నగల్లోనే కాదు, ఇంటీరియర్ డెకరేషన్‌లోనూ యాంటిక్ లుక్‌ని ఇష్టపడుతున్నది నేటి తరం. ఎంత అల్ట్రామోడ్రన్ ఇల్లు అయినా సరే, ఎక్కడో ఒక చోట పాత తరపు సంప్రదాయాలూ ఉట్టిపడాలన్న ఆలోచనతో ఉంటున్నది. దానికి తగ్గట్టే ఇంటీరియర్ డిజైనర్లతోపాటు, మెటీరియల్ తయారీ సంస్థలూ పనిచేస్తున్నాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న శేరెలు అలా తరాలనాటి అభిరుచిని నేడు నట్టింట్లో కనిపించేలా చేసేవే.
మనకు కొన్ని నచ్చుతాయి. అవి ఎన్నాళ్లయినా పాతబడవు. పాతబడ్డా మళ్లీ అవే కొత్తగా కావాలని అనిపిస్తాయి. ఒకప్పటి గృహాలంకరణలో వాడే రకరకాల చెక్క నగిషీలు అలాంటివే. మన అభిరుచినీ, కళాకారుల నైపుణ్యాన్నీ పొందిగ్గా చూపిస్తాయివి. ఇంటికి రాజసపు రంగేస్తాయి. అతిథులకు ఆనాటి సంగతుల్ని గుర్తు చేస్తాయి. గడపకు చేరువగా, పంచన ముచ్చటగా చేరే శేరెలు… అప్పుడెప్పటివో మాత్రమే కాదు, ఇప్పటి కొత్త ఇళ్లలోవి కూడా. తరాల నాడు వాకిళ్లని వైనంగా అలంకరించిన అవి ఇప్పుడు మరోసారి తమ వైభవాన్ని చాటుకుంటున్నాయి. పాతకాలపు ఇండ్లలో కనిపించే ఇవి ఇప్పుడు కొత్తింటి గృహప్రవేశానికి హాజరవుతున్నాయి.
కొత్త గూటికి పాత వాసనలు అద్దే ఈ శేరెలు ఎన్నో వెరైటీల్లో రూపుదిద్దుకుంటున్నాయి. అబ్బురపరచే రాయంచలు, చూడ చక్కని చిలుకలు, అందమైన నెమళ్లు… ఇలా రకరకాల పక్షులకు వీటిలో ప్రత్యేకంగా స్థానం కల్పిస్తున్నారు. ఇవి కాక ఏనుగులు, గుర్రాలు, సింహాలు కూడా శిల్పాల సౌందర్యాన్ని మూటగట్టుకుని ముచ్చటగా ముస్తాబవుతున్నాయి. ఇక, వీటిని ఎక్కడ అలంకరించాలన్నదీ అభిరుచిని బట్టే. కొందరు ద్వారబంధంలో ఇమిడ్చేస్తే, మరి కొందరు సింహ ద్వారానికి అటూ ఇటూ అమర్చుతున్నారు. హాలు ఆర్చికి హుందాతనాన్ని తెచ్చేలా కొందరు పొందిక చేస్తున్నారు. అదీ కాదంటే లివింగ్ రూమ్, బాల్కనీ, దేవుడి మందిరం… ఇలా నచ్చిన చోట, బాగా నప్పిన చోట వీటిని అలంకరించి పాత నగిషీల పట్ల తమ ఇష్టాన్ని చాటుకుంటున్నారు. చూడగానే ఏ మందిరాన్నో, మరే తాతలకాలం నాటి ఇంటినో స్ఫురణకు తెస్తాయివి. ఇంగ్లీషులో కోర్బెల్ లేదా వాల్ బ్రాకెట్లుగా పిలిచే వీటిని అమెజాన్, ఎట్సీ సహా వివిధ ఆన్లైన్ వెబ్సైట్లు అమ్మకానికి పెడుతున్నాయి. అచ్చంగా చెక్క రంగులో ఉండే వాటితో పాటు, విభిన్న రంగులూ, రకరకాల డిజైన్లలో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. ఇంకేం, వీటిని చూసిన వాళ్లంతా నచ్చే‘శేరే’ అనేస్తున్నారట!