‘సార్.. ఇక్కడ ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొన్నారు. మీరు త్వరగా రండి’ ఫోన్లో కంగారుగా చెప్పాడు హోటల్ మేనేజర్ రవికాంత్. వెంటనే తన సిబ్బందితో క్రైమ్ స్పాట్‌కు చేరుకొన్నాడు రుద్ర. ‘మీరేనా ఫోన్ చేసింది’ రుద్ర ప్రశ్న. ‘అవును సార్’ బదులిచ్చాడు మేనేజర్. ‘ముందు ఈ విషయం ఎవరికి తెలిసింది?’ అనడిగాడు ఇన్స్పెక్టర్. ‘మా పెద్దన్నయ్య కూతురు ఏంజెల్‌కి’ బదులిచ్చాడు మేనేజర్.
‘వాట్..?’ కాస్త అయోమయంగా అన్నాడు రుద్ర. ‘సార్! మరేంలేదు. ఆ చనిపోయిన ముగ్గురు స్టూడెంట్స్, ఏంజెల్ ఒకే కాలేజీలో చదువుతున్నారు. ప్రేమ, ప్రేమ అంటూ ఏంజెల్‌ని వాళ్లు ముగ్గురూ తరుచూ వేధిస్తూ ఉండేవారు. అబ్బాయిల కుటుంబ సభ్యులతోనూ ఈ విషయంపై మాట్లాడాం. వాళ్లు కూడా అబ్బాయిలకు ఎంతో సర్దిచెప్పారు. అయినా వాళ్లలో మార్పురాలేదు. ఏంజెల్ కోసం ముగ్గురు కొట్టుకొనేవరకూ వెళ్లారు. ఇదే విషయమై కాలేజ్‌లో డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంది’ చెప్తూ పోయాడు మేనేజర్. ‘నిజానికి ముగ్గురు అబ్బాయిలూ చదువుల్లో టాపర్లు. అయితే, ఈ గొడవలతో ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యే పరిస్థితికి దిగజారారు. దీంతో నా సలహా మేరకు ఏంజెల్ వాళ్లకు ఒక ఆఫర్ ఇచ్చింది’ అంటూ చెప్తున్న రవికాంత్ మాటలపై రుద్ర మరింత ఆసక్తిని కనబరుస్తూ.. ‘ఏంటది?’ అని ప్రశ్నించాడు. ‘వచ్చే ఎగ్జామ్‌లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే, వాళ్లను ప్రేమిస్తానని ఏంజెల్ ఆఫర్ ఇచ్చింది. రేపే ఎగ్జామ్. ఇంతలో ఇలా వీళ్లు సూసైడ్ చేసుకొని కనిపించారు’ అంటూ బాధపడుతూ చెప్పాడు మేనేజర్.
‘సార్.. ఇదంతా నమ్మశక్యంగాలేదు’ తేల్చేశాడు రామస్వామి. ఇంతలో పక్కనే ఉన్న ఏంజెల్‌ని రుద్ర ప్రశ్నించగా.. ‘సార్. ఈ రోజు మార్నింగ్ ముగ్గురికి నేనే వేర్వేరుగా ఫోన్ చేశా! ‘ఎలా ప్రిపేర్ అయ్యారు’ అని అడిగా. ‘నేను ఓడిపోతే, నన్ను మరిచిపోతావా? ఏంజెల్??’ అంటూ ముగ్గురూ దీనంగా అడిగారు. నాకు ఏడుపొచ్చింది. వాళ్లది స్వచ్ఛమైన ప్రేమ. కాబట్టి ఏమీ చెప్పలేక ఫోన్ పెట్టేశా. అంతే. తర్వాత ఎంత ప్రయత్నించినా ముగ్గురూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదే విషయం చిన్నాన్న రవికాంత్‌కు చెప్పా. కంబైన్డ్ స్టడీ కోసమని ముగ్గురూ తన హోటల్‌కే వచ్చారని చిన్నాన్న చెప్పాడు. దీంతో నేను ఇక్కడికి వచ్చా. రూమ్ డోర్ ఎంత కొట్టినా తీయలేదు. కిటికీలోంచి చూస్తే ముగ్గురూ చనిపోయి కనిపించారు. నన్ను విడిచిపెట్టి వెళ్లలేకే ఇలా విషం తాగారు సార్..’ అంటూ బోరుమంది ఏంజెల్. వాళ్లు చెప్పిన విషయాలను నమ్మాలా? వద్దా? అనుకొంటూ లోపలికి వెళ్లిన రుద్రకు.. గదిలో మూడు పాయిజన్ బిల్స్ దొరికాయి. దీంతో ఈ ముగ్గురి మరణానికి విషం కారణమై ఉంటుందని రుద్రకు అర్థమయ్యింది. వివరాలు నమోదు చేసుకొన్న రుద్ర.. పోస్ట్‌మార్టం నివేదిక కోసం వెయిట్ చేశాడు.
