– జెన్
పబ్లిక్
నడివీధిలో ఓ భర్త తన భార్యను గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. ‘పర్సనల్ ప్రాబ్లమ్. మనకెందుకు?’ ..అంటూ ఎవరూ పట్టించుకోలేదు. నడివీధిలో ఓ భర్త తన భార్యను ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ‘ఇంత బరితెగింపా?’ ..అంటూ అందరూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకున్నారు.
అంతేగా..
ఈ కాలంలో కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే గొప్పే?- వధూవరుల తల్లిదండ్రులను మెచ్చుకున్నారు బంధువులు. ‘కంగ్రాట్స్! మీ ప్రేమను సక్సెస్ చేసుకున్నారు’ – వధూవరులను అభినందించారు స్నేహితులు. ఇరుపక్షాల పెద్దల ఫేస్బుక్ పేజీల్లో తమ వివరాలతో ‘వధువు-వరుడు కావలెను’ ప్రకటన ప్రత్యక్షం చేయడం ఆ ఐటీ ప్రేమికులకు తెలియని విద్యా!
బర్త్ డే..
అతనికి పుట్టినరోజు అంటే భయం?తనకంటే ముందు.. పుట్టకుండానే హత్యకు గురైన ముగ్గురు అక్కలు గుర్తుకొస్తారు.
న..డ..క
‘డ్యూక్ మీద వెళ్దామా? బీఎండబ్ల్యూలో వెళ్దామా?’అడిగాడు అబ్బాయి.‘నడుస్తూ మాట్లాడుకుందాం’ చెప్పిందా అమ్మాయి.
సెలవు
నాలుగు రోజులు సెలవు ఇవ్వనందుకు బాస్‌ను తిట్టుకుంటూ ఇంటికొచ్చింది. ఒకపూట సెలవు అడిగినందుకు పనిమనిషిని.. శాశ్వతంగా ఇంటికి పంపింది!