జరిగిన కథ
కళింగపట్నం చేరిన కల్లణసీహుడు పోదనలో జరిగినదంతా చెబుతాడు. అది విని ఈసాణుడు హతాశుడవుతాడు. కువిందుడి మరణవార్త విని కుసుమ శ్రేష్ఠి స్పృహ కోల్పోతాడు; జయసేనుడు కన్నీటి పర్యంతమవుతాడు. చెంచుగూడెంలో చంద్రహత్థి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. కటిలుడు హఠాత్తుగా రాయహత్థి కంటబడతాడు. ఆ తర్వాత..
చీకటి రాత్రి! ఈదురుగాలుల హోరు.. భయంకరమైన ముళ్లపొదలు.. దూరంగా నక్కల ఊళలు; అప్పుడప్పుడూ గుడ్లగూబల అరుపులు.. వీటన్నిటినీ లెక్కచేయకుండా ఒక యువకుడు సంధించి వదిలిన బాణంలాగా పరుగు పెడుతున్నాడు. ముళ్లు గీసుకొనిపోయి భగ్గున మండుతున్నా; చలిగాలి జడిపిస్తున్నా.. అనుకున్న సమయానికి ఫణిగిరిని ఆనుకుని ఉన్న అడవి ప్రాంతం చేరుకోవడమే అతని లక్ష్యం. అతను బయలుదేరి రెండు రోజులైంది. మూడవరోజు ఏ సమయంలోనైనా ముగ్గురు స్త్రీలు సంకేత స్థలానికి చేరుకుంటారు. వాళ్ల కంటే ముందు తాను అక్కడ ఉండాలి. కువిందు తాత చెప్పిన విషయాలు వాళ్ల చెవిన వేయాలి.. “అమ్మా!” హఠాత్తుగా అరుస్తూ పడిపోయినాడు ఆ యువకుడు. అతని పేరు విక్కిరుడు. కుసుమ శ్రేష్ఠి గృహంలోని రక్షణదళ సభ్యుడు. రెండు రోజుల క్రితం శ్రేష్ఠి భవనం తగలబడినప్పుడు జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన కువిందుడు శత్రువులను ఎదుర్కోవడానికి అప్రమత్తులను చేసినాడు. తాము కూడా తెగించి పోరాడినారు.
అయినా వాళ్ల బలం ముందు, సంఖ్య ముందు తాము నిలబడలేకపోయినారు. శత్రువుల దాడిలో కువిందు తాత కూడా స్వర్గానికి చేరుకున్నాడు. చనిపోయేముందు తనకు అప్పగించిన పని ఇది. రాణులిద్దరూ అలసుద్దితో కూడా ఫణిగిరి వద్ద గల అడవిలో పెద్ద చింత చెట్టు వద్దకు చేరుకుంటారు. వాళ్లు వచ్చేలోపు తాను అక్కడికి చేరుకొని, ధైర్యం చెప్పి, కొంతకాలం వరకు వాళ్లకు తోడుగా ఉండాలి. ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. ఆ ఊరు కళింగకు వెళ్లే దారిలోనే ఉంటుంది. త్వరలోనే కళింగ నుంచి యువరాజావారు, పెద్ద రాజావారు ఆ దారిలోనే వస్తారు. వాళ్లు కంటపడగానే రాణులు ఇక్కడున్న విషయం తెలియజెప్పి, వీళ్లను వాళ్లకు అప్పగించాలి.. ఇది విక్కిరుడు చేయవలసిన పని.అసలే యుద్ధంలో పక్కటెముకకు గాయమైంది. దానికి బలంగా కట్టు కట్టుకున్నాడు. చీకట్లో పరిగెత్తుతుంటే కాళ్లకు ఏదో చుట్టుకున్నది. పరుగు తడబడి ఉన్నపళంగా పడిపోయినాడు. ఎడమ పక్కకు పడటంతో కట్టు కదిలి, చివ్వున నెత్తురు బయటికి చిమ్మింది. అది పట్టించుకునే స్థితిలో లేడతను. ఒరలో నుంచి కత్తి తీసి అప్రమత్తుడైనాడు. అతని ఊహ నిజమైంది! కాళ్లకు తగిలింది తీగ కాదు. నల్లగా నిగనిగలాడుతున్న సర్పం! అప్పుడే ఒక మెరుపు మెరిసింది! ఆ వెలుతురులో అది స్పష్టంగా కనిపించింది.. ఏడడుగుల కృష్ణ సర్పం! పడగెత్తి బుస కొడుతున్నది.