రెండ్రోజులు గడిచాయి. ముగ్గురు అబ్బాయిలు ఒకే రకమైన విషం వల్ల చనిపోయినట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. అయితే, గదిలో వేర్వేరు పాయిజన్ బిల్లులు ఎందుకు ఉన్నాయన్న విషయం రుద్రకు అంతుచిక్కలేదు. ఇంతలో పెండింగ్ కేసును పక్కనబెట్టి తనలో తానే నవ్వుకొంటున్న హెడ్ కానిస్టేబుల్ రామస్వామిని విషయమేంటని కాస్త కోపంగా అడిగాడు రుద్ర.
‘ఏం లేదు సార్.. ఈ ఫొటోలో ఉన్నది ఓ పర్షియా యువరాణి. పేరు జహ్రా కనోమ్. యువరాణి గారు ఎలా ఉన్నారో చూశారుగా..’ సోషల్‌మీడియాలో ఓ పోస్టును ఫోన్లో చూపిస్తూ సన్నగా నవ్వాడు రామస్వామి. ‘విషయంలోకి రా.. బాబాయ్’ అసహనంగా అన్నాడు రుద్ర. ‘అదే సార్ చెప్తున్నా.. ఈ సందరాంగి తమను పెండ్లాడటానికి నిరాకరించిందని ఏకంగా 13 మంది యువరాజులు తమ ప్రాణాలను తీసుకొన్నారట. పిచ్చికాక మరేమిటి??’ అంటూ నవ్వుతున్నాడు రామస్వామి. దీనికి మరో కానిస్టేబుల్ స్పందిస్తూ.. ‘అందం కాదు. మనసు చూడాలి సార్. కొందరు బయటకు అందంగా కనిపించినా.. లోపల వారి మనసు క్రూరంగా ఉంటుంది. మరికొందరు బయటకు వికారంగా కనిపించినా వారి మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది’ అంటూ చెప్తూపోయాడు.
మధ్యలో కలుగజేసుకోబోయిన రామస్వామి వైపు చూస్తూ.. ‘బాబాయ్.. అసలు ఏం జరుగుతుంది? కేసు పక్కనబెట్టి ఈ పిచ్చి సోది ఏంటి?’ అని కోపగించుకొంటున్న రుద్ర మెదడులో ఏదో అనుమానం కలిగింది. ‘అందం. మనసు. స్వచ్ఛత. వికారం. క్రూరత్వం’ అన్న కానిస్టేబుల్ మాటలే రుద్ర చెవిలో మార్మోగుతున్నాయ్. ఇంతలో రుద్రకు ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఏంజెల్, రవికాంత్, చనిపోయిన ముగ్గురు స్టూడెంట్స్ కాల్ రికార్డింగ్‌లు బయటకు తీయించాడు. ఏంజెల్‌ను, రవికాంత్‌ను లోపలేశాడు. ఇంతకీ, వాళ్లే.. ఈ ముగ్గురి చావుకు కారణమని రుద్ర ఎలా కనిపెట్టి ఉంటాడు?
రూమ్‌లో వేర్వేరు పాయిజన్ బిల్లులు ఉన్నప్పటికీ, ముగ్గురూ ఒకే విషాన్ని తాగడం ఏమిటని రుద్ర తొలుత అనుమానపడ్డాడు. ఫోరెన్సిక్ టీమ్ వాళ్లు నిర్ధారించక ముందే రవికాంత్ వీళ్లది ఆత్మహత్య అని చెప్పడం అతని అనుమానాన్ని మరింత బలపడేలా చేసింది. దీంతో అందరి కాల్ డేటా తీశాడు. ఏంజెల్ అందగత్తె. తన అందంతో శ్రీమంతుల అబ్బాయిలను తనవైపు తిప్పుకొని డబ్బు దండుకోవడంలో ఆరితేరింది. వరుసకు బాబాయ్ అయ్యే రవికాంత్‌కు ఆమెకు అక్రమ సంబంధం కూడా ఉంది. రవికాంత్, ఏంజెల్ కలిసే ఈ ముగ్గురు అబ్బాయిలను ముగ్గులోకి దింపారు. అందినకాడికి దోచుకొన్నారు. అయితే, రవికాంత్, ఏంజెల్ మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ముగ్గురూ గుర్తించారు. అది బయటపడకుండా ఉండేందుకే ఇద్దరూ కలిసి పాయిజన్ నాటకం ఆడారు. దీనికి తన హోటల్‌నే అడ్డాగా మార్చుకొన్నాడు రవికాంత్. ఎవరికీ అనుమానం రాకుండా అబ్బాయిల పేర్లతో బిల్లులు తెప్పించాడు. అయితే, ఒకే విషాన్ని ఇవ్వడమే కాకుండా పోలీసులు నిర్ధారించడానికి ముందే సూసైడ్ అని చెప్పి దొరికిపోయాడు.
…? రాజశేఖర్ కడవేర్గు