ఒక జాతిని నిర్వీర్యం చేయాలన్నా,ఒక ప్రాంత ప్రజలను చైతన్య రహితులను చేయాలన్నా తొలుత వారు అస్తిత్వ రాహిత్యులని, వారికి చరిత్రే లేదని ప్రచారం చేయటం వలసవాద పాలకుల నైజం. కాలం మారినా, పాలకులు మారినా నేటి ఆధునిక రాజకీయాల్లో ఆ వలసవాద అహంకార పోకడలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పటానికి ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసమో,లేదా తమ రాజకీయ అధినేతలను ప్రసన్నం చేసుకోవటానికో ఒక ప్రాంత సంస్కృతి, భాష, చారిత్రక సత్యాలను కించపరిచేలా మాట్లాడటం ఆత్మవంచన అవుతుంది. ఒక నాయకుడి రాజకీయ ప్రసంగం ఎంత అజ్ఞానంతో కూడుకున్నదో, దానికి విరుద్ధంగా చరిత్ర పుటలు, ప్రామాణిక నిఘంటువులు, శతాబ్దాల సాహిత్య గ్రంథాలు భద్రపరిచిన అక్షర సత్యాలు ఎంత శక్తివంతమైనవో నిరూపించటమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.
పార్లమెంట్ నుంచి మంగళగిరి మహానాడు వరకు: తెలంగాణ సమాజం దశాబ్దాల పాటు పోరాడి, ఎందరో అమరుల త్యాగాల పునాదులపై తన ప్రత్యేక రాజ్యాంగబద్ధమైన గుర్తింపును సాధించుకున్నది. అయితే, ఈ అస్తిత్వాన్ని నిరంతరం దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ పక్షాల కుట్రలు సాగుతూనే ఉన్నాయి. వీటికి పరాకాష్ఠగా, ఇటీవలే ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎంపీ దేశ అత్యున్నత సభ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజన ప్రక్రియను ఏకంగా ‘పాకిస్థాన్’ ఏర్పడిన ఉదంతంతో పోల్చారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న ఒక రాష్ర్టాన్ని, శత్రుదేశం ఏర్పాటుతో పోల్చటం వెనుక ఉన్న ప్రాంతీయ సంకుచితత్వం తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ గాయం మానకముందే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో మహానాడు వేదికగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు మరింత దిగ్భ్రాంతిని కలిగించాయి. ‘తెలంగాణకు అసలు చరిత్రే లేదు, డిక్షనరీల్లో తెలంగాణ అనే పదమే లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన చారిత్రక అజ్ఞానాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాయి. ఏ లబ్ధికోసమో పుట్టిన గడ్డను, ఆ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేలా మాట్లాడటం నిజంగా ఆత్మహత్యాసదృశమే.
‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు’ ఇచ్చిన తిరుగులేని అక్షర సాక్ష్యం:డిక్షనరీల్లో ‘తెలంగాణ’ అనే పదమే లేదని ప్రగల్భాలు పలికిన అహేతుక వాదనలపై ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు’ చతుర్థ సంపుటం, పేజీ నెంబర్ 32లోని సాక్ష్యం ఒక తిరుగులేని చారిత్రక ఆధారంగా నిలుస్తున్నది. భాషా చరిత్రకారులు అత్యంత ప్రామాణికంగా భావించే ఈ నిఘంటువులో ‘తెలంగాణ’ అనే పదం వందల సంవత్సరాల క్రితమే లిఖితమై భద్రంగా ఉన్నది.
ఈ నిఘంటువులోనిపేజీ 32 ప్రకారం ఆధారాలు ఇవి:పద వివరణ, వ్యుత్పత్తి: నిఘంటువులో ‘తెలంగాణము. (తెలుగు + ఆణము) తెలుగుదేశ సంబంధమైనది’ అని స్పష్టంగా నిర్వచించారు. అంటే ఈ పదం భాషాపరంగా, భౌగోళికపరంగా ఎంత ప్రాచీనమైనదో నిఘంటు కర్తలు ఎప్పుడో నిరూపించారు.
కావ్య ప్రయోగాలు: ఈ పదానికి కేవలం అర్థం మాత్రమే ఇవ్వకుండా, ప్రాచీన సాహిత్య ప్రయోగాన్ని కూడా ఉదహరించారు. నిఘంటువులో ‘సీ. తెలంగాణ భూములఁ గల మన్నెవారిచే…వి.పు.1.41.’ అని పేర్కొన్నారు. ఇది ప్రాచీన గ్రంథాల్లో తెలంగాణ అనే పదం ఎంత సహజంగా ప్రయోగించారో చాటిచెబుతున్నది.
