్లకు పైమాటే! ఈ కాలంలో చదువుకోసమో, ఉద్యోగం కోసమో పుట్టిన ఊరికి దూరంగా వెళ్లడం ఆశ్చర్యకరం కాదు. ఒక్కోసారి ఈ ప్రయాణం ఇతర రాష్ర్టాలకూ, విదేశాలకూ సాగుతుంది. కొన్నాళ్లకు కొత్తచోట ఇమిడి పోతే ఫర్వాలేదు. కానీ, తను పుట్టి పెరిగిన వాతావరణానికి, సంప్రదాయాలకూ భిన్నమైన జీవితాన్ని గడపాల్సి వస్తే మాత్రం ఒంటరితనం ఆవహిస్తుంది. “చిన్న పట్టణాలనుంచి ముంబైలాంటి మహానగరాలకు వచ్చినప్పుడు మన జీవన విధానంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. కొత్త బంధాలకోసం పార్టీల్లాంటివి అలవాటు చేసుకున్నా అంతగా ప్రయోజనం ఉండదు” అంటారు విశాల్‌ సావంత్‌ అనే సైకియాట్రిస్ట్‌.

సామాజికం
కష్టసుఖాలను పంచుకునేందుకు, కాలక్షేపం చేసేందుకు ఎక్కువ పరిచయస్తులు లేకపోవడం కూడా ఒంటరితనానికి దారి తీస్తుంది. ఇతరులతో కలివిడిగా మెలిగే అలవాటు లేనప్పుడు ఈ సమస్య ఎదురుకావచ్చు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు కూడా తాము అనుబంధాలకు అనర్హులమని భావించినప్పుడూ ఒంటరితనంలోకి జారిపోతారు. ఇక వయసు మీద పడిన వారిగురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే! మరణం, వలసలు లాంటి రకరకాల కారణాలతో నా అన్నవారంతా దూరమైనప్పుడు ఒంటరితనమే మిగిలేది. వీడియో కాల్స్‌ చేస్తూ, లోకమంతా ఓ గ్లోబల్‌ విలేజ్‌గా మారిపోయిందని మురిసిపోయినా, అది భౌతికదూరాన్ని ఏ మాత్రం భర్తీ చేయలేదు.

అరకొర బంధాలు
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్‌ వైస్‌ ‘అటాచ్‌మెంట్‌ థియరీ’ అనే సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చారు. కష్టసుఖాలలో పాలు పంచుకోవడం, బంధానికి విలువ ఇవ్వడం, నమ్మకం, సామీప్యం, ఎదుగుదలకు తోడ్పడటం, కలిసి మెలిసి ఉండటం.. అంటూ దీనికోసం ఓ ఆరు లక్షణాలను సూచించారు. స్నేహితులు ఎంత దగ్గరి వారైనా.. వీటికి పూర్తిగా న్యాయం చేయలేరన్నది రాబర్ట్‌ ప్రతిపాదన. తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వాములు లాంటి సమీప కుటుంబసభ్యులు మాత్రమే ఈ మానసిక అవసరాలను తీర్చగలరని ఆయన నమ్మకం. అది కుదరని పక్షంలో ఒంటరితనం నీడలా వెన్నాడుతుంది. దెయ్యంలా భయపెడుతుంది. రంపపుకోతై నరకం చూపుతుంది.

లాక్‌డౌన్‌ ఏకాంతం
ఇది సరికొత్త సమస్య! ‘కొవిడ్‌-19’వల్ల లాక్‌డౌన్‌, సామాజిక దూరాలు తప్పడం లేదు. నిబంధనలు సడలించినా కూడా, అలలు అలలుగా వస్తున్న కరోనానుంచి సురక్షితంగా ఉండేందుకు మనుషులు ఎక్కడికీ కదలడం లేదు. దీనికి సంబంధించి అమెరికాలో వెయ్యిమంది అభ్యర్థులతో ఓ సర్వే నిర్వహించారు. వీరిలో 80 శాతం మంది కొవిడ్‌ సమయంలో తీవ్ర ఒంటరితనానికి లోనయ్యామని, అది తీవ్రమైన కుంగుబాటుకు దారితీసిందనీ వాపోయారు. ఆ వేదనను తట్టుకునేందుకు విపరీతంగా మద్యం తాగుతున్నామని 44 శాతం మంది, డ్రగ్స్‌కూడా తీసుకున్నామని 22 శాతం మందీ చెప్పుకొచ్చారు.

