ఆషాఢమాసం… ఆకుపచ్చలో దాగిన ఎరుపు రంగు, అతివల అలంకారానికి ఆహ్వానించిన అతిథిలా ఒబ్బిడిగా వచ్చి చేరుతుంది. కళ వచ్చిన వారితో సావాసం చేసి, కాంతల్ని కళకళలాడేలా తీర్చిదిద్దుతుంది. అరచేతుల్ని మందారాల్లా, పాదాలను ఎర్రని పద్మాల్లా భ్రమింపజేస్తుంది. ఈ ఏడూ అదే రీతిలో వచ్చినా, నూతనత్వానికి నాంది పలికింది. మారాణి పాదాలకుమువ్వలూ, జోళ్లూ అన్నీ తానై పారాణి అద్దుతున్నది. అందుకే యాంక్లెట్ మెహందీ,కొల్హాపురి డిజైన్లు నేడు ట్రెండవుతున్నాయి.
మెహందీ పెట్టుకోవడం ఇప్పుడో ఆర్ట్. కానీ గోరింటాకు మాత్రం నాటిదీ నేటిదీ కాదు. నాలుగో శతాబ్దం నుంచే భారతదేశంలో దీని ఆనవాళ్లున్నాయి. తరాల నుంచీ ఇక్కడి మహిళల అలంకారంలో ఇది భాగమైంది. మనం ఆషాఢం సందర్భంగా మైదాకును గుర్తు చేసుకుంటే, వివాహాది శుభకార్యాల్లో వైభవంగా మెహందీ ఫంక్షన్ చేసే ఆచారం ఉత్తరాదిలో ఉంది. మెహందీ అనే పదానికి సంస్కృత మూలం ఉంది. గోరింట చెట్టును మెంధిక అని పిలుస్తారు. అలా ఇది మెహందీ అయిందట. ఇక, ఈ చెట్టుకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వ్యాధులు అధికంగా వ్యాపించే వానాకాలం మొదట్లో దీన్ని కాళ్లకూ చేతులకూ పెట్టుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చన్నది సంప్రదాయ ఉద్దేశం. సన్నని డిజైన్ పెట్టుకునే వీలును కల్పించే మెహందీ కోన్ల పుణ్యమా అని చేతులూ కాళ్లూ కాన్వాసులుగా మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. అచ్చం చెప్పులు వేసుకున్నట్టు, పట్టీలు పెట్టుకున్నట్టు కనిపిస్తూ కాలిని అలంకరించే డిజైన్లు ఇప్పుడు పాదాల ముస్తాబులో ముందుంటున్నాయి.
ఎన్నో డిజైన్లు…
అరబిక్, ఫ్లోరల్, మొఘల్ ఇన్స్పైర్డ్, మండల… ఇలా రకరకాల ైస్టెల్స్ మెహందీ డిజైన్లలో ఉంటాయి. ఇక, ప్రస్తుతం కాళ్లకు కొల్హాపురి చెప్పులు వేసుకున్నట్టు కనిపించే కొల్హాపురి మోడల్ ఫేమస్ అవుతున్నది. చెప్పు ఆకృతి వస్తే చాలు, అందులో ఎన్నెన్నో డిజైన్లు గీసుకోవచ్చు. చూడగానే వావ్ అనిపించేలా చేయొచ్చు. అటు చూసేందుకు కొత్తగా ఉండటం, ఇటు సృజనాత్మకతను చూపించే అవకాశం ఉండటం ఇందులోని ప్రత్యేకతలు. ఇక, యాంక్లెట్ మెహందీ డిజైన్లయితే… అచ్చం కాలికి పట్టీ పెట్టినట్టే కనిపిస్తాయి. నాజూగ్గా ఉండేవి పెట్టుకుంటామా, నిండుగా ఉండేవి ఎంచుకుంటామా అన్నది మన ఇష్టం. మొత్తానికి ఈ ఆషాఢానికి ఆడపిల్లల పాదాలు కొత్త అందాలు అద్దుకుంటున్నాయన్న మాట. ఇవి మీకూ నచ్చితే చటుక్కున కాలిని చేతిలోకి తీసుకోండి మరి!