మహిళలు ఎప్పుడూ ఏదో ఒక ఇన్ఫెక్షన్ బారినపడుతుంటారు. అందులోనూ టాయిలెట్ ఇన్ఫెక్షన్లు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకుని వికాస్ బగారియా సృష్టించిన బ్రాండ్.. ‘పీ సేఫ్’. టాయిలెట్ సీట్ శానిటైజర్‌తో మొదలుపెట్టి మహిళలకు ఉపయోగపడే ఎన్నో వస్తువులను అందుబాటులోకి తెచ్చారు. కరోనా కాలంలో వికాస్‌కు కాసుల పంటే!
పీ సేఫ్.. అంటే, సురక్షితంగా టాయిలెట్ పనులు ముగించుకోండి అని అర్థం! ఓసారి, వికాస్ బయట టాయిలెట్‌కు వెళ్లినప్పుడు.. ఆ అపరిశుభ్రతను చూసి కడుపులో దేవినట్టు అయ్యింది. ఆ ఇరుకిరుకు గది రోగాల పుట్టలా కనిపించింది. ఇంకేముంది, ఓ బిజినెస్ ఐడియా ప్రాణంపోసుకుంది. వికాస్ స్వస్థలం గుర్గావ్. ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో పక్కా వ్యాపారవేత్తల రాష్ట్రం గుజరాత్‌కు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు భార్య శ్రీజన కూడా బయల్దేరింది. జర్నీలో టాయిలెట్ కష్టాలు అనుభవించారు. ఫలితంగా, ఆమెకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ చేదు అనుభవంలో నుంచి ‘పీ సేఫ్’ ప్రాణంపోసుకుంది. మొదటగా విడుదలైన ప్రొడక్ట్ ‘టాయిలెట్ సీట్ శానిటైజర్’. “యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటివి మహిళలను ఎంతలా ఇబ్బంది పెడతాయో నా భార్య బాధను చూశాకే అర్థమైంది. అప్పుడే మా టాయిలెట్ సీట్ శానిటైజర్‌ను తయారు చేశాం. మా సొంత వెబ్సైట్ ద్వారానే దేశవ్యాప్తంగా సేల్స్ జరుపుతున్నాం” అని చెప్పాడు వికాస్.
పరిశుభ్రతే యూఎస్పీ ప్రతి ఉత్పత్తికి ఓ యూ ఎప్పీ అంటూ ఉంటుంది. ‘పీ సేఫ్’ నినాదం కూడా టాయిలెట్, పరిశుభ్రత చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు నెలసరి, ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ తర్వాత.. పరిశుభ్రత ఎంతో అవసరం. ఈ పాయింట్ మీదే ‘పీ సేఫ్’ జనంలోకి చొచ్చుకొని వెళ్తున్నది. పదిహేను దేశాలకు విస్తరించింది కూడా. ప్రస్తుతం ఈ సంస్థలో 150 మంది ఉద్యోగులు ఉన్నారు.