మనిషికి, దేవుడికి ఏమిటీ సంబంధం? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన సమాధానం చెబుతారు. కానీ, అసలైన జవాబు యువ ఫొటోగ్రాఫర్ వినోద్ వెంకపల్లి ఛాయాచిత్రాల్లో కనిపిస్తుంది. దైవానుగ్రహం కోసం పరితపించే సామాన్య భక్తుల వేదిక జాతర. నిండైన భక్తితో దేవుణ్ని ఆరాధిస్తారు అక్కడ. మెండైన మొక్కులు చెల్లిస్తారు. ఈ హడావుడి అంతా తమకు కనిపించని దైవం కండ్ల ముందు సాక్షాత్కరించాలనే! ఆ నిష్కల్మష భక్తిని తన కెమెరాలో బంధించాడు వినోద్. ఆ చిత్తరువుల సమాహారాన్నే ‘ఇనాబ్సెన్షియా’ సిరీస్‌గా ఫొటో డాక్యుమెంట్ చేశాడు. ఇది అంతర్జాతీయ ఫొటో ఫెస్టివల్ ‘కేజీప్లస్’ వేదికపై ప్రదర్శనకు ఎంపికైన సందర్భంగా ఆ ఫొటో జాతర విశేషాలు…
జీవితంలో ఏ పరిణామం కారణంగా అయినా తీరని నష్టం జరిగితే.. ‘ఇలా జరగకపోయి ఉంటే ఎంత బాగుండేదో’ అనుకుంటూ ఉంటారు. చాలా సమస్యలు మనుషుల్ని కట్టేస్తుంటాయి. ఇది లేకపోతే అని నిట్టూరుస్తుంటారు. ఆ ‘ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్’ అనే వాడుక మాటను ‘ఇనాబ్సెన్షియా’గా నా ఫొటో సిరీస్‌కి పేరు పెట్టుకున్నాను. ఈ సిరీస్ కోసం నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నాను. మన హైదరాబాద్‌లో బోనాల పండుగ, గణపతి నవరాత్రులు ఫొటోలు తీశాను. అలాగే తెలంగాణలో జరిగే ఏడుపాయల జాతర, కోల్‌కతాలో నవరాత్రులు, కుంభమేళా దర్శించాను. దక్షిణాఫ్రికా వెళ్లి.. అక్కడి ప్రజలు దేవుడిని వేడుకోవడం చూశాను. వాళ్ల మనోవ్యథను గమనించాను. భారాన్ని భగవంతుడిపై మోపిన తర్వాత తేలికపడ్డ వాళ్ల ముఖాల్లో ఆనందాన్ని చూశాను. ఇవన్నీ కెమెరాలో బంధించాను.
ఏ ఆలయానికి వెళ్లినా బాధతో ఉన్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. కష్టాలు చెప్పుకొంటూ ఉంటారు. రేపు ఆ కష్టాలు తీరుతాయో? లేదో? కానీ, ఆ బాధలు తీరకముందే మనసులు తేలికపడుతుంటాయి. అది తాత్కాలికమే అయినా కొంత ఉపశమనమే. అదే శాంతి. భగవంతుడిని అందరూ కోరేది జీవితంలోని చీకట్లు తొలగిపోవాలనే! ఈ ప్రపంచంలో ఎంతోమంది దేవుడిని వేడుకుంటున్నారంటే.. ఈ లోకమంతా చీకట్లలో ఉన్నదనే నాకు అనిపించింది. అందుకే నా ఫొటో సిరీస్‌లో ఈ ప్రపంచాన్ని చీకట్లలో చూపించాలనుకున్నాను. రాత్రి పూట ఫ్లాష్ వేసి కొన్ని ఫొటోలు తీశాను. ఆ చీకటి నుంచి మనిషి వెలుగు కోసం పడే ఆరాటం, తాపత్రయం, బాధ, త్యాగం, జంతుబలి ఈ సిరీస్‌లో చూపించాను. తమ చుట్టూ ఉన్న చిక్కుల నుంచి కాపాడమని శాంతిని కోరే మనిషి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు. కానీ, స్వార్థ రాజకీయాలు, కులాధిపత్యం, మత ఘర్షణలు, యుద్ధాలు ఇవన్నీ దేవుడికి వ్యతిరేకం. అవి ఉన్నప్పుడు దేవుడు ఉండడు. దైవం లేనిచోట శాంతి ఉండదు. శాంతి లేని సమాజంలో మనిషి దేవుడికి భక్తితో స్వాగతం పలుకుతూనే ఉంటాడని ఈ సిరీస్‌లో చెప్పదలిచాను.
అధిగమించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి మీద భారం వేయాలి. లేకపోతే బతకడం కష్టం. కొంతమంది ఎవరి మీదా భారం వేయకుండా మోస్తుంటారు. కొంతమంది ఎవరి మీదా ఆధారపడలేక దేవుడే దిక్కు అనుకుంటారు. అది తప్పు కాదు. అందుకే బతుకు అగమ్యగోచరమైన వాళ్లకు దేవుడు కనిపిస్తాడని నేను నమ్ముతాను. ఆ భారాన్ని దేవుడి మీద మోపడం వాళ్ల మనసుకు సాంత్వన కలిగిస్తుంది. ఏదైనా కష్టం వస్తే ఒక స్నేహితుడికి చెప్పుకొన్నట్టు, ఇంట్లో వాళ్లతో బాధలు పంచుకున్నట్టు, ఒక మనిషి ఆలయానికి వెళ్లి దేవుడికి చెప్పుకొంటాడు. ఎవరి మీదో భారం వేసి బాధపెట్టే కంటే… వాటిని మోయలేక వ్యాకులత చెందడం కంటే… దేవుడిపై భారం మోపడమే ఉత్తమం. ఈ జీవన సత్యాలే చెబుతున్నాయి ఇనాబ్సెన్షియా ఫొటోలు.
జపాన్‌లోని క్యోటోలో జరిగే ‘కేజీప్లస్’ ఫొటో ఫెస్టివల్‌కి ఎంపికైన పదిమంది ఫొటోగ్రాఫర్లలో నేను ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందూ తెలంగాణ జాతరలపై ఒక ఎనిమిది సంవత్సరాలపాటు పనిచేశాను. ‘ప్రామిస్డ్ హెవెన్’ పేరుతో ఆ ఛాయాచిత్రాలను ప్రదర్శించాను. నల్లగొండ జిల్లాలో ఉండే ఫ్లోరోసిస్ సమస్య నా మొదటి ఫొటో డాక్యుమెంటరీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్ల సమస్య ప్రధానమైనది. తాగునీరు, సాగునీరు లేని కష్టాలు, ప్రాజెక్ట్ నిర్మాణాలు, ఆ తర్వాత నిర్వాసిత సమస్యలను డాక్యుమెంట్ చేశాను. తెలంగాణ జాతర ఫొటోగ్రఫీకి నాకు టోటో ఫొటోగ్రఫీ అవార్డ్ వచ్చింది. ప్రజలు, సంస్కృతి ఫొటోలు నాకు సంతోషాన్నిస్తాయి. అందుకే రాయిటర్స్‌లో ఉద్యోగం వదులుకుని డాక్యుమెంటరీలు చేస్తున్నా. జర్నలిజంలో లేని సంతృప్తి ఈ డాక్యుమెంటరీల రూపకల్పనలో దొరికింది.