తరాలు మారేకొద్దీ మనుషుల ఆలోచనా సరళిలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ కాలంలో అయినా లోకం పోకడే మనిషి మనుగడను ప్రభావితం చేస్తుంటుంది. సినిమాలు, నవలలు ఆ తరంపై మంచి-చెడు ప్రభావాలు చూపించాయి. ఈ తరానికి వచ్చే సరికి సోషల్ మీడియా ఉచ్చు బిగుసుకుంది. ఈ డిజిటల్ వలయాన్ని ఛేదించి జయకేతనం ఎగురవేస్తున్న విజేతలూ ఉన్నారు. ‘నెట్’లో చిక్కుకొని బయటికి రాలేకపోతున్న వాళ్లూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నయా జమానా ఆలోచనా విధానం ఎలా ఉందంటే..
నేటి యువత రోజులో కనీసం ఆరేడు గంటలు సోషల్ మీడియాకు అంకితమవుతుంది. ఇన్నేసి గంటలు సెల్‌తో కాలక్షేపం చేయడం వల్ల వాళ్లకు ఒనగూరేదేమిటి? అన్నది అంతుచిక్కని ప్రశ్న. వందలో పాతిక మంది ప్రయోజనం పొందితే! ముప్పాతిక మంది ఒత్తిడికి గురవుతున్నారని అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
మల్టీటాస్కింగ్ ఈ జనరేషన్ విజయ సూత్రంగా చెబుతున్నది. అరుదైన ఈ కళను వాళ్ల ప్రయోజనానికి ఉపయోగించుకుంటున్నారు అంటే మనం పప్పులో కాలేసినట్టే! ఈతరం ఎంత తెలివి మీరిందంటే.. వారి తెలివితేటలను వీలైనంత ప్రతికూలంగా ఉపయోగిస్తుండటమే బాధాకరం. ఒకే బ్రౌజింగ్‌లో ఐదేసి ట్యాబ్‌లు ఓపెన్ చేసి.. తీరికలేకుండా వాటితో కాలక్షేపం చేస్తున్నారంటే.. వీళ్ల మల్టీటాస్కింగ్ ఎటు దారితీసేదో అర్థం చేసుకోవచ్చు.
చదువుల్లో నేటి పిల్లలు వాళ్ల పెద్దల కన్నా ముందుంటున్నారు. ఆలోచనలను పక్కదారి పట్టించే అంశాలు చుట్టూ ఎన్ని ఉన్నా.. చదువుల్లో మాత్రం కాస్త పద్ధతిగానే ఉంటున్నారని సర్వే సారాంశం. అయితే, చదివేస్తే ఉన్నమతి పోయిందన్న నానుడి వీళ్లకు బాగా నప్పుతుందని కూడా సర్వేకారులు అభిప్రాయపడుతున్నారు. మార్కులు కొల్లగొట్టడంలో, ర్యాంకులు సాధించడంలో ముందుంటున్న జెన్ జీ.. తాము చదివిన అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండటం లేదట.
క్యాంపస్ దాటొచ్చాక పట్టాలు చేతపట్టి ఉద్యోగాన్వేషణ చేయడం ఈతరానికి అస్సలు నచ్చని అంశాల్లో ఒకటి. కాలేజీ రోజుల నుంచే వాళ్లు స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు రకరకాల స్టార్టప్ ఐడియాలు తమ అమ్ములపొదిలో భద్రపరుచుకుంటున్నారు. ఇలా ఆలోచించేవాళ్లు దాదాపు 72శాతం వరకూ ఉంటున్నారట. తమ స్టార్టప్‌ను స్టార్ట్ చేయడానికి అవసరమైన మూలధనం సమకూర్చుకోవడానికి కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల ఐడియాను అమలు చేయడానికి సరైన ఇన్వెస్టర్ దొరికే వరకే కొలువులో కుదురుగా ఉంటున్నవారు మరికొందరు. మొత్తంగా ఉద్యోగం జీవిత లక్ష్యం కాదన్న భావనలోనే చాలామంది ఉంటున్నారు.
నేటి యంగ్ తరంగ్‌లు సోషల్ మీడియాపై చూపిస్తున్న ఆసక్తి ఇతర అంశాల్లో కనబర్చడం లేదని సర్వేకారులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాలు మినహా మరే ఇతర విషయంపైనా గరిష్ఠంగా ఎనిమిది సెకండ్ల కన్నా ఎక్కువ సేపు దృష్టి నిలపడం లేదట.
ఆర్థిక విషయాల్లోనూ నేటి తరం కాస్త ఏమరుపాటుగా వ్యవహరిస్తున్నది. సంపాదన మార్గాలను అన్వేషించకముందే.. ఖర్చు చేసే దారులు కనిపెడుతున్నారట. అయితే, సంపాదనలో ఉన్నవాళ్లు మాత్రం దానిని జాగ్రత్త చేయడంలో బుద్ధిగా వ్యవహరిస్తున్నారట.
ఈతరం మొహమాటాలకు తావు ఇవ్వడం లేదు. పదిమందితో కలవడం మంచిదనే భావన చాలామందిలో ఉంది. అయితే, చాలా పరిచయాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వేదికగానే పురుడుపోసుకున్నవే కావడం విశేషం. ఎదుటివారిని బుట్టలో వేసుకునేందుకు తమకు లేని తెలివితేటలను ప్రదర్శించడానికి కూడా వీళ్లు వెనుకాడటం లేదట.