దేవిగా మారిన వామదేవుడు తన మాటలతో, చేతలతో మెల్లగా అవణాయరును లోబరుచుకుంటాడు. జయసేనుడు నిర్బంధంలో ఉన్న చీకటి కొట్టు బయట ఏదో అలికిడి అవుతుంది. భాణుసత్తి బాటసారిని ఒంటరిగా ఉన్నాను రమ్మని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. తర్వాత…
ఇంటికి కొన్ని అడుగుల దూరంలో ఉండిపోయిన ఆహవసత్తి.. అక్క మాట్లాడిన మాటలతో ఇంట్లోకి వెళ్లడమా? ఆగడమా? అనే సందిగ్ధంలో పడిపోయింది. అందుకు కారణం ఆమె ఒంటరి దాన్నని చెప్పడం. ‘చిన్నరాణి వారి మాట అబద్ధం కాకూడదు. ఏ అపచారమూ జరగకూడదు!’ అని మనసులో బలంగా కోరుకుంటూ, అక్కడే నిలబడిపోయింది ఆహవసత్తి. మరొక పక్క తనని ఇంట్లోకి ఆహ్వానిస్తున్న ఆ జగదేక సుందరిని అట్లాగే చూస్తూ ఉండిపోయినాడు సాధనానందుడు. అతని దీక్ష సడలిపోసాగింది. ‘భగవంతుడు ఎందుకు ఈ సుందరి చెంతకు మళ్లీ తనని చేర్చినాడు? ఇదేమైనా జన్మజన్మల బంధమా? దైవం తన లీలను ఈ విధంగా చూపిస్తున్నాడా? కామి గాని వాడు మోక్షగామి గాలేడని అన్నట్లు.. అరిషడ్వర్గాలను జయించేందుకు వాటితో సహవాసం చేయడం తప్పదా? కోరికను జయించడం కంటే.. తీర్చుకొని, ఆపై మార్గం మార్చుకోవడం సమంజసంగా ఉంటుందా? ఈ విధంగా ఆలోచిస్తూ ఉండిపోయిన సాధనానందుని మళ్లీ పిలిచింది భాణుసత్తి. “ఓ అందగాడా! నీ అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా! నేను మాట్లాడింది వినిపించిందా? వినబడకుంటే వెనుతిరిగి చూడవు కదా!” నిజ నిర్ధారణ కోసమా? అన్నట్లు అడిగింది. ఇంకా ఆలస్యం చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని; ఏదైతే అయిందని ఆమె ఆహ్వానాన్ని మన్నిస్తూ ఆ ఇంటి గడప తొక్కినాడు సాధనానందుడు.
కటిలుడు తెచ్చిన గుర్రం ఎక్కి, ఒక్కసారి పోటిసుణ్ని మనసులో గట్టిగా తలుచుకున్నది చంద్రహత్థి. గుర్తుకొచ్చినపుడు గుండె అద్దము లోన నిన్ను చూసి బతుకుచున్నదాన! బతుకు మీద ఆశపడి ఇంక ఎన్నాళ్లు బతికి ఉండగలను వసుధ మీద? (నీవు గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు అద్దంలో నిన్ను చూస్తూ బతుకుతున్నాను. బతుకు మీది ఆశతో ఇంకా ఈ భూమి మీద నేను ఎన్నాళ్లు ఉంటానో తెలవదు).. ఇట్లా అనుకోగానే ఆమె కంటి నుండి రెండు నీటి చుక్కలు రాలినాయి. మరుక్షణం కళ్లెం బిగించి పట్టుకొని, గుర్రం డొక్కల్లో తన్నింది. ముందుకు నడువుమన్నట్లుగా. అది ఒక్కసారి సకిలించి, ముందుకాళ్లను గాలిలోకి లేపి, ఆపై ముందుకు దూకి, పరుగు ప్రారంభించింది. “జాగ్రత్త! చంద్రా!” గట్టిగా హెచ్చరించింది రాయహత్థి. గుర్రం కనుమరుగైపోయే దాకా చూస్తూ ఉండిపోయినారు ఇద్దరూ. “అసలేం జరుగుతున్నది రా? మనం అనుకున్నది ఏమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? తనను ఒంటరిగా పోనీయకూడదనే కదా అనుకున్నాం! ఏది వద్దనుకున్నామో అదే