బాటసారి మీద భాణుసత్తి మనసు పడుతున్నదేమో అనుకుంటుంది ఆహవసత్తి. ఈసాణుడికి సౌగంధిక మీద అనుమానం వస్తుంది. తాము చేయాల్సిన కర్తవ్యం గురించి భూగృహం వద్ద పోటిసుడు, సవరసత్తి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత
“ఈసాణుడితో వైరం పెంచుకోవడం కన్నా, స్నేహం నటించడమే ప్రస్తుతం అనుసరించదగిన పద్ధతి” బాగా ఆలోచిస్తూ అన్నది సవరసత్తి. “కానీ వాడు నమ్ముతాడా? మంచి వాళ్లను, అమాయకులను నమ్మించడం తేలిక! దుర్మార్గులను, వంచకులను అంత తేలిగ్గా నమ్మించలేం! అనుక్షణం భయపడే వానికి అందరూ శత్రువుల్లాగే కనిపిస్తారు. వాడు తన నీడను కూడా అనుమానిస్తూనే ఉంటాడు..” అన్నాడు ఈసాణుడి గురించి అర్థం చేసుకున్న పోటిసుడు. సౌగంధిక, వామదేవులను పంపిన తర్వాత.. మున్ముందు చేయదగిన పనుల గురించి భూగృహం బయట పశువుల పాకలో కూర్చొని చర్చించుకుంటున్నారు సవరసత్తి, పోటిసుడు. ఆ పరిసరాల్లో సవరసత్తి చెలికత్తెలు వ్యవసాయం పనులు చేస్తున్నట్లు నటిస్తూ, కొత్తవాళ్లు అటుగా కనిపిస్తే హెచ్చరించడానికి అప్రమత్తంగా ఉన్నారు. అవసరమైతే ఆ వచ్చిన వాళ్లను అంతం చేయడానికి వెనుకాడని వీరవనితలు వాళ్లు.
“ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కోవడానికి ధైర్యంతోపాటు చాలా సహనం కావాలి వీరా! మన చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేవు. ముందు ఓపికగా మార్గాలు వెతకాలి, తర్వాత తిరుగులేని యోచనతో ముందుకెళ్లాలి. పొరపాటు జరిగితే మన ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాదు.. మనం రక్షించవలసిన మనవాళ్లు కూడా ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. తర్వాత బాధపడితే ఏ లాభమూ ఉండదు..” “మన ఆలస్యం మన వాళ్లను మరింత ఇబ్బంది పెడితే..” “ప్రస్తుతం మీ శ్రేష్ఠి గారికి గానీ, వారి కుమారులకు గానీ ప్రాణాపాయం లేదు. ఈసాణుడు వాళ్లని చంపాలనుకుంటే ఆ పని ఈపాటికి ఎప్పుడో జరిగిపోయేది. వాళ్ల నుంచి ఈసాణుడు ఇంకా ఏదో ఆశిస్తున్నాడు. అది నెరవేరే దాకా వాళ్లని ఏమీ చేయడు.
నెరవేరదని తెలిసినా, వాడు అనుకునేది జరిగినా.. శ్రేష్ఠికి, ఆయన కుమారునికి ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది” “అందుకే మనం రంగంలోకి దిగాలి!” పోటిసుని సహనం నశిస్తున్నది. “నాకొక ఆలోచన ఉన్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈసాణుడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు..” “అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు?” “మగాడు కోరుకున్నవేవీ జరగనప్పుడు కొంత ప్రశాంతత, తృప్తి కావాలనుకుంటాడు! తన ఆధిపత్యం చూపి, ఆత్మతృప్తి పొందుతాడు. అది సాధ్యమయ్యేది ఆడదాని సాంగత్యంలోనే! గతంలో వాడి అహం దెబ్బతిన్న ప్రతిసారీ నన్ను వెతుక్కుంటూనే వచ్చినాడు. ఇప్పుడూ తప్పకుండా అదే జరుగుతుంది!” నమ్మకంగా అన్నది సవర. ఆలోచిస్తూ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పోటిసుడు. “నా వద్దకు వచ్చినప్పుడు, నిన్ను వాని వెంట పంపుతాను!” “నన్నా! ఎట్లా?” ఆశ్చర్యపోయినాడు పోటిసుడు. “మా తాతయ్యగా పరిచయం చేసి..” నవ్వింది సవర. ఉలిక్కిపడ్డాడు పోటిసుడు. “నిజం వీరా! మా ఇండ్లలో వయోవృద్ధులు, మగటిమి లేనివాళ్లు, బానిసలు, రక్షకులు మాత్రమే ఉంటారు.
