మనం క్లాసులో పాసైనా ఫెయిలైనా, కెరీర్లో సక్సెస్ అయినా కాకపోయినా, ప్రేమలో ముందుకెళ్లినా బోర్లాపడ్డా.. చివరికి సమాజం మొత్తం వెలివేసినా సరే, మన భుజం మీద పడే చేయి ఒకటి ఉంటుంది. మనతో కలిసి వన్‌బైటూ చాయ్ పంచుకునే హృదయం ఒకటి ఉంటుంది. తీసుకున్న దేన్నయినా తిరిగి ఇవ్వకపోయినా లావైపోయే ప్రమాదం లేని బంధం ఒకటి ఉంటుంది. దాని రూపే.. నేస్తం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు అలాంటి అపూర్వమైన మిత్రులకు ఇచ్చే చిరుకానుకలు కాస్త విభిన్నంగా ఉంటే ఆ బంధానికి ఓ కొత్తదనం.
నువ్వంటే ఎంతిష్టమో..
మనకు స్నేహితులంటే బోలెడు ఇష్టం ఉంటుంది. ఆనందాన్ని పంచుకున్నప్పుడూ, కష్టాల్లో తోడు నిలిచినప్పుడు వాళ్లంటే మరింత ప్రేమ కలుగుతుంది. ఆ ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అందుకే నేస్తమంటే మనకెంత ఇష్టమో తెలిపేలా ‘హ్యాపీ జార్’, ‘ఫ్రెండ్షిప్ కోట్స్ జార్’ లాంటివాటిని బహుమతులుగా ఇవ్వొచ్చు. వీటిలో వంద రంగుల కాగితాలు మడిచి ఉంటాయి. ఒక్కో కాగితంలో మనకు వాళ్లెంత ఇష్టమో తెలిపే సందేశం ఉంటుంది.
మనం.. తలో భాగం!
పార్టీ చిన్నదైనా పెద్దదైనా గ్యాంగ్‌లో అందరూ ఉండాల్సిందే. ఒక్కరు మిస్సయినా వెలితే. ఆ భావనకు రూపమే ‘ఫ్రెండ్షిప్ లాకెట్లు’. ఇద్దరు మొదలు ఐదుగురు ఆరుగురిదాకా ఇందులో భాగస్వాములు అయ్యేలా లాకెట్లు రూపొందుతున్నాయి. అంటే ఈ సెట్లో రెండు నుంచి ఆరు గొలుసుల దాకా ఉంటాయి. అన్ని గొలుసుల లాకెట్లూ కలిపితే ఒక ఆకృతి అవుతుంది.
నేస్తం పేరు చుక్కకు…
పక్కన ఓ మిత్రుడు ఉండాలి కానీ, చిరుచీకట్లో తళుక్కున మెరిసే నక్షత్రాల్ని లెక్కబెట్టడమూ సరదాగానే ఉంటుంది. అదే నేస్తానికి ఆకాశంలోని ఓ నక్షత్రాన్ని కానుకగా ఇస్తే! ‘నేమ్ ఎ స్టార్’, ‘ఫ్రేమ్ ఎ స్టార్’లాంటి సంస్థలు మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. విశ్వంలోని అనేక నక్ష త్రాల డేటాబేస్ వీళ్ల దగ్గర ఉంటుంది. మనం ఎవరి పేరు నక్షత్రానికి పెట్టాలని అనుకుంటున్నామో వాళ్ల రాశి చెబితే… ఒక నక్షత్రాన్ని ఎంచి దానికి మనం సూచించిన పేరు పెడతారు. పాలపుంతలో అది ఎక్కడుందో తెలిపేలా ఫ్రేమ్ కట్టి మరీ ఇస్తారు.
చెడ్డీ దోస్తుల కోసం…
పసితనంలో చిగురించిన స్నేహం పుట్టతేనెలా కలకాలం నిలిచి ఉంటుంది. ఆ స్నేహానికి గుర్తుగా చెడ్డీ బొమ్మలతో ఇలా సరదాగా ఉండే బహుమతిని ఎంచుకోవచ్చు. కేక్గిఫ్ట్.ఇన్‌లాంటి వెబ్సైట్లలో స్పెషల్ ఫ్రెండ్షిప్ డే బహుమతులు అమ్ముతున్నారు. చిన్ననాటి స్నేహానికి చిరునామాలా కనిపించే ఇలాంటివి ఇచ్చి పుచ్చుకోవడం సరదానే మరి!
తియ్యటి కానుక ఫొటోతో…
డైరీ మిల్క్ సిల్క్ ప్రేమికులకు పేటెంట్గా మారింది కానీ, దాన్నిప్పుడు స్నేహితులకూ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఎవరికి ఇస్తున్నామో, సందర్భం ఏమిటో తెలుపుతూ… వాళ్ల ఫొటో కూడా ఆ చాక్లెట్ మీద అచ్చేసి ఇచ్చేలా పర్సనలైజ్డ్ చాక్లెట్ బార్లు రూపొందుతున్నాయి. ఫ్రెండ్షిప్ డేని తియ్యగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది మంచి ఐడియా. అయినా స్నేహితులేం ప్రేమికుల కంటే తక్కువా చెప్పండి!