జరుగుతున్నది!” నిట్టూరుస్తూ దిగులుగా అన్నది కటిలునితో రాయహత్థి. “జీవితం ఇంతే అక్కా! మనం వద్దనుకున్నదే తొంభై శాతం జరుగుతుంది. కావాలనుకున్నది పది శాతం కూడా జరగదు!” విరక్తిగా అన్నాడు కటిలుడు. “బాగుందిరా! చంద్రహత్థికి ఏ కష్టం కలగకుండా ప్రవర్తిస్తానని పెద్దపెద్ద మాటలన్నావు! ఇప్పుడు అది ఒంటరిగా వెళుతుంటే వైరాగ్య గీతాలు పాడుతున్నావు. నీది కానిది ఎటు పోతే నీకేం అనే కదా!” సూటిగా అన్నది రాయహత్థి. “చంద్ర అన్నట్లు ఆమె పోటిసుని చేరువలోకి వెళ్తే చాలు! తనకేమీ కాదు! పొద్దుగూకేలోపు ఆమె చిలుకవాడకు చేరుకుంటే ఏ ప్రమాదము లేనట్లే! చిలుకవాడ ఆడవాళ్లకు అభయహస్తం లాంటిది. అక్కడ ఆడవాళ్లను ఎదిరించలేరు; ఎదిరించినా నిలబడలేరు!” దృఢంగా అన్నాడు కటిలుడు. “ఏమైనా చంద్రను ఒంటరిగా పంపడం సరికాదు! మనం కూడా ఆమెను అనుసరిస్తూ బయలుదేరాలి!” సాలోచనగా అన్నది ఆమె. అతను మౌనం వహించినాడు. ఆ మౌనం అంగీకారమే అనుకున్నది రాయహత్థి.
కళింగలో.. అవణాయరు మందిరాన్ని అనుకొని ఉన్న గదిలో.. అవణాయరు, దేవి మధ్య తొలి సంభాషణ ఇలా కొనసాగింది. “నీ కోడలు పేరు సుద్ది కదా! ‘సౌగంధికా!’ అంటే.. ‘చెప్పండి మహాప్రభూ!’ అంటున్నదేం?” అనుమానం వ్యక్తపరిచినాడు అవణాయరు. నిజానికి అతను చెప్పదలచుకున్న విషయం వేరు. తన తప్పిదం గ్రహించిన సుద్ది (సౌగంధిక) వెంటనే కళ్లు మూసుకొని, కలవరిస్తున్నట్లు.. “అలాగే ప్రభూ! చిత్తం ప్రభూ!” అన్నది. వెంటనే దేవి (వామదేవుడు).. “దానికి చాలా అవలక్షణాలు ఉన్నాయి ప్రభూ! పగటిపూట నిద్రపోతుంది; నిద్రలో కలలు గంటుంది; కూర్చున్నది కూర్చున్నట్లే నిద్రలోకి జారుకుంటుంది; కలవరిస్తుంది; ఒక్కోసారి గట్టిగా అరుస్తుంది; ఉన్నట్టుండి మీదపడి రక్కేస్తుంది!” అన్నది సమయస్ఫూర్తితో.. ‘హుఁ! అవకాశం దొరికింది కదా అని నా గురించి ఇష్టం వచ్చినట్లు కూస్తావా? నీ సంగతి చెప్తా!’ అనుకుంటూ పళ్లు నూరుకున్నది సుద్దిగా మారిన సౌగంధిక. “ఇంతకూ తమరు సౌగంధిక.. అని ఎందుకన్నారు ప్రభూ!” అన్నది దేవి, మాట మారుస్తూ. “అదా.. అదీ.. సౌగంధిక తైలంతో మర్దన చేస్తావేమోనని..” తన మనసులోని మాటను పూర్తిగా బయటపెట్టినాడు అవణాయరు. అప్పుడు అర్థమైంది ఇద్దరికీ. “మా వద్ద అంత విలువైన నూనెలు ఎందుకుంటాయి ప్రభూ!” అని సౌగంధిక వైపు చూస్తూ.. “ఏదో జిడ్డు మొఖాలం! మా వద్ద అన్నీ వేపుడు నూనెలే ఉంటాయి. తీపులు పోగొట్టేందుకు అవే వాడతాం!” అంటూ కుసుమ నూనె అందుకోబోయింది దేవి. జిడ్డు మొఖాలు అన్నమాట విని మరింత కుతకుతలాడింది సౌగంధిక. తనను జిడ్డు మొఖం చేసి, ఆయన మాత్రం అందంగా సింగారించుకున్నాడు. ఈ అవణాయరు అవతలికి పోనీ, నీకు ఉంటుంది చెక్కభజన!.. అన్నట్లు ఓ చూపు విసిరింది. ‘అబ్బో కనిపెట్టినావా?’ అన్నట్లు మొహం తిప్పుకొన్నాడు వామదేవుడు.
