e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home బతుకమ్మ ఖమ్మంలో..తమిళ మారియమ్మన్‌!

ఖమ్మంలో..తమిళ మారియమ్మన్‌!

ఖమ్మంలో..తమిళ మారియమ్మన్‌!

‘మారెమ్మ తల్లి’.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధికెక్కిన గ్రామదేవత మారెమ్మ. ఖమ్మం నడిబొడ్డున మారెమ్మ తల్లి కొలువుదీరడం వెనుక పెద్ద కథే ఉంది. తమిళనాడు నుంచి తరలివచ్చిన ‘మారియమ్మన్‌’ అనే గ్రామ దేవత ఇక్కడ మారెమ్మ తల్లిగా పూజలు అందుకొంటున్నది.

గ్రానైట్‌ పరిశ్రమకు పెట్టింది పేరు ఖమ్మం. జిల్లాలోని తెలుగు ప్రజలతోపాటు పొరుగు రాష్ర్టాల కార్మికులూ ఇక్కడ పని చేస్తుంటారు. పరిశ్రమ ప్రారంభమైన తొలినాళ్లలో.. అంటే, 1970లో పొరుగు రాష్ర్టాలనుంచి వలస ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా, తమిళనాడునుంచి భారీగా కార్మికులు తరలి వచ్చేవారు. 1982లో గ్రానైట్‌ పరిశ్రమలో పెను ప్రమాదాలు మొదలయ్యాయి. కార్మికులు తరచూ గాయాలకు గురయ్యే వారు. మరణాలూ సంభవించేవి. ఆ కష్ట సమయంలో తమిళ కార్మికులకు తమ ఇలవేల్పు గుర్తుకొచ్చింది. ఆ తల్లి కరుణ ఉంటే విఘ్నాలను అధిగమించవచ్చని భావించారు.

‘మారియమ్మన్‌’ కొలువైన వేళ!
తమిళనాడులో గ్రామదేవతల ప్రభావం ఎక్కువే. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడమంటూ, పిల్లాపాపలనూ పాడిపంటలనూ రక్షించమంటూ తమిళులు ‘మారియమ్మన్‌’ అనే గ్రామదేవతను పూజిస్తారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆ దేవతకే మొర పెట్టుకొంటారు. అనుకున్నదే తడవుగా, ప్రస్తుత రెడ్డిపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో ‘మారియమ్మన్‌’ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందుకు జేబీ అనే గ్రానైట్‌ సంస్థ చొరవ చూపింది. అలా, మారియమ్మన్‌ దేవత కొలువుదీరింది. యాదృచ్ఛికమో దైవకృపో.. ఏదైతేనేం, నాటినుంచి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కార్మికుల్లో ఆ తల్లిపట్ల విశ్వాసం పెరిగింది. గండాల నుంచి గట్టెక్కించే చల్లని వేలుపుగా, ముగురమ్మల మూలపుటమ్మగా అందరూ ‘మారియమ్మన్‌’ను కొలవడం మొదలుపెట్టారు. స్థానిక ప్రజల్లో సైతం ఆ దేవతపట్ల గురి కుదిరింది. దీంతో భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది.

ఖమ్మంలో..తమిళ మారియమ్మన్‌!

ఆలయ నిర్మాణం
చాలాకాలం పాటు మారియమ్మన్‌కు ప్రత్యేకించి ఓ ఆలయమంటూ లేదు. భక్తులు దాన్నో వెలితిగా భావించారు. 2003లో దేవాలయాన్ని నిర్మించారు. స్థానికులు కూడా వెన్నుదన్నుగా నిలువడంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. ఆ తర్వాత పొరుగు జిల్లాలనుంచి భక్తుల రాక మొదలైంది. నల్లగొండ, కృష్ణా, వరంగల్‌, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలనుంచి యాత్రికులు వరుసకట్టేసరికి మారియమ్మన్‌ దేవాలయం ప్రాచుర్యం పొందింది. ఖమ్మం మెట్టు కాస్తా ఖమ్మంగా మారినట్టు, ‘మారియమ్మన్‌’ అనే పేరు ‘మారెమ్మ’గా రూపాంతరం చెందింది. గడచిన రెండు దశాబ్దాల కాలంగా దేవతకు ‘మారెమ్మ’ అన్న పేరే స్థిరపడింది. ఇదే క్రమంలో భక్తులు కోరిన కోర్కెల విషయంలో నమ్మకం పెరగడంతో, గురు, శుక్ర వారాలతోపాటు ఆదివారం దేవాలయం వద్ద ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. ఆలయం రెడ్డిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటమూ కలిసొచ్చింది. దేవాలయం వద్ద నెలకొల్పిన ఫంక్షన్‌ హాల్స్‌లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఏటా సుమారు 5 వేల పెండ్లిళ్లు ఇక్కడ జరుగుతాయి.

దేవాదాయశాఖ పరిధిలోకి..
మారెమ్మ తల్లి ఆలయాన్ని 2018లో దేవాదాయ శాఖ తన పరిధిలోకి తీసుకొంది. ఈ గుడికి రూ.60 లక్షల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. దేవాలయం కింద ఉన్న మరికొంత భూమిని అభివృద్ధి చేసి ఆవరణను విస్తరించాలన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. తమిళనాట గ్రామదేవతగా కొలుచుకునే మారియమ్మన్‌ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి తరలివచ్చి, మారెమ్మ తల్లిగా పేరు పొందడం విశేషమే. నిజానికి, తెలుగు రాష్ర్టాల్లో ప్రతి పల్లెలోనూ మారెమ్మ గుడి ఉంటుంది. ఇక్కడ మాత్రం.. మారియమ్మన్‌, మారెమ్మగా మారడం ఆసక్తికర ఘట్టం.

ఖమ్మంలో..తమిళ మారియమ్మన్‌!

-నాగరాజు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఖమ్మంలో..తమిళ మారియమ్మన్‌!

ట్రెండింగ్‌

Advertisement