‘మా నాన్న సూపర్ హీరో’.. అంటున్నది తమిళ సోయగం ఆర్ణ! తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ చెన్నై చిన్నది.
అందం, అభినయంతో.. దక్షిణాదిన వరుస అవకాశాలు అందుకుంటున్నది. తన బలగమే తనకు బలమనీ.. కుటుంబ ప్రోత్సాహంతోనే పరిశ్రమలో అడుగుపెట్టానని చెబుతున్నది. ఇంకా.. తన కలలు, ఆశయాల గురించి ఆర్ణ పంచుకున్న కబుర్లు!
‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఈ చిత్రంలో నేను చేసిన తార పాత్ర.. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. తండ్రీ, కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. అందరు ఆడపిల్లల్లానే నేను కూడా నాన్న కూచీనే. అందుకే మా నాన్నే.. నా సూపర్ హీరో!
నా కుటుంబం నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. ప్రతి విషయంలోనూ నాకు అండగా ఉంటుంది. నా ఆశలు, కలలు, ఆశయాలను నెరవేర్చుకునేలా నా వెన్నంటే ఉంటుంది. అవకాశాలు రావట్లేదని నిరాశ పడిన ప్రతిసారీ.. మా నాన్న ‘తప్పకుండా అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ప్రయత్నిస్తూనే ఉండు!’ అంటూ నాకు ధైర్యం చెబుతారు.
ఆత్మవిశ్వాసంతో సాగితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు. సినిమాకి ప్రేక్షకులే బలం. వారిని మెప్పించగలిగితే విజయం సాధించినట్లే! నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. నా ప్రయాణంలో వారి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.
యాక్టింగ్తోపాటు డైరెక్షన్ కూడా చేయాలని ఉంది. ఎప్పటికైనా దర్శకురాలిగా సెక్ండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తా. మంచి కథతో నా
భావాలను ప్రేక్షకులకు చేరేలా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది.
మంచి నటిగా గుర్తింపు పొందాలనే లక్ష్యంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టా. మొదటి ప్రయత్నంలోనే నా నటనకు మంచి గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయాలని కలలు కనట్లేదు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలే చేయాలనుకుంటున్నా. అందుకే కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నా.
ప్రయాణాలు చేయడమన్నా చాలా ఇష్టం. ట్రావెలింగ్తో మానసిక ఉల్లాసం కలుగుతుంది. కుటుంబంతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇష్టపడతా! నాకు నచ్చే డెస్టినేషన్.. యూరప్. ముఖ్యంగా ఇటలీ. అక్కడి సంస్కృతి, కళలు, ఆహారం.. అన్నీ చాలా ఆహ్లాదాన్నిస్తాయి. ట్రెక్కింగ్ అన్నా ఇష్టమే! ఇటీవలే హిమాలయాలను సందర్శించా. నిజంగా.. అదో అద్భుతమైన అనుభవం.
చిన్నచిన్న విషయాల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటా! చదవడం అంటే చాలా ఇష్టం. రోజులో కొంత సమయాన్ని
చదవడానికి కేటాయిస్తే ఏకాగ్రత పెరుగుతుంది. అది మనం చేసే పనిపై సానుకూల ప్రభావం చూపుతుంది.
నేను జంతు ప్రేమికురాలిని. ఒక ఎన్జీవో ప్రారంభించి.. జంతువుల రక్షణ కోసం నావంతు సాయం చేయాలనుకుంటున్నా.