దేవి ఎక్కడ తనకు జిడ్డు నూనె రుద్దుతుందోనని.. “ఆగు!” అని అడ్డుకొని.. “ఎవరక్కడ?” అన్నాడు అవణాయరు. మరుక్షణం ఓ పరిచారిక గుమ్మంలో కనిపించింది. “మా మందిరంలో గల సుగంధ ద్రవ్యాల నుండి తీరుకొకటి చొప్పున వెంటనే తీసుకొని రా!” ఆజ్ఞాపించినాడు అవణాయరు. మరికొద్ది నిమిషాల్లో ఒక పేటిక నిండా సుగంధ ద్రవ్యాలను తెచ్చింది ఆ సేవిక. అవన్నీ వామదేవునికి తెలియనివి కావు. అయినా తెలియనట్లే అడిగి, అప్పుడు ఏ తైలం వాడుమంటాడో తెలుసుకొని, దానితో మర్దన చేయసాగినాడు. అది అవణాయరుకు మితిమీరిన ఆనందాన్ని, అంతకుమించిన హాయినీ ఇవ్వసాగింది. “ఆహా! మీది ఎంత గొప్ప అభిరుచి! ఇంకెంత మంచి మనసు! మీరు ఉన్నారన్న నమ్మకంతోనే మేము ఈ రాజ్యంలోకి వచ్చినాము..” దేవి మాట పూర్తి కాలేదు. “ఎందుకలా?” అన్నాడు అవనణాయరు. “…..” మాట్లాడలేదు దేవి. “మేమేమీ అనుకోములే! ఈ రాజ్యం గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి!” మళ్లీ అడిగినాడు అవణాయరు. “మేం అనుకోవడం కాదు ప్రభూ!” తప్పనిసరై చెపుతున్నట్లు మెల్లగా కొనసాగించింది దేవి.. “అందరూ అనుకుంటున్నారు. మీ రాజధానిలో అవణాయరులను మించిన ఉత్తములు లేరని, రాజుగారు పాలన వ్యవహారాలు పట్టించుకోవడంలేదని, ఆ మంత్రి ఈసాణులే అన్ని చర్యలు తీసుకుంటారని, నిరపరాధులను కూడా శిక్షిస్తారని, భయంకరమైన దండనలు విధిస్తారని..” “ఆడవాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారని..” అంటూ చివరి మాటలతో ముగించింది సుద్ది. గంభీరంగా మారిపోయినాడు అవణాయరు.
అది కనిపెట్టిన దేవి.. “క్షమించండి ప్రభూ! బయట లోకులు అనుకుంటున్న మాటలు! లోకులు పలుగాకులు కదా!” అన్నది. వెంటనే. “కాదు! అది నిజమే కానీ, రాజ్య రహస్యాలు బయటికి పొక్కితే రక్షణ ప్రమాదంలో పడుతుంది కదా!” ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు అవణాయరు. అతని మనోగతం పూర్తిగా అర్థం కాలేదు దేవికి. మరింత స్పష్టత కోసం ఇంకో బాణం వేసింది.. “ఈ కోటలో తమరే అత్యంత ముఖ్యమైన దొరవారని కూడా అందరూ అనుకుంటున్నారు ప్రభూ! మహారాణి వారివైపు సన్నిహితులైన బంధువు అని, మీ వల్లనే ఆ కుటుంబం ఏ ప్రమాదానికీ లోను కాలేదని చెప్పుకొంటున్నారు!”.. సవరసత్తి ఇచ్చిన సమాచారాన్ని తెలివిగా ప్రకటించినాడు దేవి రూపంలో ఉన్న వామదేవుడు. అది అతని మీద బాగా పనిచేసింది. “అవును! అయినా నేను ఏమీ చేయలేకపోతున్నాను” అన్నాడు తన నిస్సహాయతను అంగీకరిస్తూ. “ఆంజనేయునిలా తమ బలం తమకు తెలియదు ప్రభూ! మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు! మా వంటి ఆడవాళ్లు మీకు తోడుగా ఉంటారు. రేయయినా, పగలైనా!” అన్నది నర్మగర్భంగా. అవణాయరు మరింత ఉబ్బినాడు. “ఈ మాత్రం తోడు నిలబడగల వాళ్లుంటే నేను ఏమైనా చేయగలను!” అన్నాడు. అదే అదనుగా.. “మీకు మా తోడు కావాలంటే, కోటలో ఏం జరుగుతుందో.. ఏవేవి ఎక్కడ ఉన్నాయో.. మాకు తెలియాలి కదా ప్రభూ!” అన్నది ఎదమీద సుతారంగా రుద్దుతూ దేవి.
