కేశాల క్లేశాలు తొలగించే కుంకుడు చిరునామా చిట్టడవే! వనంలో విరగ్గాసే కుంకుడుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆ రైతు గుర్తించారు. అడవి మొక్కను తోటపంటగా ఎంచుకున్నారు. సృజనాత్మక పద్ధతులు పాటించి.. కొమ్మకొమ్మకూ పుట్టెడు కుంకుడుకాయలు పుట్టించి.. శభాష్ అనిపించుకున్నారు. అదే జోరులో నూతన వంగడాన్ని సృష్టించి పేటెంట్ వేటలో ఉన్నారు నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు లోకసాని పద్మారెడ్డి. కుంకుడు సాగులో, ఉత్పత్తులతో ఆయన చేస్తున్న అద్భుతాలు ఎన్నో..
ఉద్యాన పంటల సాగులో నూతన ఆవిషరణలతో నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ అభ్యుదయ రైతు లోకసాని పద్మారెడ్డి రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శాస్త్రవేత్త కాకపోయినా నూతన వంగడాన్ని సృష్టించి రైతే రాజు అనిపించారు. ఆయన 1991లో 10 ఎకరాల్లో కుంకుడుసాగును ప్రారంభించారు. ఎకరానికి 100 మొక్కలు నాటగా… ఒక్కో మొక్క ద్వారా 250 నుంచి 300 కిలోల కుంకుడు కాయల దిగుబడి వస్తున్నది. అలా ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఆయన సాగుబడి అంతా సేంద్రియ విధానంలోనే సాగడం విశేషం. కుంకుడు కాయల గుజ్జు, గింజల పొడితో సౌందర్య ఉత్పత్తులు, ఔషధాలు కూడా చేయవచ్చని పద్మారెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన నర్సరీలో పెంచిన కుంకుడు మొక్కలను ఛత్తీస్‌గఢ్ అటవీశాఖ అధికారులు దిగుబడి చేసుకుంటున్నారు. పేస్ట్, సబ్బులను తయారు చేసి నాబార్డ్ ద్వారా విక్రయిస్తున్నారు.
పేటెంట్ కోసం..
పద్మారెడ్డి సొంతంగా అభివృద్ధి చేసిన నూతన కుంకుడు వంగడాన్ని న్యూఢిల్లీలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్‌లో రైతు వంగడంగా గుర్తించే దశలో ఉంది. పేటెంట్ వస్తే.. ఒక రైతు సొంతంగా అభివృద్ధి చేసిన వంగడంగా గుర్తింపు దక్కనుంది. కుంకుడు ఉత్పత్తులను షాంపూగా వాడటం మనకు తెలిసిందే! అయితే, కుంకుడు నూనె ఉత్పత్తులు మధుమేహ రోగులకు మేలు చేస్తాయని చెబుతున్నారు పద్మారెడ్డి. అంతేకాదు కుంకుడురసం సేంద్రియ క్రిమి సంహారిణిగా పనిచేస్తుందని ఆయన పేర్కొంటున్నారు.
పౌడర్ పోషకాల గని పద్మారెడ్డి పండిస్తున్న కుంకుడు కాయలను సేకరించి హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో అనాలసిస్‌కు ఇచ్చారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, కుంకుడు పొట్టు విత్తనంతోసహా పొడిగా చేసి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో విశ్లేషించగా అందులో 28 రకాల ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం వాడుతున్న నూనెలతో పోలిస్తే కుంకుడు పౌడర్ నుంచి తీసిన నూనె అత్యంత శ్రేష్ఠమని ఈ పరిశోధన తెలిపింది. గుండె ఆరోగ్యానికి అత్యంత మేలుచేసే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇతర నూనెలను మించి ఈ కుంకుడు నూనెలో ఉన్నట్టు గుర్తించడం విశేషం. ముందుముందు వీటినుంచి పెద్దమొత్తంలో నూనె తీసి, వినియోగంలోకి తేవచ్చని నిపుణులు అంటున్నారు.
పంటల్లో క్రిమి సంహారిణిగా కుంకుడు ఉత్పత్తులను పంటల్లో క్రిమి సంహారిణిగానూ ఉపయోగించుకోవచ్చు. బత్తాయి, నిమ్మలో వచ్చే పొలుసు పురుగుల నివారణకు కాండంపైన ఈ కుంకుడు గింజల పొడిని పూయడం ద్వారా చెట్టును కాపాడుకోవచ్చు. వరిలో కాండం తొలిచే పురుగు నివారణకు ఇది గొప్పగా పనిచేస్తుంది. వరి నాటిన 15 రోజులు, తర్వాత 45 రోజులప్పుడు కుంకుడు రసం పిచికారీ చేస్తే పంటకు మేలుచేసే పురుగులకు హాని కలిగించకుండానే తెగుళ్లను నివారిస్తుంది. అలా వరి ఎదుగుదలకు దోహదం చేస్తుంది. వరి దిగుబడి ఎకరాకు 4- 5 బస్తాల వరకు పెరుగుతుంది. 100 లీటర్ల నీటిలో 1 కేజీ కుంకుడు పొడి కలిపి పిచికారీ చేయాలి. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల మట్టి గుల్లబారుతుంది. గట్టి పడకుండా ఉంటుంది.
గిన్నెలు తోమడానికి కుంకుడు పొడిని నిమ్మకాయలతో కలిపి వాడితే సబ్బు, డిష్వాష్ల కంటే బాగా పనిచేస్తుంది. పాత్రలను శుభ్రంగా ఉంచుతుంది. కుంకుడు పొడి పాదాల పగుళ్ల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. సబ్బుల తయారీకీ దీనిని వాడుకోవచ్చు. దంత సమస్యలు ఉన్నవారికి కుంకుడు పొడి సరైన పరిష్కారం.
– పద్మారెడ్డి
-మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి