బన్సీలాల్‌పేట్, మే 23 : గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గాంధీ మెడికల్ కాలేజీ బీఎస్సీ అలైడ్ సైన్సెస్ (ఓటీటీ) రెండో సంవత్సరం చదువుతున్న పల్లవి గౌడ్ (19) మృతి చెందింది. కార్వాన్‌లోని జియాగూడకు చెందిన వెంకటేశ్ గౌడ్, సంతోషి దంపతుల కూతురు పల్లవి, కణితి తొలగింపునకు శస్త్ర చికిత్స కోసం ఈ నెల 16న గాంధీ దవాఖానలో చేరింది. మే 17న ఆమెకు నిర్వహించిన ఆపరేషన్ విఫలమైంది. 20న డాక్టర్లు డ్రెస్సింగ్ ప్రాంతంలో స్వల్ప రంగు మారడం గమనించారు. రోగికి రక్తం గడ్డ కడుతున్న పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించి, రీ-ఎక్స్‌ప్లోరేషన్ సర్జరీ నిర్వహించారు.
శనివారం తెల్లవారుజామున పల్లవి మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు భోరున విలపిస్తూ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. అనుభవం లేని పీజీ వైద్యులు ప్రయోగాల కోసం తమ కూతురుని పొట్టన బెట్టుకున్నారన్నారు. గాంధీ దవాఖాన మార్చురీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని నినాదాలు చేశారు. దీంతో అనుమానాస్పద మృతి ఎంఎల్సీ కేసుగా నమోదు చేసుకుని యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, మృతదేహాన్ని అందజేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క గాంధీ దవాఖానకు వచ్చి.. పల్లవి కుటుంబసభ్యులను పరామర్శించారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు
పల్లవికి బీపీ పడిపోవడంతో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వెంటిలేటర్ సహా అన్ని రకాల చికిత్స అందించినా.. పల్లవిని కాపాడలేకపోయాం. గాంధీ వైద్యుల నిర్లక్ష్యం లేదు. నిజానిజాలు తెలుసుకునేందుకు ముగ్గురు వైద్యాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ ఎన్.వాణి గాంధీ సూపరింటెండెంట్