ఒక్కొక్క విషయమే చెబుతూ నిద్రలోకి జారుకున్నాడు అవణాయరు. అవణాయరు ఆ గదిలోకి ప్రవేశించగానే ఇప్పపువ్వు పొడిని పాలల్లో బాగా కలిపి ఇవ్వడమే అతని నిద్రకు కారణమని అతనికి తెలవదు. ఇదంతా జయసేనుడు బందీగా ఉన్న చీకటి కొట్టుకు దేవి చేరకముందే జరిగింది. నిద్రపోతున్న అవణాయరుకు మర్దన చేస్తున్నట్లు నటించమని సౌగంధికకు అప్పజెప్పి, దేవి రూపంలోనే వామదేవుడు తాను విన్న ఆనవాళ్ల ప్రకారం అక్కడికి చేరి తలుపు తెరిచినాడు. అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తూ, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్న జయసేనుడు ఆ తలుపు తెరిచిన మనిషి మీద హఠాత్తుగా దాడి చేసి స్పృహ తప్పిపోయేటట్లు చేసినాడు. ఆ మనిషి ఆడదో మగవాడో గమనించే స్థితిలో లేడు జయసేనుడు. కనిపించే అవకాశమూ లేదు! వెంటనే గది బయటికి వెళ్లి గడియ వేసినాడు. ఒక్కసారిగా చీకటిలో నుండి బయటికి వచ్చిన జయసేనునికి ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఆనవాళ్లు పట్టడానికి వెంటనే కుదరలేదు. పైగా ఆహారపానీయాలు లేక నిస్సత్తువగా ఉన్నాడు. గుమ్మం పక్కనే కూలబడి, ఆయాసం తీర్చుకుంటూ చుట్టూ పరికించినాడు. దూరంగా ఒక మనిషి అటుగా రావడం కనిపించింది.
బాగా గమనిస్తే అతను ఈసాణుడేనని అర్థమైంది జయసేనునికి. అక్కడ అవణాయరు వద్ద కూర్చున్న సౌగంధికకు మనసు మనసులో లేదు. వామదేవుడు చేస్తున్న సాహసం మామూలు సాహసం కాదు! ప్రాణాంతకం! అంతఃపురంలో అడుగడుగునా ఈసాణుని మనుషులే ఉన్నారు. ఏమాత్రం అనుమానం కలిగినా ముందు చంపేస్తారు; తర్వాత ఆలోచిస్తారు. వాళ్లు అంత క్రూరంగా ఉండటం వల్లనే రాచరికం అతని గుప్పిట్లో ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో.. కొత్త ప్రదేశంలో.. కేవలం అవణాయరు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఎవ్వరికీ అనుమానం కలుగకుండా పనిచేయడం సాధ్యమే కాదు! అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలనని రంగంలోకి దూకిన వామదేవుణ్ని ఆ క్షణం మనసులోనే అభినందించింది సౌగంధిక. కానీ, పరిస్థితుల్లో ఆవగింజంత మార్పు వచ్చినా అతను దక్కడం కష్టం. అందుకే అతనికి సాయంగా వెళ్లడమే ఇప్పుడు చేయదగిన పని అనిపించింది. అవణాయరు కనీసం రెండు గడియలు గడిస్తే గానీ లేవడనే విషయం నిర్ధారించుకుని, అతణ్ని అట్లాగే పడుకోబెట్టి, వామదేవునికి తెలవకుండానే అనుసరించింది. అతను జయసేనుణ్ని బంధించిన చీకటికొట్టులోకి వెళ్లడం చూసి, హాయిగా ఊపిరి పీల్చుకున్నది కానీ, కొన్ని నిమిషాలలోనే ఒక మనిషి బయటికి వచ్చి, ఆపై తూలి పడిపోవడం గమనించింది. ఎవరు పడిపోయింది? వామదేవుడా? జయసేనుడా? ఇద్దరిలో ఒకరు మాత్రమే వచ్చినారు.. అంటే రెండవ వ్యక్తి పరిస్థితి ఏమిటి? అనుకోగానే నడకలో వేగం పెంచింది. ఒకవైపు నుండి కర్కోటకుని వంటి ఈసాణుడు.. రెండోవైపు నుంచి ఒక స్త్రీ వస్తున్నది. జయసేనుడు ఏమి చేయాలో నిర్ణయించుకోలేక సతమతమవుతున్నాడు.