నిన్ను మా దూరపు బంధువైన తాతగా పరిచయం చేస్తా! అది కూడా ములక రాజ్యంలోని ఓ పల్లెటూరు నుంచి వచ్చినావని గానీ, పోదన సమీప గ్రామం వాడివని గానీ చెబుతా. అప్పుడు నీ మీద అతనికి ప్రత్యేక అభిమానం ఏర్పడుతుంది. తప్పనిసరిగా నిన్ను తనవెంట ఉంచుకుంటాడు ఆ ఈసాణుడు. అప్పుడు నీకు అంతఃపుర ప్రవేశంతోపాటు అన్నీ అనుకూలంగా మారుతాయి!” అన్నది నమ్మకంగా. “కానీ ఎట్లా?”అదే అనుమానం. “22 ఏళ్ల నన్ను 80 ఏళ్లు పైబడ్డవానిలా ఎట్లా చేయగలరు?” తన అనుమానం మరింత వివరంగా వ్యక్తీకరించినాడు పోటిసుడు. “భేజ్జా!” అని పిలిచి, ఏవో పక్షి కూతలు వినిపించింది సవర. ఒక యువ పరిచారిక హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమై.. “ఆనతినీయండి తల్లీ!” అన్నది. “ముగ్ధ హరిణుడిని తన సరంజామాతో వెంటనే భూగృహంలోకి రమ్మని కబురు చేయి!” ఆజ్ఞాపించింది సవర. “ఆజ్ఞ తల్లీ!” అంటూ.. ఎట్లా కనిపించిందో అట్లే మాయమైంది భేజ్జా. “మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం క్షేమం కాదు! లోపలికి పోదాం పద!” అంటూ భూగృహంలోకి దారితీసింది సవర. దారిలో ముగ్ధ హరిణుడు గొప్ప రూపశిల్పి అని చెబుతూ, అతని పనితనాన్ని వర్ణించి వర్ణించి చెప్పింది. చివరగా.. “ఒక్కమాటలో చెప్పాలంటే, అతని చేతిలో పడితే మంత్రించినట్లే రూపం మారిపోతుంది. ఎంతగా అంటే.. నిన్ను నీవు గుర్తించలేనంతగా!” అన్నది సవర సత్తి.
చంద్రహత్థి! బయలుదేరడం అయితే బయలుదేరింది కానీ, తర్వాత ఒక్కొక్క సందేహం ఆమెలో నుంచి బయలుదేర సాగినాయి.. గుర్రం ఎక్కడం కొత్త కాదు; కానీ సొంతంగా నడిపించుకుంటూ వెళ్లడం అదే మొదలు. తను సరిగ్గా వెళ్తున్నదా? రౌతు కొద్దీ గుర్రం అంటారు కదా! ఈ గుర్రాన్ని సరిగ్గా అదుపులో పెట్టుకోకపోతే అది సహకరిస్తుందా? కళింగపట్నం ఒకటి ఉన్నదని తెలుసు; కానీ అది ఎక్కడ ఉంటుందో, ఏ దారి ఆ గమ్యానికి చేరుస్తుందో తనకు తెలవదు. ముగ్గురు, నలుగురు ఆడవాళ్లు కనిపిస్తేనే దోపిడీగాళ్లు ఎత్తుకొని పోవడానికి చూస్తారు! ఒంటరిగా ఉన్న తాను అటువంటి తుంటరి బృందం కంటబడితే ఏంది పరిస్థితి? కళింగలో ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? తన మొగుడిని ఎట్లా వెతకాలి? రాజ్యంలో పరిస్థితులు బాగా లేవన్నాడు కటిలుడు. తనను చూస్తే రాజభటులు ఎట్లా స్పందిస్తారు?.. అనంతమైన ప్రశ్నలు తేనెటీగల తుట్టెను చేస్తున్నాయి ఆమె మెదడును. గుర్రం మాత్రం వెళ్తూనే ఉన్నది. అది మరీ వేగంగా గాక; నెమ్మదిగా గాక ఓ మోస్తరుగా పరుగెత్తుతున్నది. దానివల్ల ఆమెకు ఆయాసం కలగడం లేదు; ప్రయాణం ఆగిపోవడం లేదు. మధ్యాహ్నం సమయానికి ఒక మామిడి తోటలో చెట్టు కింద ఆగింది గుర్రం. అప్పుడు అనిపించింది చంద్రకు.. తనకు కొంచెం విశ్రాంతి కావాలి. గుర్రానికి కూడా విరామం అవసరం అని. గుర్రం మీద నుంచి కిందికి దిగుతూ చుట్టూ చూసింది. కొద్దిదూరంలో చిన్న వాగు లాంటిది కనిపించింది. గుర్రాన్ని కొద్దిసేపు అక్కడ వదిలితే, పచ్చని పచ్చిక మేసి, నీళ్లు తాగుతుంది. ఎందుకైనా మంచిది! జీనుకున్న తాడుతో ఆ వాగు అంచున దాన్ని కట్టేయాలి.