డిజిటల్‌ ధ్వంస రచన
ఇంటర్నెట్‌వల్ల ప్రపంచం అంతా మన గుప్పిట్లో ఉన్నట్టు తోచడం ఓ భ్రమ. ఇందుకు సంబంధించి జరిగిన పరిశోధనల్లో అధిక శాతం డిజిటల్‌ మీడియా ఒంటరితనానికి దారితీస్తున్నదని తేల్చేస్తున్నాయి. ‘డిస్‌ప్లేస్మెంట్‌ హైపోథసిస్‌’ అనే సిద్ధాంతం ప్రకారం, ఇంటర్నెట్‌ ఓ వ్యసనంగా మారిపోయినవారు అందులో ఎక్కువసేపు గడపడానికి తమ బంధాలనుంచి దూరం జరుగుతున్నారు. జనమంతా గుమికూడే సోషల్‌ మీడియాలో ఎక్కువసేపు గడపడం వల్ల, ఒంటరితనం తగ్గకపోగా మరింతగా పెరిగిపోవడం విచిత్రం. అక్కడ సహజమైన భావాలను వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం, ఇతరులకంటే గొప్పగా ఉన్నామని సూచించే పోస్టులే కనిపించడం ఇందుకు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు.

జన్యుపరం
చాలా సందర్భాల్లో ఒంటరితనమనేది మనస్తత్వం మీదకూడా ఆధారపడి ఉంటుంది. అందులో జన్యువుల పాత్రనూ కాదనలేం. కొన్ని అంచనాల ప్రకారం సగానికి పైగా సందర్భాల్లో ఒంటరితనం అనే భావన జన్యుపరం కావచ్చని పరిశోధకులు తేల్చారు. 2016లో అమెరికాకు చెందిన పలువులు శాస్త్రవేత్తలు ఈ విషయంలో స్పష్టతకోసం ఓ పరిశోధన చేశారు. పదివేల మందికి పైగా జన్యువులను పరిశీలించిన మీదట ఒంటరితనానికి, జన్యువులకూ మధ్య సంబంధం 27 శాతం వరకూ ఉన్నదని గమనించారు.ఒంటరితనానికి ఇతరత్రా కారణాలు చాలానే ఉన్నాయి. దగ్గరివారు చనిపోయినా, సరైన భాగస్వామి దొరక్క పోయినా, యుక్తవయసులో తోడు లేకున్నా, కలివిడి మనస్తత్వం ఉన్నవారు ఏకాంతంగా గడపాల్సి వచ్చినా, ఒత్తిడితో కూడిన జీవన విధానం, డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలూ.. అన్నీ కూడా ఒంటరితనానికి దారి తీసేవే. చాలా సందర్భాల్లో తాత్కాలిక సమస్యలుగా తోచే ఈ కారణాలు గొలుసుకట్టు చర్యగా మారి తీవ్రమైన క్షోభకు దారితీస్తాయి. అదో మానసికమైన హింస.

ఒంటరితనం హుష్‌ కాకి!

పరిష్కారం లేకపోలేదు

కొంతమంది ఏకాంతాన్ని ఇష్టపడతారు. కొందరు అంతర్ముఖంగా ఉంటారు. కొన్ని సందర్భాలు ఎవరినైనా ఒంటరితనానికీ, వేదనకూ గురిచేస్తాయి. కానీ, అది ఓ సమస్యగా మారిందనే ఎరుక ఉన్నప్పుడు, దానినుంచి వీలైనంత త్వరగా బయటపడే ప్రయత్నం చేయాలి. అందుకు సమర్థమంతమైన పరిష్కారాలు కూడా ఉన్నాయి.

