రేపు చేయాల్సిన పనిని రాసుకోవడం, ఈ రోజు జరిగిన పనిలో పొరపాట్లు గుర్తించడం మర్చిపోతున్నాం. కాలంతోపాటు వేగంగా పరిగెత్తడంలో తనను తానే మర్చిపోతున్నాడు బిజీ మనిషి. ఇంకొందరు ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాకు అంకితం చేస్తున్నారు. అక్కడ తన గురించి తానే రాసుకుంటున్నాడు. ఈ యువకుడు మాత్రం తన గురించి కాకుండా.. పుట్టిన నేల చరిత్రని, పెరిగిన సమాజం గొప్పతనాన్ని రాసుకుంటూ పోతున్నాడు. తెలంగాణ ఉద్యమంతో మొదలుపెట్టి తొలి దశాబ్ది అభివృద్ధి అంతా వికీపీడియాలో వ్యాసాలుగా రాశాడు ప్రణయ్ రాజ్ వంగరి. పదేండ్లుగా నిత్యం ఏదో ఒక వ్యాసం రాస్తూ రికార్డు సృష్టించిన ప్రణయ్ వికీయానం ఇది.
చిన్నప్పటి నుంచి కళల్ని ఇష్టపడేవాడిని. సినిమా అంటే మరీనూ. సినీరంగంలో ప్రవేశించాలని మాస్టర్ ఆఫ్ థియేటర్స్ (ఎంఎఫ్ఏ)లో చేరాను. కానీ, ఈ రెండేండ్లలో సినిమా కంటే నాటకమే ఎక్కువ ఇష్టమైపోయింది. హెచ్‌సీయూ రంగస్థల శాఖ ఆధ్వర్యంలో గోల్డెన్ థ్రెషోల్డ్ (అబిడ్స్)లో థియేటర్ ఔట్రీచ్ ఉంది. అందులో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా చేరాను. మిస్ మీనా నాటక బృందాన్ని కో ఆర్డినేట్ చేశాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వందకుపైగా ప్రదర్శనలు ఇచ్చాం. ఓ అయిదేండ్లపాటు అందులో పనిచేస్తూ బయట నాటకాలు వేస్తూ ఉండేవాడిని. రచ్చబండ, యజ్ఞం, అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటకాల్లో ఎక్కువగా నటించాను.
గోల్డెన్ చాన్స్
భారతీయ భాషల్లో వికీపీడియా వ్యాసాల కోసం గోల్డెన్ థ్రెషోల్డ్‌లో సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సీఐఎస్) ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఆ వర్క్‌షాప్ నిర్వాహకుడు విష్ణువర్ధన్ నాకు ముందే తెలుసు. తనే వికీని పరిచయం చేశాడు. అప్పటికి తెలుగులో సమాచారం తక్కువగా ఉంది. వికీలో తెలుగు పేజీలు పెంచాలనే వాళ్ల ఆలోచన నచ్చింది. అయితే, రాయడంలో నాకు అనుభవం తక్కువ. నాది రంగస్థలం కాబట్టి. ఆ రంగాన్నే ఎంచుకుని నాటక రంగ పుస్తకాలు సేకరించాను. వాటిని చదివి ఆర్టికల్స్ రాసేవాడిని. 2013 మార్చి 8న వికీపీడియాలో మొదటి ఆర్టికల్ రాశాను. తర్వాత రోజుల్లో వికీపీడియా శిక్షణా శిబిరాలు నిర్వహించాను. కొత్తవాళ్లను ప్రోత్సహించాను. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో వికీపీడియా స్టాల్ నిర్వహించాను. నాటకాలు వేస్తూనే వికీలో మూడేండ్లలో ఓ మూడు వందల దాకా వ్యాసాలు రాశాను. వాటిలో నాటక రంగం, గ్రామాల సమాచారమే ఎక్కువ.