లేకుంటే దాని మానాన అది ఎక్కడికైనా పోతే తన సంగతి ‘అరణ్య రోదనే’ అనుకొని, జీనులో వేలాడుతున్న తాడు తీయబోయింది. అప్పుడు గమనించింది. తినడానికి ఒక మట్టి పాత్రలో రొట్టెలు; ముంతలో చల్లటి మజ్జిగ ఉన్నాయి. అంతేకాదు జీనుకు మరోపక్క గుర్రం కోసం గుగ్గిళ్లు, ఎండుదాన సిద్ధం చేసి పెట్టినవి ఉన్నాయి. ఒక్కసారిగా కటిలుడి మీద అభిమానం పెరిగింది. ‘నా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో!’ అని. గుర్రాన్ని వాగుదాకా తీసుకొనిపోయి, పచ్చిక ఉన్నచోట పగ్గంతో కట్టేసింది. వాగుకు అవతలి పక్కన నలుగురు ఆడవాళ్లు వరి చేనులో కలుపు తీస్తున్నారు. వాళ్లని అడిగితే కళింగ దారి గురించిన వివరాలు తెలుస్తాయని అటువైపు అడుగులు వేసింది. అప్పుడు కలుపుతీస్తున్న పొలతులు మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. “అక్కా! ఎందుకు ఆ పాలికాపు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు? ఏనాడూ ఊళ్లోకి పోయినట్లు కనిపించడు!” అన్నది ఒక ముగ్ధ. దానికి సమాధానంగా ఒక ప్రౌఢ ఇలా జవాబు చెప్పింది.. “గుండె గీము లోన నుండిన భార్యను కాలమే హరించె గాని, అయిన ఆమె లేని ఇంట అడుగు పెట్టగలేక లేని పనిని చేనిలో నొనర్చు.. (గుండెనే గుడిగా చేసి, తన భార్యను అపురూపంగా చూసుకున్నాడు ఆ కాపువాడు. కాలం కన్ను కుట్టి హఠాత్తుగా ఆమెను ఎత్తుకొని పోయింది. అప్పటినుంచి ప్రాణంగా ప్రేమించిన భార్య లేని ఇంట్లో అడుగుపెట్టడానికి మనసొప్పక, లేని పనిని కల్పించుకొని రాత్రీ పగలు పొలంలోనే ఉండిపోతున్నాడు)”.. ‘ఆహా! నిజంగా మగవాళ్లలో కూడా భార్యని ఇంతగా ప్రేమించే వాళ్లుంటారా!’ అనుకొని అంతలోనే, ‘ఎందుకుండరు?
నా పోటిసుడు నాకంటే అధికంగా నన్ను ప్రేమిస్తాడు!’ అనుకుంటుంటే ఆమె హృదయంతో పాటు ఒడలు పులకించి పోయింది. “ఏంది చిన్నమ్మీ! ఎవరు కావాలి?” అన్నది చేస్తున్న పనిని ఆపి కలుపుతీస్తున్న వనితల్లో ఒకరు. అప్పుడు గుర్తుకొచ్చింది చంద్రహత్థికి తాను వచ్చిన పని. “ఆఁ అక్కా! కళింగ ఇంకా ఎంత దూరం ఉంటది? ఎట్లా వెళ్లాలి?” అని అడిగింది. “తెలవకుండానే ఇంత దూరం వచ్చినావా? ఏ ఊరు మీది?” అని అడిగింది అందులో ఒక పెద్ద ముత్తయిదువ. వాళ్లకు ఏమాత్రం అనుమానం కలగకుండా జాగ్రత్తగా జవాబిచ్చింది చంద్రహత్థి. “నా పేరు హత్థి. మాది ఇక్కడికి 10 కోసుల దూరంలో ఉండే గూడెం. వారం పది రోజుల నాడు నా మొగుడు రాజదర్శనం చేసుకుంటానని వచ్చినాడు. ఇంతవరకూ తిరిగి రాలేదు. తనను వెతుక్కుంటూ వచ్చినాను. ఇదివరకు రెండు మూడుసార్లు వచ్చిన దారే కానీ, ఎందుకో అనుమానం వచ్చి అడుగుతున్నా!” అన్నది. “అవునమ్మా! ఇటువంటి వార్తలు ఈ మద్దెన శానా వింటున్నాం. కళింగ రాజ్యానికి దయ్యం పట్టినట్లున్నది. మనుసులను మింగేస్తున్నది. ఇట్లా పోయిన వాళ్లను వెతుక్కుంటూ శానామంది వస్తున్నారు.