* * *
కాలం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పదు! అనుభవాలనిస్తుంది. ఆ అనుభవాల నుంచి విజ్ఞుడైన మనిషి నేర్చుకోవాలి. నేర్చుకోగలవాడు ముందుకెళ్తాడు; నేర్వలేనివాడు పతనం అంచున నిలబడతాడు. కువిందుడు చనిపోయినాడు; అందాలకోట వంటి తమ భవనం అగ్నికి ఆహుతి అయ్యింది; దశాబ్దాల సంపద ఏమైందో తెలియదు; తన తల్లి, భార్య సురక్షితంగానే ఉన్నారా? తండ్రి తనకు చేరువనే ఉన్నట్లు తెలుస్తున్నది కానీ మాట్లాడలేని నిస్సహాయుడై ఉన్నాడు; రాజు కళింగాదిత్యుడు కదా! ఈ ఈసాణుడు ఎవరు? వీనికింత అధికార మదం ఎందుకు? తన ప్రాణమిత్రుడు వామదేవుడు ఎక్కడున్నాడో! ఏమైపోయాడో! ప్రాణానికి ప్రాణమైన రోహ.. తన గురించి ఏమనుకుంటున్నదో.. అనంతమైన ప్రశ్నలు మెదడును తొలిచేస్తూ ఉండగా తండ్రి వంటి కువిందుని వీరమరణం తలచుకొని కన్నీటి పర్యంతమైపోతున్న జయసేనుని వద్దకు వచ్చినాడు ఈసాణుడు. “ఏం మిత్రమా!; ఏం జరిగిందో తెలిసింది కదా! అదే.. పక్క గదిలో మీ నాయనగారు ప్రత్యక్షంగా విన్నారు. గోడ ఇవతల నుంచి నీవు పరోక్షంగా విన్నావు. ఎట్లా విన్నా , విషయం ఒక్కటే! మీ కోట బూడిదయింది; మనుషులు మంటల్లో కలిసిపోయినారు; ఇక మూగవాడైన నీ తండ్రి, నిస్సహాయుడవైన నీవు మాత్రమే మిగిలినారు! నేను తలచుకుంటే అరక్షణంలో మీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి.