ఒంటరితనం హుష్‌ కాకి!
 • ‘ఓ సరికొత్త వ్యాపకాన్ని’ అలవాటు చేసుకోవడంతో మనసు ఆహ్లాదంగా మారడమే కాదు, అదే అభిరుచి ఉన్నవారిని కలిసే అవకాశం ఇస్తుంది.
 • ‘ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే’ సగం ఒంటరితనం దూరమై పోతుందంటున్నారు సైకాలజిస్టులు. అలా బాహ్య లోకంలోకి వెళ్లిన ప్రతిసారీ ఎవరో ఒకరిని పలకరించే ప్రయత్నం చేయాలని అంటున్నారు.
 • ‘ఆరుబయట తిరగడం’ వల్ల సూర్యకాంతితో కూడా ఒంటికి మేలు కలుగుతుంది. అందులో ఉండే సెరిటోనిన్‌ మనసుకు హాయినిస్తుంది.
 • ‘స్వచ్ఛంద సేవ’ ఒంటరితనానికి దివ్యౌషధం! సేవతో నలుగురిలో తిరిగే అవకాశం, సమష్టి తత్వం (టీమ్‌ వర్క్‌), నాయకత్వ లక్షణాలు లాంటివి ఎలాగూ అలవడతాయి. మనకు వీలైన సాయం చేస్తున్నామనే భావన ఎనలేని విశ్వాసాన్ని, తృప్తినీ కలిగిస్తుంది.
 • ‘పెంపుడు జంతువులు’ ఒంటరితనాన్ని దూరం చేస్తాయని ఎన్నో పరిశోధనలు నిరూపిస్తున్నాయి. మనతో మెలిగే మరో జీవి, జీవితంలోని వెలితిని తీరుస్తుంది.
 • ‘సృజన మెరుగుపడే పనులు’ మెదడును మొద్దుబారిపోనియ్యవు. అందుకోసం పజిల్స్‌ చేయడం, సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం లాంటి వ్యాపకాలు చాలానే ఉన్నాయి.
 • ‘వ్యాయామం’ శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా బలాన్నిస్తుంది. శరీర పరిశ్రమ చేసేటప్పుడు మనసులో ఇతర ఆలోచనలకు చోటు ఉండదు. ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లతో మూడ్‌ మెరుగుపడుతుంది. జట్టుగా ఆడే క్రికెట్‌ లాంటి క్రీడలతో మరింత మేలని పరిశోధకులు చెబుతున్నారు.
 • ‘స్నేహితులు’ ఉన్నచోట ఒంటరితనం ఇబ్బంది పడాల్సిందే. భేషజాలు విడిచి వారితో మన కష్టాలను పంచుకుంటే, సరదాగా కాలక్షేపం చేస్తుంటే, ఎంతటి వేదనైనా కరిగిపోవాల్సిందే.
 • ‘సత్సంగాలు’ లాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వృద్ధులు.. జీవనసంధ్యలో ఉన్న ఒంటరితనాన్ని మర్చిపోగలుగుతుంటారు.
 • ఇంత చేసినా ఒంటరితనం పీడిస్తుంటే.. తక్షణమే సైకాలజిస్టులను కలవాలి. సమస్యకు మూలమైన కారణాలను వాళ్లు శాస్త్రీయంగా విశ్లేషిస్తూ, తగిన థెరపీని అందిస్తారు.

మనిషి సంఘజీవి. ఒంటరిగా ఉంటే తన ఉనికి, విచక్షణ వృథానే! కాబట్టి, ‘నేను ఒంటరిని’ అనే భావన అసహజమని గుర్తించి, వీలైనంత త్వరగా దానినుంచి బయట పడగలగాలి. అంతేకాదు,
తల్లిదండ్రుల దగ్గరనుంచి ఇరుగుపొరుగు వరకు.. ఎవరూ ఒంటరితనానికి బలికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తన మీద ఉంది. అప్పుడే మనిషి, అతనితోపాటు సమాజం పరిపూర్ణమవుతుంది.

పెంపుడు జంతువులతో ఒంటరితనం దూరమవుతుందని తెలిసిందే. కానీ, వాటిని చూసుకోవడం కూడా ఓ పనే కదా! సత్తువ లేని వృద్ధులకు వాటి సంరక్షణ తలకు మించిన భారంగా మారవచ్చు. అందుకే, ‘రోబో పెట్స్‌’కు డిమాండ్‌ పెరుగుతున్నది. ఇవి యజమాని స్పర్శకు స్పందిస్తాయి. నిజమైన జంతువుల్లా శబ్దం చేస్తాయి. వాటిలో హృదయ స్పందన కూడా వినిపిస్తుంది. ఉన్ని కూడా సహజంగానే ఉంటుంది. ఓ ఏడాదిపాటు వీటితో గడిపిన వృద్ధులను విచారించగా.. వారి ఒంటరితనానికి విరుగుడుగా ఇవి అద్భుతంగా పని చేసినట్టు తేలింది. దీంతో కొన్ని ప్రభుత్వసంస్థలు కూడా వీటిని ఉచితంగా పంచేందుకు ముందుకు వస్తున్నాయి.