శాసన ఆధారాలు: అన్నింటికంటే ముఖ్యమైన చారిత్రక సత్యం ఏమిటంటే.. ‘శాసనములలోఁ ’తెలుంగాణము’ అని కన్పట్టుచున్నది’ అని ఈ నిఘంటువు స్పష్టంగా నమోదు చేసింది. రాజకీయ నాయకులు మాట్లాడే తాత్కాలిక అబద్ధాల కంటే, శతాబ్దాల క్రితం రాజులు, చక్రవర్తులు చెక్కించిన శిలాశాసనాల్లోని అక్షరాలు ఎంతో శక్తివంతమైనవి. ఈ నిఘంటువు సాక్ష్యం ప్రకారం తెలంగాణ అనే పదం ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన రాజకీయ పదం కాదు, అది యుగయుగాలుగా శాసనాలు, నిఘంటువుల్లో సజీవంగా ఉన్న అక్షర సత్యం.
సాహిత్య సాక్ష్యాలు:తెలంగాణ మేధావుల అంతర్ దృష్టికేవలం నిఘంటువుల పరిధిలోనే కాకుండా, తెలంగాణ సంస్కృతి, సాహిత్య పుస్తకాల్లో ఈ నేల విశిష్టత, ప్రాచీనత అనాదిగా నిక్షిప్తమై ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, భాషా చైతన్యాన్ని కాపాడటానికి ఇక్కడి కవులు, పరిశోధకులు, మేధావులు తమ రచనల ద్వారా తిరుగులేని సాహిత్య ఆధారాలను అందించారు.
1. పాల్కురికి సోమనాథుడు -దేశీ భాషా విప్లవ ఆద్యుడు : తెలంగాణ నేల కేవలం చరిత్ర కలిగినది మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికి దేశీ రూపురేఖలు దిద్దిన విప్లవాత్మక నేల. 12వ శతాబ్దంలోనే పాలకుర్తి మట్టిలో జన్మించిన పాల్కురికి సోమనాథుడు సంస్కృత భూయిష్టమైన అహంకారాన్ని, రాచరికపు కావ్య పద్ధతులను ధిక్కరించారు. సామాన్య ప్రజలు మాట్లాడుకునే ‘జాను తెనుగు’ (తేటతెలుగు) భాషలోనే కావ్యం రాస్తానని ప్రకటించి, ‘బసవ పురాణం’, ‘పండితారాధ్య చరిత్ర’ వంటి అద్భుత గ్రంథాలను అందించారు. నాటి తెలంగాణ పల్లెల్లోని తుమ్మెద పదాలు, వెన్నెల పదాలు వంటి జానపద గేయాలకు కావ్య గౌరవం కల్పించిన తొలి ప్రజాకవి సోమనాథుడు. శతాబ్దాల క్రితమే భాషా చైతన్యానికి కేంద్రంగా తెలంగాణ నిలిచిందనటానికి సోమనాథుని ‘జాను తెనుగు’ ఉద్యమమే సాక్ష్యం.
2. బమ్మెర పోతన -మట్టి సంస్కృతి ప్రతీక:తెలంగాణ నేలపై పుట్టి, నడయాడిన మరో మహాకవి బమ్మెర పోతన.శ్రీమదాంధ్ర భాగవతాన్ని తెనిగించి, దానిని ఏ రాజులకో, పాలకులకో అంకితమిచ్చి భోగభాగ్యాలు అనుభవించటానికి ఆయన నిరాకరించారు. రాచరికపు అహంకారాన్ని ధిక్కరించి, తన గ్రంథాన్ని భగవంతుడికే అంకితం చేసిన నిఖార్సయినమట్టితత్వం పోతనది. తెలంగాణప్రాంత సహజసిద్ధమైన భక్తితత్వం, స్వేచ్ఛా ప్రియత్వం, ధిక్కార స్వరానికి పోతన భాగవతమే అత్యున్నత సాహిత్య సాక్ష్యం.
3. సురవరం ప్రతాపరెడ్డి -చారిత్రక పరిశోధనా పటిమ:‘తెలంగాణలో కవులు లేరు’ అని నాటి పరాయి ప్రాంత పండితులు అవహేళన చేసినప్పుడు, ఆ సవాల్‌ను స్వీకరించి, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన 354 మంది తెలంగాణ కవుల వివరాలు, వారి పద్యాలతో ‘గోల్కొండ కవుల సంచిక’ను వెలువరించి విమర్శకుల నోళ్లు మూయించారు. అలాగే, ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు గ్రంథంగా నిలిచింది. ఈ గ్రంథంలో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని చారిత్రక ఆధారాలతో సహా సురవరం నిరూపించారు.
4. ప్రజాకవి కాళోజీ నారాయణరావు -అస్తిత్వ గొంతుక:‘నా గొడవ’ కావ్యాల ద్వారా తెలంగాణ ప్రజా జీవితాన్ని, వారి భాషను అక్షరబద్ధం చేసిన ప్రజాకవి కాళోజీ. ‘రెండు ముక్కలైనావు తెలంగాణమా… ఎన్నాళ్లు దాగుంటది ఈ నల్లని నిజం’ అంటూ తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక విభజనపై ఆయన గొంతు విప్పారు. తెలంగాణ భాషను, యాసను కించపరిచే వారిని హెచ్చరిస్తూ-‘పరభాషల జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ మాతృభాషను, నీ యాసను వదులుకోకు’ అని చాటిన కాళోజీ నిరంతరం తెలంగాణ అస్తిత్వ రక్షణ కవచంగా నిలిచారు.