నేను దయగలవాడను కాబట్టి మీకు ప్రాణదానం చేయాలనుకుంటున్నాను. అట్లని ఊరికెనే ఇప్పటికిప్పుడు మిమ్ములను వదిలిపెడతాను అనుకోవద్దు! నేనంత వెర్రిబాగుల వాడిని కాదు! కేవలం రెండు ప్రశ్నలకు జవాబు చెప్తే చాలు.. ఇద్దరినీ విడిచిపెడతా.. మొదటిది మీ సంపద ఎక్కడ దాచి పెట్టినారో చెప్పాలి. అది దొరకగానే మీ నాయనను వదిలివేస్తా!”.. తండ్రి విముక్తి మాట వినగానే జయసేనుని కనులు మెరిసినాయి. “ఇక రెండవది.. మీ గృహం నుంచి రహస్య మార్గం ఎక్కడ తెరుచుకుంటుందో చెప్పాలి! అప్పుడు నిన్ను విడిచిపెడతా! ఈ రెండు జవాబులు నాకు రెండు రోజుల్లో చెప్పాలి. మీరు ఎట్లాగూ చెప్పరని నిర్ధారణ అయ్యిందనుకో.. మూడో రోజు మీ తలకాయలు, మెడకాయలు వేరవుతాయి. ఆపైన నేనే మా మనుషులను పంపి నాకు కావలసినవన్నీ సొంతం చేసుకుంటాను” జయసేనుని రక్తం మరిగిపోతున్నది. ఒక్కసారిగా కట్లు తెంచుకొని ఈసాణుడి మీదికి ఉరికి, గుద్దుకి కుంచెడు రక్తం కక్కుకొని చచ్చిపోయేటట్లు దాడి చేయాలని ఉంది.. కానీ, తానిప్పుడు బందీ. ఏ చిన్న పొరపాటు చేసినా అది తన తండ్రికి ప్రాణహాని కలిగిస్తుంది. తన తల్లిని, భార్యను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. అందుకే పిడికిళ్లు బిగించి, మౌనంగా ఉండి పోయినాడు. “నాకు తెలుసు జయసేనా! నీవు బుద్ధిమంతుడవు. గడువుకు ముందే రెండు జవాబులు చెబుతావు! చెప్పకపోతే ముందు నీ తండ్రి చస్తాడు.. తర్వాత నీవు! చావో – రేవో.. నీవే నిర్ణయించుకో! వస్తా!” అంటూ అక్కడి నుంచి వెళ్లసాగినాడు. “ఆగు!” ఈసాణుడు గడప దాటుతుండగా గట్టిగా అరచినాడు జయసేనుడు.
“ఏమిరా పిచ్చి పట్టినదా? తన్నులు తినాలని ఉన్నదా?” అక్కడనే తచ్చాడుతున్న కటిలుణ్ని చూసి, కోపంగా అన్నది రాయహత్థి. కటిలుడు పరుగు పరుగున వచ్చి రాయహత్థి కాళ్ల మీద పడ్డాడు. “అక్కా! నన్ను క్షమించు!” అన్నాడు కన్నీళ్లతో. ఆశ్చర్యంతో ఒక్కక్షణం నోట మాట రాలేదు ఆమెకు. తర్వాత తేరుకుని.. “మరో కొత్త నాటకానికి తెరతీసినావా?” అన్నది అనుమానంగా చూస్తూ.
“లేదక్కా! నేను ఒక నిర్భాగ్యుడను; అదృష్టహీనుడను; అవివేకిని. బౌద్ధమతం స్వీకరించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని తల్లిదండ్రులను బాధపెట్టి ,ఇల్లు వదిలి వెళ్లినాను. అక్కడ ఇమడ లేకపోయినాను; తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను; ఆస్తులు అమ్ముకొని దరిద్రుడనైనాను; దురలవాట్లకు బానిసనై చరిత్రహీనుడనైనాను; ప్రేమ పేరుతో చంద్రను సొంతం చేసుకోవాలని దురాశకు పోయి భంగపడ్డాను. ఇంకా పతనం కావడానికి ఏం మిగిలింది? చివరికి తల్లి వంటి నిన్ను కూడా తప్పుడు దృష్టితో చూసినాను. నేను దుర్మార్గుణ్నే కాదు పాపాత్ముణ్ని కూడా! రామకథ ఎంతమందిని మార్చిందో తెలవదు. నీవు చెప్పిన లక్ష్మణుని కథ మాత్రం నన్ను మార్చింది. నా పాపాల భారం కొంచమైనా తగ్గాలంటే చంద్రహత్థి ఆనందం కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఆమె