మూర్ఖుడు ఇల్లు కట్టుకుంటాడు, తెలివైనవాడు ఆ ఇంట్లో కిరాయికి దిగుతాడు.. అనేది నిన్నటి మాట. తెలివైన వాళ్లంతా వీలైనంత త్వరగా ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు ఓ స్థిరాస్తి. మనం ఉంటాం. వారసత్వంగా పిల్లలకు ఇస్తాం. డబ్బు అవసరమైతే బ్యాంకులో కుదువ పెట్టుకుంటాం.
సొంతింటితో తక్షణ లాభం.. అద్దె బాధ ఉండదు. ఏడాది తిరిగిపోగానే అద్దె పెంచేస్తారన్న భయమూ ఉండదు. ఆ మేరకు ఏటా మనం ఎంతోకొంత లాభం పొందుతున్నట్టే. ఏటికేడాది మార్కెట్ విలువ పెరిగిపోతూ ఉంటుంది. అంటే, మన ఆస్తి విలువా వృద్ధి చెందుతున్నట్టే.
ఇల్లు కొనడం అనేది ఓ దీర్ఘకాలిక ప్రణాళిక. ఆలోచన రాగానే కొనేయలేం. బ్యాంకు రుణం ఎలానూ తీసుకుంటాం. కాకపోతే, మన వంతుగా కనీసం పదిహేను శాతం చెల్లించాల్సి ఉంటుంది. నెలనెలా సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో అందుకు అవసరమైన నిధిని సమకూర్చుకోండి.
మన ఇల్లు.. అనే భావనే గొప్పగా ఉంటుంది. ఎక్కడా లేని భద్రతను ఇస్తుంది. లాకర్ నిండా బంగారం, ఊళ్లో పొలం, స్టాక్ మార్కెట్లో సొమ్ము.. ఇవేవీ ఇవ్వలేని ధైర్యాన్ని ఇల్లు ఇస్తుంది. అన్ని వైపుల నుంచీ నిధుల ప్రవాహం ఆగిపోయిన సమయంలోనూ.. రివర్స్ మార్ట్గేజ్ రూపంలో నెలనెలా కొంత సొమ్ము మన ఖాతాలో పడేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల స్నేహాలు పెరుగుతాయి. బంధాలు బలపడతాయి. సాయానికి ఓ నలుగురు సిద్ధంగా ఉంటారు. అదే అద్దె ఇంటి కాపురమైతే.. యజమానికి కోపం వచ్చిన ప్రతిసారీ మూటాముల్లె సర్దుకోవాల్సిందే. ఇంకో ఇల్లు వెతుక్కోవాల్సిందే. ఆధార్ నుంచి ఓటరు కార్డు వరకూ.. అన్నిటిలోనూ చిరునామా మార్చుకోవాల్సిందే.
ఘనంగా గృహప్రవేశం, అత్యద్భుతంగా ఇంటీరియర్స్, కొత్తిల్లు కాబట్టి కొత్త కారూ.. ఇలాంటి ‘అదనపు’ ఆర్భాటాల విషయంలో ఆచితూచి అడుగేయండి. మోయలేని భారాన్ని భుజానికి ఎత్తుకోవద్దు. అన్న కొన్నాడనో, తమ్ముడు కొంటున్నాడనో.. సొంతింటి వైపు అడుగులు వేయకండి. ఎప్పుడు కొనాలి, ఏ ధరలో కొనాలి? అనే విషయంలో అంతిమ నిర్ణయం మీదే. జీవిత భాగస్వామి సలహా తప్పక తీసుకోండి.
బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కొనడం అన్నది సురక్షితమైన మార్గం. మీ సంపాదనను బట్టి, ఆ ఆస్తి మార్కెట్ విలువను బట్టి బ్యాంకులు ఎనభై అయిదు శాతం వరకూ అప్పు ఇస్తాయి. కానీ, ఈఎమ్ఐల భారాన్ని మోయగలరో లేదో ఆలోచించుకోండి. మీ నెలవారీ సంపాదనలో రుణ వాయిదాలు యాభై శాతానికి మించడానికి వీల్లేదు. ఉద్యోగంలో ఒడుదొడుకులు వస్తే ఏం చేయాలన్నదీ ఆలోచించండి. అప్పు విషయంలో బ్యాంకులు కచ్చితంగా వ్యవహరిస్తాయి. అవసరమైతే ఆస్తి వేలం వరకూ వెళ్తాయి.