న్యూజిలాండ్‌లో ఏఏ కారణాలు ఒంటరి తనానికి దారి తీస్తున్నాయో తెలుసుకునేందుకు ఓ సర్వే చేశారు. పేదరికం, కుటుంబం నుంచి దూరంగా ఉండటం, నిరుద్యోగం, అంగవైకల్యం, వృద్ధాప్యం, సంపాదనకు తగిన అర్హతలు లేకపోవడం, జీవిత భాగస్వామి లేకుండానే పిల్లలను చూసుకోవడం (సింగిల్‌ పేరెంట్‌), మారుమూల ప్రాంతాల్లో నివసించడం, ఇల్లు లేకపోవడం.. లాంటి కారణాలను గుర్తించారు. 15-24 ఏండ్ల మధ్య వయసువారిలో ఈ సమస్య తీవ్రంగా కనిపించింది.

జపనీయుల కఠినమైన పని విధానాల గురించి తెలిసిందే. కెరీర్‌కు ప్రాధాన్యమిచ్చే క్రమంలో అక్కడి పల్లెలు ఖాళీ అవుతున్నాయి. కుటుంబాలు దూరమవుతున్నాయి. ఆ ఒంటరితనాన్ని పూడ్చుకునేందుకు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, కష్టసుఖాలలో పాలు పంచుకునేందుకు ‘అద్దెకు ఆత్మీయుల’ను (రెంట్‌ ఏ ఫ్యామిలీ) అందించే సంస్థలూ అక్కడ మొదలయ్యాయి.

లక్షణాలు సుస్పష్టం!

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక దశలో ఒంటరితనం వచ్చి తీరుతుంది. అది సహజం. ఒక్కోసారి ఒంటరితనం మన ఉనికిని, వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతనూ ఇతరులకు తెలియచేసే సందర్భంగా మారుతుంది. కానీ, శృతి మించినప్పుడు, ఇతర సమస్యలకు కారణమవుతుంది. అందుకే కొన్ని లక్షణాలను గమనించుకోవాలి.

ఒంటరితనం హుష్‌ కాకి!
 • వారానికి ఒకసారికి మించి ఒంటరితనపు భావన తీవ్రంగా ఉంటే అది ‘సమస్యే’ అని ఓ అభిప్రాయం. కొందరు సైకాలజిస్టులు UCLA Loneliness Scale ద్వారా ఈ ఒంటరితనాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తారు. ‘నాకు ఎవరూ లేనట్టు అనిపిస్తున్నది’, ‘ఒంటరిగా ఉండాలనిపిస్తున్నది’ లాంటి ఓ 20 అభిప్రాయాల ద్వారా ఒంటరితనపు స్థాయిని, కారణాలనూ ఊహిస్తారు.
 • ఒంటరితనంలో నిద్ర సరిగ్గా ఉండదు. నిశ్చింతగా పడుకోలేక పోవడం, మధ్యమధ్యలో లేస్తూ ఉండటం, ఉదయం పూట మత్తుగా ఉండటం సహజం.
 • ఈ సమస్య ఉన్నప్పుడు ఆకలికూడా మందగిస్తుంది. చాలా సందర్భాలలో ఏం తింటున్నామనే ధ్యాసే లేక విపరీతంగా జంక్‌ ఫుడ్స్‌ తినేస్తుంటారు.
 • నిస్సత్తువగా ఉంటుంది. దేనిమీదా దృష్టి పెట్టలేక పోతుంటారు. మనసంతా ఏదో తెలియని అలజడి, ఒత్తిడితో నిండిపోతుంది.
 • మనసులోని లోటును భర్తీ చేసుకోవడానికి విపరీతంగా షాపింగ్‌ చేస్తూ గడిపేయడం, ఏదో ఒక తెరకు అతుక్కు పోవడం చేస్తుంటారు.
 • సిగరెట్‌, మద్యం లాంటి అలవాట్లూ శృతి మించుతాయి.
 • తనలో తానే లేదా ఏవైనా వస్తువులతో మాట్లాడుతూ ఉంటారు.

ఇవే కాదు, ఎవరితోనూ కలవకుండా నాలుగుగోడల మధ్యే ఉండిపోయే ప్రయత్నం చేస్తుంటారు. వ్యాయామం లాంటి వాటి జోలికి పోకపోవడం, మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా ఇబ్బంది పడటం.. అన్నీ కూడా ఒంటరితనం తీవ్రమైందని హెచ్చరించే లక్షణాలే! ఒంటరితనంతో బాధ పడేవారు ‘తమను ఎవరన్నా పట్టించుకుంటే బాగుండు’ అనుకుంటారు. కానీ, తమంతట తాముగా సంభాషణకు చొరవ చూపలేరు. ఎదుటివారు ముందుకు వచ్చినా ముడుచుకు పోతారు.