5. ఆచార్య జయశంకర్ -సిద్ధాంత భూమిక:తెలంగాణ భావజాలాన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్లిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్. ‘తెలంగాణలో ఏం జరుగుతున్నది?’ అనే విషయాన్ని భౌగోళిక, ఆర్థిక, ఉద్యోగ రంగాల వారీగా గణాంకాలతో సహా ప్రపంచానికి చూపించారు. తెలంగాణ కేవలం ఒక ప్రాంతం కాదు, అదొక సజీవ సామాజిక ఆకాంక్ష అని ఆయన నిరూపించారు.
6. సుంకిరెడ్డి నారాయణరెడ్డి – సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం:ఆధునిక కాలంలో తెలంగాణ సాహిత్య, చారిత్రక వారసత్వాన్ని సమగ్రంగా గ్రంథస్థం చేసిన ప్రముఖ పరిశోధకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన రాసిన ‘తెలంగాణ చరిత్ర’, ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ వంటి పుస్తకాలు తెలంగాణకు ఉన్న ప్రత్యేకమైన సాహిత్య అస్తిత్వాన్ని, వేల సంవత్సరాల పరిణామ క్రమాన్ని ప్రామాణిక ఆధారాలతో సహా నిరూపించాయి.
రాజకీయ చైతన్యం -అస్తిత్వ పోరాట రూపం (కేసీఆర్):సాహిత్యకారులు, మేధావుల పుస్తకాల్లో సజీవంగా ఉన్న తెలంగాణ అస్తిత్వ భావజాలాన్ని ఒక శక్తివంతమైన రాజకీయ ఉద్యమంగా మార్చి, ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కి దక్కుతుంది. ఆచార్య జయశంకర్ అందించిన బౌద్ధిక, శాస్త్రీయ విశ్లేషణలను ఆయుధంగా మలచుకుని, నాడు ఢిల్లీ పాలకుల గుండెల్లో నిద్రపోయిన వ్యూహకర్త ఆయన. ‘తెలంగాణ తెచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’ అంటూ సాగించిన ఆమరణ నిరాహార దీక్ష, తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి అపూర్వమైన ప్రజా చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ అనే పదం కేవలం నిఘంటువులకే పరిమితం కాలేదని, అది కోట్లాది మంది ప్రజల శతాబ్దాల స్వయంపాలన కాంక్ష అని, దానిని ఏ శక్తీ ఆపలేదని కేసీఆర్ నాయకత్వంలోని మలిదశ ఉద్యమం దేశ చరిత్రలోనే నిరూపించింది.
చారిత్రక వైరుధ్యం:మద్రాస్ ప్రెసిడెన్సీ వర్సెస్ తెలంగాణ:1952కు పూర్వం ఆంధ్ర ప్రాంతం అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో కేవలం ఒక భాగంగా మాత్రమే ఉండేది. 1953లో మాత్రమే ‘ఆంధ్ర రాష్ట్రం’ అనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ, అంతకంటే వందల, వేల సంవత్సరాల ముందే తెలంగాణ నేలకు శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, బహమనీ సుల్తాన్లు, కుతుబ్‌షాహీలు, నిజాం నవాబుల కాలం నాటి సుదీర్ఘమైన, స్వతంత్రమైన పరిపాలనా చరిత్ర ఉన్నది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికియాలలో లభించిన జీనవల్లభుని బొమ్మలమ్మగుట్ట శిలాశాసనం ద్వారానే తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా లభించిందనే సత్యం జగమెరిగినది. తెలుగు భాషకు పునాది వేసిన నేల తెలంగాణ. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మన దేశ విప్లవ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇంతటి త్యాగాల, వీరుల రక్తం చిందిన నేలను చరిత్ర లేనిదనటం కేవలం చారిత్రక దారిద్య్రమే అవుతుంది.
‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు’ సాక్ష్యాలు, సోమనాథుడు, పోతన నుంచి సుంకిరెడ్డి వరకు ఉన్న సాహిత్య గ్రంథాల ఆధారాలు తెలంగాణ అస్తిత్వాన్ని సజీవంగా కాపాడుతూనే ఉంటాయి. నిఘంటువుల్లో భద్రపరచిన అక్షర సత్యాలు, ప్రజా హృదయాల్లో నిలిచిన చారిత్రక అస్తిత్వం ఎప్పటికీ చెరిగిపోవు.
-కాళేశ్వరం కృష్ణమూర్తి
9705196097