ఎన్నికల్లో గెలిచినోళ్లకు పార్టీలు మారుడు, గోడలు దూకుడు సమయంలో ఎన్నికల ఫలితాల రోజు కంటే ఎక్కువ సంబురం అనిపిస్తది. కానీ, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ యవ్వారం, స్పీకర్ తీర్పు, కోర్టుల తీర్పులు చూసినంక ఆ సంబురం అన్ని సందర్భాల్లో శాశ్వతం కాదని తేలిపోయింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ గూటికి జంప్ అయిన దానంకు హైకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది. ఖైరతాబాద్ స్థానం ఎప్పుడో ఖాళీ అయినట్టు లెక్క అని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పు రాగానే సుప్రీంకోర్టుకు పోనని పెద్ద డైలాగులు కొట్టి, తర్వాత ఉరుక్కుంటూ పోయి అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కిండు. కానీ తీరా అక్కడికి పోయాక సుప్రీంకోర్టు జడ్జీలు సార్ అప్పీల్‌ను తిప్పికొట్టిర్రు. హైకోర్టు తీర్పులో మేం జోక్యం చేసుకోం.. అని మొఖం మీదే తేల్చి చెప్పేసిండ్రు. పార్టీ మారినప్పుడు దానంలో కలిగిన ఆనందం, ఆవేశం ఇప్పుడు కోర్టుల మొట్టికాయలతో మాయమైంది. రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా గోడలు దూకితే ఎలాంటి తిప్పలు ఉంటాయో రుజువైంది. మొత్తానికి, ఇప్పుడు బంతి ఖైరతాబాద్ గల్లీల పడ్డది. తమ తీర్పును తేలిగ్గా తీసుకున్న వారికి ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్తారో.

వినాయక నిమజ్జనం అంటేనే డప్పుల మోతలు, కోలాటాలు. గణపయ్యకు జై కొడుతూ సాగనంపే సంబురం. ఎవరికి నచ్చిన పాట వాళ్లు ఆనందంతో పాడుకుంటరు. ఇతరులను నొప్పించకపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా! కానీ, ఇప్పుడు ఈ పాటలకూ రాజకీయ రంగు పులుమాలె అని కొందరు భావిస్తున్నట్టున్నది! తాజాగా నిమజ్జన ఊరేగింపుల్లో రాజకీయ పార్టీల పాటలు పెడితే చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియా హ్యాండిల్స్ గుర్తిస్తామని పోలీసు పెద్దలు హెచ్చరించిండ్రు. అయ్యా సారూ.. అవి భక్తులు ఎంతో ఇష్టంతో వింటున్న పాటలు. లీడర్లు మైకులు పట్టుకుని బజారున పడి మాట్లాడే బూతు మాటలు కావు కదా! భక్తులకు నచ్చిన పాట పెట్టుకుంటే శాంతిభద్రతల సమస్య ఎట్లయితది? పరిస్థితి ఇలాగే ఉంటే.. నిమజ్జనానికి ముందే పాటల లిస్ట్ చూపించాలని నిర్వాహకులను అడుగుతరేమో! పోలీసుల డ్యూటీ పాటల్లో పార్టీలను వెతకడం కాదు, ప్రజల మధ్య శాంతిని కాపాడడం కదా!

ఇదిగో డీఏ… అదిగో పీఆర్సీ అంటూ సర్కారోళ్లు ఉద్యోగులను ఊరిస్తుండ్రు. పెండింగ్ డీఏలు బ్యాంక్ ఖాతాలో పడ్తయట అంటే సంబురపడుతున్నరు. కానీ డీఏలు మాత్రం ఆరుకు పెరిగినయి. వీటికి లెక్కలు కట్టేసరికి ఉద్యోగులకు చుక్కలు కనపడుతున్నయి. ఈ ‘ఊరింపుల’ డీఏల కోసం ఎదురు చూసి చూసి నిట్టూరుస్తున్నరు. నాయకుల గురించేం చెప్పాలి? వాళ్ల ఎస్టిమేషన్ల లీలలు చూస్తే ఉద్యోగులకు తలకాయ తిరుగుతాంది. పొద్దున లేస్తే పీఆర్సీ చర్చలంటూ కమిటీలు, కమిషన్లని అధికారులు ఇరగదీస్తున్నారు. ఆ ఊహాజనిత లెక్కల మాయలోపడి వాళ్లు ఏనాడు సంతోషంగా ఉన్నారో మర్చిపోయిండ్రు. కూలి పనిచేసేటోళ్లకు సాయంత్రానికి పైసలు వస్తున్నయి. ఏ కూలీని చూసినా ఉన్నంతలో హాయిగా బతుకుతున్నరు. కంటినిండా నిద్ర పోతున్నరు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పేరుకు గొప్పగా ఉన్నా నెల తిరిగేసరికి కిరాణా దుకాణం బాకీలు, ఈఎంఐల గోసతో బతుకు బస్టాండే అయితాంది. ఉద్యోగ సంఘాల నాయకుల కథ వేరే ఉన్నది. ఆరని ఆశలు, ఆకాశాన్నంటే అంచనాల ప్రకటనలు ఇకనైనా బంద్ చేయాలని ఉద్యోగులే కోరుతుండ్రు. ఈ ఆవేదన ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతదో!