ఫలితం అనూహ్యం!

ఒంటరితనం గుండెమీద తీవ్ర ప్రభావం చూపుతుందట. రక్తపోటులాంటి సమస్యలతో హృదయానికి చేటు చేస్తుందట. అంతేకాదు, అప్పటికే గుండె సమస్యలున్నవారు, ఒంటరితనంతో కూడా ఇబ్బంది పడటం మొదలైతే వారు మరణానికి త్వరగా చేరువవుతారని ఫైజర్‌ జర్నల్‌లోని ఓ పరిశోధన చెబుతున్నది.

 • 2012లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ సర్వేలో, ఒంటరిగా ఉండేవారు ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలకు త్వరగా గురవుతున్నారని తేలింది.
 • ఒంటరితనంతో మన హార్మోన్ల వ్యవస్థకూడా అస్తవ్యస్తమవుతుంది. ఒత్తిడి సమయంలో విడుదలయ్యే కార్టిజాల్‌ శాతం పెరిగి పోవడంతో అజీర్ణం, నిద్రలేమి లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మరోవైపు డోపమైన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో సంతోషం లాంటి అనుభూతులకూ దూరంగా ఉంటారు.
 • మనలో రోగ నిరోధక శక్తికి తోడ్పడే NK అనే కణాలమీద ఒంటరితనపు ప్రభావం ఉంటుందట. దీంతో హెర్పస్‌, ఇన్‌ఫ్లుయాంజా లాంటి వ్యాధులు త్వరగా కమ్ముకుంటాయి.
 • ఒంటరితనం పిల్లలనుకూడా వేధిస్తుంది. ఆ వేదనతో వాళ్లు చదువుమీద శ్రద్ధ పెట్టలేక పోవడంతోపాటు ఇతరులకు హాని తలపెట్టే మనస్తత్వంలోకి జారిపోతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 • మతిమరపు త్వరగా వచ్చేస్తుంది. వృద్ధుల్లో మెదడుకు సంబంధించిన, అల్జీమర్స్‌ లాంటి సమస్యలను రెట్టింపు చేస్తుందని తేలింది. 65 ఏండ్లు దాటిన 8,000 మందికి పైగా వృద్ధులను గమనించిన తర్వాత తేలిన విషయమిది.
 • 2018లో టర్కీకి చెందిన ఎవ్రన్‌ అనే నిపుణుడు 40వేల మందిమీద జరిగిన 88 పరిశోధనలను విశ్లేషించాడు. ఒంటరితనం తీవ్రమైన కుంగుబాటుకు దారి తీస్తున్నదని తేల్చాడు.
 • ఓ అంచనా ప్రకారం ఊబకాయం, వ్యాయామం లేకపోవడం కంటే ఒంటరితనం మరింత ప్రాణాంతకం. ఇంకా మాట్లాడితే, రోజుకు పదిహేను సిగరెట్లు తాగే అలవాటుతో సమానమైన ప్రమాదమిది.
 • ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఆత్మహత్యలకు కారణాలను గమనించినప్పుడు, ఒంటరితనం కూడా ఓ ముఖ్య కారణమని తేలింది.

భౌతికమైన ఒంటరితనం

మానసికంగా ఒంటరిగా ఉంటేనే రకరకాల సమస్యలు వస్తాయని అర్థమవుతున్నది. మరి, భౌతికంగా ఒంటరిగా ఉంటే ఆ అవస్థకూడా భిన్నమైందేమీ కాదు. ఈ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పేందుకు రకరకాల పరిశోధనలు, అనుభవాలూ అందుబాటులో ఉన్నాయి.

ఒంటరితనం హుష్‌ కాకి!

