ఎడపల్లి, ఫిబ్రవరి 2: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఓ వ్యక్తి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఆరేండ్ల కూతురిని బతికుండగానే కాలువలోకి తోసి చంపేశాడు. వివరాలను నిజామాబాద్ సీపీ సాయిచైతన్య సోమవారం జిల్లాలోని ఎడపల్లి ఠాణాలో మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని ముఖేడ్ మండలం కేరూర్‌కు చెందిన కొండమంగళ బాబూరావు అక్కడ త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. తనకున్న ముగ్గురు సంతానం పోటీకి అనర్హత కావడంతో దురాలోచన చేశాడు. ఒక బిడ్డను తొలగించుకుంటే పో టీకి అర్హత కలుగుతుందని, కేరూర్ సర్పం చ్ గణేశ్ శిండేతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. గత నెల 29న తన పెద్ద కూతురు ప్రాచి (6)ని తీసుకుని ఎడపల్లి మండలం ఏఆర్పీ శివారులో నిజాంసాగర్ డీ-46 కెనాల్ వద్దకు వచ్చారు. పాపను కాలువలోకి తోసేసి వెళ్లిపోయారు. కాలువలో చిన్నారి మృతదేహం లభ్యమైన ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, కన్న తండ్రి కర్కశత్వం వెలుగులోకి వచ్చింది. బాబూరావు, గణేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.