సీఎం రేవంత్‌రెడ్డికి కేరళంలోని ‘ఆర్యధాన్ ముహమ్మద్ ఫౌండేషన్’ ఉత్తమ ప్రజా సేవకుడు అని ఓ పురస్కారం ఇచ్చింది. 2022లో పెట్టిన ఈ ఫౌండేషన్ ఇప్పటికి ఇచ్చింది రెండే రెండు అవార్డులు. విశేషం ఏందంటే.. మొట్టమొదటి అవార్డు 2023లో అప్పటి కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ వీడీ సతీషన్‌కు ఇచ్చిండ్రు. ఇగ రెండో అవార్డు రేవంత్‌రెడ్డి గారికి దక్కింది. కాంగ్రెస్ నేత పేరుతో పెట్టిన ఫౌండేషన్, కేవలం కాంగ్రెస్ నాయకులకే అవార్డులు ఇచ్చుకుంటూ పోతుంటే.. భజన మీడియా మాత్రం దాన్ని గొప్ప అవార్డు అంటూ మోత మోగిస్తున్నది. ఇంకా అసలు హైలైట్ ఏందంటే.. ఈ అవార్డు తీసుకోవడానికి సీఎం ప్రత్యేక విమానంలో కేరళకు పోయివచ్చిండ్రు. అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తొలి అవార్డు గ్రహీత వీడీ సతీశన్ ఆ సభకు హాజరుకాలేదు. ఈ అవార్డు అందుకున్న మొదటి కేరళేతర వ్యక్తి తానేనంటూ రేవంత్‌రెడ్డి మురిసిపోతుంటే.. ఎవరి సంఘం వాళ్లకు అవార్డు ఇచ్చుకుంటే కూడా ఇచ్ఛంత్రమేనా అని విమర్శలు వినిపిస్తున్నయి. అయితే, ఈ సభలో రేవంత్ ఇంగ్లిష్ స్పీచ్‌ను మళయాళంలోకి అనువదించేందుకు అనువాదకుడు పడ్డ అవస్థ, ఆయన ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే దృశ్యం కనబడుతున్నది. ఏ విషయంలోనైనా బీఆర్ఎస్ గట్టిగా కొట్లాడితేనే తప్ప, సర్కార్‌లో చలనం వస్తలేదు. ప్రభుత్వం చేసే పనుల తీరు చూస్తుంటే, ప్రతిపక్షం ముల్లుకట్టె పెట్టి పొడిస్తే గానీ ఈ బండి ముందుకు సాగడంలేదని స్పష్టంగా అర్థమవుతున్నది. ఉదాహరణకు.. జూరాల నుంచి నీటి విడుదల కోసం గులాబీ నేతలు రోడ్డెక్కి కొట్లాడిండ్రు. తాగునీరే దిక్కులేదు, సాగునీరు ఎట్లా? అని అప్పటివరకు దబాయించిన మంత్రులే ఆఘమేఘాల మీద నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక విద్యుత్ ప్లాంట్లు బంద్ అయితన్నయ్, మేము స్వయంగా పరిశీలనకు వస్తామని బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించగానే.. సీఎం కదిలిండు. విద్యుత్ అధికారులతో సమీక్ష జరిపి, ప్లాంట్లు ఫుల్లుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేసిన్రు. 22-ఏ బాధితులతో దండెత్తుతామని బీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వగానే సర్కార్ దిగివచ్చింది. అనుమతులు ఉన్నవాటికి రిజిస్ట్రేషన్లు ఆపబోమని చెప్పకతప్పలేదు. ఇదంతా చూస్తుంటే.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తనంతట తానుగా స్పందించి ఇస్తున్న భరోసా కంటే, ప్రతిపక్షం నిలదీస్తేనే పనులు జరుగుతున్నాయని తేటతెల్లమవుతున్నది.
– దాము నర్మాల