2018 నవంబర్‌లో అమెరికాకు చెందిన ‘రిచ్‌ అలాటి’ అనే యువకుడు ఓ పందెం కాశాడు. 30 రోజులపాటు తను వెలుతురు కూడా లేని గదిలో ఏకాంతంగా ఉంటానని సవాల్‌ చేశాడు. పందెం విలువ 80 లక్షల రూపాయలు. భలే పందెం కదా! నెల రోజులు ఓపిక పడితే, జీవితానికి సరిపడా డబ్బు. కానీ, అదేమంత తేలిక కాదని, ఆ పందెం గురించి విన్న ఓ సైకియాట్రిస్ట్‌ హెచ్చరించాడు. పందెం మొదలైంది. చీకటి గదిలో ఫ్రిజ్‌, మంచం, బాత్రూమ్‌ అన్నీ ఉన్నాయి. కాబట్టి, నిద్రాహారాలకు లోటు లేనట్టే. ఒకటి రెండు రోజులు బాగానే గడిచాయి. మూడో రోజునుంచే అసలు కథ మొదలైంది. గదంతా బుడగలతో నిండిపోయిన చిత్రమైన భావన వచ్చింది అతనికి. గది పైకప్పు హఠాత్తుగా మాయమైపోయి, తారలు మిణుకుమనే తీరమేదో కనిపించింది. తనను తాను సంభాళించుకోవడానికి చాలానే ప్రయత్నించాడు. కానీ, ఒంటరితనంతో, చీకటితో పిచ్చెక్కిపోయింది. నిద్ర పట్టదు, ఆకలి వేయదు.

ఎవరో తనను గమనిస్తున్న వింత భావన, కారణం లేకుండా విరుచుకుపడే భయం. మొత్తంగా 20 రోజులు గడిచేసరికి తన వల్ల కాలేదు. ‘నాకు ఎంత ఇచ్చినా ఫర్వాలేదు. నన్ను బయటికి తీయండి మహాప్రభో’ అంటూ విలవిల్లాడాడు.మనిషి సంఘజీవి కాబట్టి, మరో వ్యక్తిని చూడకుండా, మాట్లాడకుండా ఉండలేడన్నది మనస్తత్త్వవేత్తల మాట. అంటార్కిటికాలో పరిశోధనలకోసం నెలల తరబడి చిన్నచిన్న సమూహాల్లో ఉండేవారి ముఖ్యమైన బాధ మంచు కాదు, అంతకంటే చల్లగా ఉండే ఒంటరితనం. ‘యోసి గిన్స్‌బర్గ్‌’ అనే ఇజ్రాయెల్‌ పరిశోధకుడు ఓసారి అమెజాన్‌ అడవుల్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పిచ్చెక్కిపోకుండా ఉండేందుకు, ఊహాజనిత స్నేహితులకు ప్రాణం పోసుకున్నాడు. ‘నతాషా’ అనే ఆస్ట్రేలియా అమ్మాయిని కిడ్నాపర్లు ఎనిమిదేండ్లపాటు గదిలో బంధించారు. దాంతో తన మెదడు ఆలోచించడం కూడా మానేసిందని వాపోయారు. ఒంటరితనం ఇంత భయంకరమైంది కాబట్టే, ‘ఖైదీలను 15 రోజులకు మించి ఒంటరిగా ఉంచడం చిత్రహింసతో సమానం’ అని సాక్షాత్తు ఐరాస (ఐక్యరాజ్యసమితి) పేర్కొంది.

ఓ దేశంలోని జీవన విధానం కూడా అక్కడి ప్రజల ఒంటరితనంపై ప్రభావం చూపిస్తుంది. ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కవ ప్రాధాన్యం ఇచ్చే ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు బీబీసీ తీర్మానించింది. 2018 నాటికి ఇంగ్లండ్‌ పౌరులను ఒంటరితనం ఓ మహమ్మారిలా కమ్ముకుంది. అనారోగ్యాలతోపాటు హత్యలు, ఆత్మహత్యలు మొదలయ్యాయి. ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, ఆ దేశంలో రెండు లక్షల మందికి పైగా
వృద్ధులు, ఎవరన్నా స్నేహితుడు లేదా బంధువుతో మాట్లాడి నెల దాటి పోయిందట! ఇందుకు పరిష్కారంగా ఏకంగా ‘మినిస్టర్‌ ఆఫ్‌ లోన్లీనెస్‌’ అంటూ ఓ మంత్రినే నియమించారు. ఇక జపాన్‌లో, కొవిడ్‌ సమయంలో ఆర్థిక అభద్రతతో ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం కూడా మినిస్టర్‌ ఆఫ్‌ లోన్లీనెస్‌ను నియమించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఒంటరితనం హుష్‌ కాకి!
ఒంటరితనం హుష్‌ కాకి!
ఒంటరితనం హుష్‌ కాకి!

ట్రెండింగ్‌

Advertisement