ఇష్టపడే పోటిసుణ్ని చేరుకునేందుకు నా వంతు సాయం చేస్తాను. ఎంతోమంది కన్నీళ్లకు కారణమైన నేను, ఒక్కరి కన్నీటిని అయినా తుడిస్తే మనసుకు తృప్తి! ఆ తరువాత తథాగతుని శిష్యుడనై జీవితాన్ని బాగుపరచుకుంటాను..” కటిలుడి మాటలు నమ్మలేకపోతున్నది రాయహత్థి. అట్లని వాని మాటల్లోని నిజాయతీని కూడా శంకించలేకపోతున్నది. మరొక పక్క చంద్రహత్థికి వాడి మాటలేమీ వినిపించడం లేదు. ఆమె మనసు నిండా, ఆలోచనల నిండా పోటిసుడే ఉన్నాడు. చివరి మాట అన్నట్లుగా కటిలుడు.. “అక్కా! నేనేమో మాయమాటలు చెప్పి చంద్ర వెంట తిరుగాలని అనుకోవడం లేదు. ఈ క్షణం నుంచి ఈ లోకంలోని స్త్రీలందరూ నాకు అక్కా చెల్లెళ్లతో సమానం! నేను వెళుతున్నాను. నేను మీకు ఏ విధమైన సాయం చేయడానికైనా, ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీరు ఏ పని చెప్పినా, ఎంతటి ప్రమాదకరమైనదైనా చేస్తాను! ఈ మాట చెప్పడానికే తిరిగి వచ్చినాను. అవసరమైతే పిలవండి!” అంటూ వెనుదిరిగి చూడకుండా వెళ్లినాడు. చంద్రహత్థి వంక చూసింది రాయహత్థి. ఆమె తన లోకంలోనే విహరిస్తున్నది. పోటిసుని తలచుకోగానే మనసులో ఒక ఆలోచన కలిగింది. అది రాయహత్థితో ఇట్లా పంచుకున్నది..
“అక్క! తగిన మగడు దక్కుట కష్టము దొరికినంతనె వశపరచుకొనుట కష్టమవును గాదె? ఇష్టపడిన వేళ రాని భర్త ఉండి లేని యట్లె” (అక్కా! ఆడపిల్లకు తగిన భర్త లభించడం కష్టం. ఒకవేళ దొరికినా భార్యకు వశుడై ఉండటం కూడా కష్టమే! రెండూ కూడినా కోరుకున్న సమయానికి చేరుకోలేని మగడు ఉన్నా లేనట్లే కదా!)” అన్నది. సరిగ్గా అదే సమయానికి చిలకవాడ వద్దగల భూగృహంలో హఠాత్తుగా సౌగంధిక కన్నీటిని చూసి చలించి పోయినాడు వామదేవుడు. “చెవి కమ్మ నీలి వెలుగులు దవిలిన తఱి కంటి చెమ్మ తళుకుమనగఁ జూ చి వెఱగుపడుచు కరములఁ దు డువ బోయే నప్పుడు ప్రియుడు చెలియ మురియన్! (ఆమె నీలిరంగు చెవికమ్మ వెలుగు కంటి చెమ్మలో తళుక్కుమని ప్రతిఫలించగా అది కాటుక కంటి నీరు అనుకొని, కంగారుపడుతూ చేతితో తుడువబోయినాడు ప్రియుడు. అతని ప్రేమకు ముగ్ధురాలయింది ఆమె). ఆ ప్రియుడే వామదేవుడు; ప్రియురాలు సౌగంధిక. “సౌగంధీ! ఎందుకా కన్నీరు?” అన్నాడు ఆందోళనగా. అంతవరకు ఆమె కంటిలో లేని కన్నీరు అప్పుడు హఠాత్తుగా బయటికి దూకింది, అతని ప్రేమ వల్ల కలిగిన ఆనందంతో! తన బుగ్గల మీదున్న అతని చేతులను గట్టిగా పట్టుకొని.. “దేవా! ఇవి ఆనందబాష్పాలు. నీ ప్రేమ నా గుండెలో చేరి, బాష్ప తటాకమై, కంటి అలుగుపై నుంచి దూకింది” అంటూ ఆ చేతులను గట్టిగా ముద్దు పెట్టుకున్నది. దూరం నుంచి ఆ దృశ్యం చూసిన పోటిసుని మనసు కలుక్కుమన్నది. చంద్రహత్థి విరహంతో కన్నీటి పర్యంతమవుతున్న అతనికి అది మరింత బాధాకరమైంది. ఆ బాధ మరిచిపోవాలంటే కార్యరంగంలో దూకడం ఒక్కటే శరణ్యం! అందుకే తన ఉనికిని తెలియజేస్తూ చిన్నగా దగ్గినాడు. సౌగంధికా వామదేవులు ప్రేమ సమాగమంలో మరింత ముందుకు వెళ్లడాన్ని అది అడ్డుకున్నది.