వంద రోజుల సవాల్
ఇటలీలో జరిగిన వికీమేనియా-2016 వేడుకలో తెలుగు ప్రతినిధిగా హాజరయ్యాను. అక్కడ ‘హండ్రెడ్ వికీడేస్ చాలెంజ్’ గురించి తెలిసింది. పవన్ సంతోష్ అనే వ్యక్తి తెలుగులో ఆ చాలెంజ్ పూర్తి చేశాడు. తిరుమలలో ఇంటర్నెట్ లేకపోతే కొండ దిగి, ఇంటర్నెట్కేఫ్లో ఆర్టికల్ రాసిన తర్వాత కొండపైకి వెళ్లానని ఆయన చెప్పాడు. ఆ మాట నాకు స్ఫూర్తినిచ్చింది. అప్పుడే హండ్రెడ్ డేస్ చాలెంజ్ స్వీకరించాను. ఈ చాలెంజ్‌ను ‘ప్రేమతో రా’ సినిమాతో మొదలుపెట్టాను.
ఆ రోజుల్లో అవంతిక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. షూటింగ్‌కి ఉదయం ఆరు గంటలకు పోతే రాత్రి తొమ్మిది గంటలకు అయిపోయేది. అప్పట్లో మొబైల్ డాటా ఇప్పుడున్నంత చవకగా లేదు. ఇంట్లోనే చేయాల్సి వచ్చేది. షూటింగ్‌కి ఓ గంట ముందే లేచి ఆర్టికల్ రాసేవాడిని. నాటకాలు వేసేందుకు ప్రయాణాల్లో ల్యాప్ టాప్ తీసుకుపోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ సందర్భంలో కష్టమైనా మొబైల్లోనే రాసేవాడిని. అలా వంద రోజుల్లో వంద ఆర్టికల్స్ రాశాను.

It Award From Ktr
వికీవత్సరం
మా ఊరు (భువనగిరి దగ్గర మోత్కూరు)లో ఓ మిత్రుడు కలిస్తే నా సంతోషం చెప్పాను. వంద రోజులు కాదు ఇంకో సున్నా కలిపి వెయ్యి రోజులు రాయమన్నాడు. అతని మాటని గౌరవించి ఏడాదిలో 365 రోజులు వ్యాసాలు రాశాను. ఆ తర్వాత వెయ్యి రోజులు కంటిన్యూ చేశాను. ఈ మూడు టార్గెట్లు పూర్తయ్యే నాటికే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాక ముందు తెలంగాణ సంస్కృతి, గ్రామాలు, చరిత్ర గురించి ఎక్కువగా రాశాను. మన అస్తిత్వాన్ని చాటే ప్రయత్నం చేశాను.
ఆ తర్వాత మన అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాను. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పథకం గురించి వికీలో సమగ్రమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాను. పథకాలే కాదు టీహబ్, షీటీమ్స్ వంటి అనేక కొత్త ప్రయోగాలు, ప్రోత్సాహాలెన్నో ఉండేవి. అవన్నీ అందరికీ అర్థమయ్యేలా వికీలో రాస్తూ పోయాను. తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ 2018లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో నాకు లోకలైజేషన్ అవార్డు ఇచ్చింది. మొన్న సెప్టెంబరు 7వ తేదీ నాటికి వికీలో పదేండ్లపాటు ప్రతి రోజూ ఆర్టికల్ రాసిన ఘనత సాధించాను. ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను.
పెండ్లి నాటి ప్రమాణం!
ప్రపంచం గురించి చెప్పడం కన్నా.. తెలుగు వాళ్ల గురించి తెలుగు వాళ్లకు పరిచయం చేయాలనుకున్నాను. తెలంగాణలో ఉన్న కోటలు, పర్యాటక స్థలాలు, గ్రామాలు, బరాజ్‌లు, ప్రాజెక్టులు, తెలంగాణ ఉద్యమ ఘట్టాలు సమగ్రంగా అర్థమయ్యేలా రాశాను. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరోజూ విశ్రమించలేదు. చివరికి నా పెండ్లి జరిగిన రోజు కూడా ‘తెలంగాణ యువ నాటకోత్సవం’ గురించి ఒక ఆర్టికల్ రాశాను.
– ప్రణయ్ రాజ్ వంగరి
– నాగవర్ధన్ రాయల