నీవు సరిగ్గానే వచ్చున్నావు బిడ్డా! ఇంకా నాలుగు క్రోసులు ఇదే దారిలో వెళ్తే కళింగ చేరుకుంటావు. జతునంగా వెళ్లు!” అన్నది ఆ పెద్దమనిషి. ‘అమ్మయ్య! సరిగ్గానే వచ్చినాను అన్నమాట!’ అనుకున్నది చంద్ర. వాళ్లకు దండం పెట్టి వెనుదిరుగుతుంటే అందులో ఒకావిడ.. “జాగ్రత్త బిడ్డా! ఒంటరి దానివి; మగాడివన్నా కాకపోతివి..” అన్నది.. నిట్టూరుస్తూ యథాలాపంగా. ఆ మాట చంద్రహత్థి మీద బలంగా పనిచేసింది! నిజమే! తాను ఆడదాన్ని అనిపిస్తే అవతలి వాళ్లకు బలం పెరుగుతుంది; అదే మగాడు అయితే ఆలోచన అడ్డు తగులుతుంది! అనుకొని తాను మగాడుగా మారితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. చీరను పంచకట్టుగా చేసుకున్నది; జీనులో నుంచి కవచం, శిరస్ర్తాణం తీసి అలంకరించుకున్నది; కాటుకతో సన్నగా మీసకట్టు దిద్దుకున్నది. గుర్రాన్ని ఎక్కి అదిలించింది. వాస్తవానికి గుర్రం అంత సవ్యంగా ప్రయాణించి రావడంలో కటిలుని కష్టం చాలా ఉన్నది. దానికి చక్కని శిక్షణ ఇచ్చి కళింగకు చేరుకోవడం నేర్పించినాడు. అది కటిలుడు సూచించిన దారిలోనే నడుస్తున్నది. వాళ్లను అడిగినా, అడగకపోయినా చంద్రహత్థిని సరైన గమ్యానికే చేర్చేది.
అయితే ఆ గుర్రానికి కళింగ తెలియదు! చిలుకవాడలోని భూగృహం ఉన్న ప్రదేశం వరకే దానికి దారి బాగా తెలుసు. చివరిగా అక్కడి నుంచే వెనుకకు వచ్చి చెంచుగూడెం చేరుకున్నది. ఇప్పుడు అదే దారిలో మళ్లీ ప్రయాణించి, చిలుకవాడను; చిలుకవాడను అనుకొని ఉన్న పొలాన్ని గుర్తుపట్టి, పోటిసుడున్న ప్రదేశానికి చేరువగా వచ్చింది. అదే.. చంద్రహత్థిని తెచ్చింది. అయితే, మగాడిగా మారడమే ఆమెకు పెను ప్రమాదకరం అవుతుందని అప్పుడు అనుకోలేదు హత్థి. ఇప్పుడు అదే తనను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నది. చూస్తుండగానే ఆ చుట్టుపక్కల పనిచేస్తున్న పదిమంది ఆడవాళ్లు గుర్రం చుట్టూ చేరినారు. అందులో ఒకరు ఒడుపుగా గుర్రాన్ని పట్టి ఆపినారు; ఇంకొకరు చంద్ర చేయి పట్టి కిందికి లాగినారు; మరొకరు చేతిని కత్తిగా చేసి దాడి చేయడానికి సిద్ధపడినారు. అప్పుడు అర్థమైంది చంద్రహత్థికి.. తాను ప్రమాదకర పరిస్థితిలో పడిపోయినానని. వెంటనే తిరగబడింది. ఒక్కసారి పోటిసుణ్ని మనసులో తలచుకోగానే తన బలం పదిరెట్లు అయినట్లు అనిపించింది. అందరినీ శాయ శక్తులా ఎదుర్కొన్నది కానీ, ఎంతైనా అలవాటు లేని పనికదా! అందులోనూ అవతలి వాళ్లు యుద్ధ విద్య తెలిసిన వాళ్లు. తల మీద బలమైన దెబ్బ పడటంతో కుప్పకూలి పోయింది! అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చినాడు. “ఎవడు వాడు?” అన్నాడు పరిశీలనగా చూస్తూ. స్పృహ కోల్పోతున్న చంద్రహత్థికి ఆ గొంతు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించింది. బలవంతంగా కళ్లు తెరిచింది.. అతను పోటిసుడు!.. కాదు కాదు.. 80 ఏళ్ల వృద్ధుడు..
(సశేషం)
దోరవేటి
89788 71961