“మిత్రమా! ఇంతసేపు ఎక్కడున్నావు? కొంచెం ముందుగా వస్తే ఒక అద్భుతమైన విరహ గీతం వినేవాడివి. అయినా అది నీకు కూడా వినిపించే ఉంటుంది కదా!” అన్నాడు పలకరింపుగా వామదేవుడు. ‘ఆ గీతం పాడిన నిర్భాగ్యుడ్ని నేనే స్వామి’ అని తనలో తానే అనుకుని, పైకి మాత్రం.. “స్వామీ! ఇప్పుడు మనం ఆలోచించవలసింది ప్రణయాలూ, విరహాలు కాదని నా అభిప్రాయం. చిన్న రాజావారు ఆపదలో ఉన్నారు. మహారాజు వారి ఉనికి తెలియడం లేదు. అవి తెలుసుకుంటే గాని మనం మన వ్యక్తిగత ఆనందాలను ఆస్వాదించలేం కదా!” అన్నాడు పోటిసుడు. చిన్నవాడైనా పెద్దమాట అన్నాడు! అట్లా మాట్లాడినందుకు మరొక సందర్భంలో అయినా; ఆ స్థానంలో మరొకరు ఉన్నా చెంప ఛెళ్లు మనేదే.. కానీ పోటిసుడు తన ప్రాణదాత కావడం; కుసుమ శ్రేష్ఠి కుటుంబాన్ని కాపాడుకోవడం అందరి ముందున్న పరమ లక్ష్యం కావడంతో వామదేవుడు ఏమీ అనలేకపోయినాడు. పైగా ‘నా కర్తవ్యాన్ని గుర్తు చేయడం కూడా సత్యమే కదా!’ అనిపించింది అతనికి. పోటిసుని మాటలు సౌగంధికకు కూడా రుచించలేదు. పైగా తన ప్రియునికి చేరువవుతున్న క్షణాలను ఆ మాటలు భంగపరిచినాయి. అయినా అతని మాటలు తప్పుపట్టలేనివే కానీ వాటికి సమాధానం ఆమె వద్ద ఉన్నది. “మహావీరా! కర్తవ్యం పట్ల నీ నిబద్ధత కొనియాడ దగినదే! మా ఆలోచన కూడా అదే. ఈ సందర్భంలో ఆవేశపడటం కంటే సరైన అవకాశం కోసం ఎదురు చూడటమే వివేకం కదా!” అన్నది. “మనం చేసే ఆలస్యం అవతలివాళ్లను మరింత ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తుందేమో కద తల్లీ!” అన్నాడు మధనపడుతూ పోటిసుడు. సరిగ్గా అప్పుడే భూగృహం ద్వారం వద్ద ఏదో అలికిడి అయ్యింది. ముగ్గురూ అప్రమత్తులైనారు.
పోటిసుని మాటలు సౌగంధికకు కూడా రుచించలేదు. పైగా తన ప్రియునికి చేరువవుతున్న క్షణాలను ఆ మాటలు భంగపరిచినాయి. అయినా అతని మాటలు తప్పుపట్టలేనివే కానీ వాటికి సమాధానం ఆమె వద్ద ఉన్నది. “మహావీరా! కర్తవ్యం పట్ల నీ నిబద్ధత కొనియాడ దగినదే! ఈ సందర్భంలో ఆవేశపడటం కంటే సరైన అవకాశం కోసం ఎదురు చూడటమే వివేకం కదా!” అన్నది.