మంచి ఉద్యోగం సాధించాలనుకునే యువతలో చాలామంది సాఫ్ట్వేర్ రంగంవైపు మొగ్గు చూపుతున్నారు. పేరెన్నికగన్న సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయగలిగే వెసులుబాటు, ఆకర్షించే ప్యాకేజీలు, వివిధ సౌకర్యాలు నేటి తరాన్ని దీనివైపు చూసేలా చేస్తున్నాయి. అయితే సాఫ్ట్వేర్ కొలువు
కావాలంటే ఇంజినీరింగ్ పూర్తి చేయాల్సిన అవసరమే లేదనీ, ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే దాన్ని ఒడిసిపట్టొచ్చనీ చెబుతున్నది ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్. ఇందుకుగానూ టెక్బీ పేరిట ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ (త్వరగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే కార్యక్రమం)ను తీసుకువచ్చింది. ఇప్పటి దాకా పదివేల మంది దీని ద్వారా కొలువు సాధించారు.
ఓటీటీలో సాధారణంగా ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, అవి పూర్తయ్యేనాటికే ఇటు సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా, వృత్తిపరమైన అనుభవం గడించేలా నవ యువతను ఉద్దేశించి ప్రోగ్రామ్‌ను తయారు చేసింది హెచ్‌సీఎల్ సంస్థ. ఈ టెక్బీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతతో పాటు పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు కూడా ముందుగానే ఉద్యోగ జీవితం ప్రారంభిస్తున్నారు. ఎవరు ఎక్కువ అనుభవం, నైపుణ్యాలు కలిగి ఉంటే వాళ్లకే అవకాశాలు వరుస కడుతున్న నేపథ్యంలో ఇలా ఇంటర్ పూర్తవుతూనే కొలువులో చేరడం అన్నది ఆర్థిక స్వావలంబనకు గట్టి పునాది అవుతుంది. తొలిగా 2016 సంవత్సరంలో ఈ కార్యక్రమం భారత్‌లో ప్రారంభమవగా, 2019లో తెలంగాణలో మొదలైంది. ఇప్పటి వరకూ రాష్ట్రం నుంచి రెండు వేల మంది ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా చూసుకుంటే 10 వేలమంది దీని ద్వారా కొలువు సాధించారు.
జీవితంలో స్థిరపడాలన్నా, పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు నిర్వహించాలన్నా అనుభవంతో పాటు చదువు కూడా చాలా ముఖ్యమే. అందుకే టెక్బీ కార్యక్రమంలో చేరిన వారికి పేరెన్నికగన్న విద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది హెచ్‌సీఎల్ సంస్థ. టెక్‌బీలో ఏడాది శిక్షణ ఉంటుంది. అందులో ఆరు నెలలు తరగతి గది శిక్షణ అయితే మరో ఆరు నెలలు సంస్థలో ట్రైనింగ్ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంస్థలో డెవలపర్, డేటా ఇంజినీర్, ఎనలిస్ట్ తదితర పోస్టుల్లో ప్రాథమిక స్థాయిలో నియామకం ఉంటుంది. అయితే తొలి ఏడాది శిక్షణ పూర్తయిన తర్వాత బిట్స్ పిలాని, ఐఐఎం, ఐఐటీల్లాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంటెక్ లాంటి కోర్సులు చదువుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో తరగతులకు హాజరై రెగ్యులర్ తరహాలోనే పట్టా అందుకోవచ్చు. అంతేకాదు, ఆ కోర్సుల కోసం అయ్యే ఖర్చులోనూ హెచ్‌సీఎల్ సంస్థ కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. అంటే నేరుగా చదువుకున్న దానితో పోలిస్తే తక్కువ ఖర్చులోనే వీటిని పూర్తి చేయొచ్చు. అయితే ఈ టెక్ బీ ప్రోగ్రామ్‌లో ఎంపిక అవ్వాలంటే ఏం చేయాలి, వేతనాలు ఎలా ఉంటాయి, ఎక్కడ చదువుకోవచ్చు, ఏయే పోస్టులు ఇస్తారు తదితర అంశాలను క్షుణ్నంగా తెలుసుకుందాం.
మాది నల్లగొండ. 2019లో హెచ్‌సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్‌లో చేరాను. ఏడాదిలో కోర్సు పూర్తయింది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాను. దాంతో పాటే బిట్స్ పిలానీ నుంచి బీఎస్సీ డిజైనింగ్ అండ్ కంప్యూటింగ్‌లో నాలుగేళ్ల టెక్నికల్ డిగ్రీని పూర్తి చేశాను. చాలా చిన్న వయసులోనే నా కాళ్ల మీద నేను నిలబడటంతో మా కుటుంబం ఎంతో సంతోషించింది. మరో పక్క నేను ప్రపంచస్థాయి టెక్ బృందాలతో కలిసి పనిచేస్తున్నాను. ఇది నా కెరీర్‌కు మంచి మార్గం వేసిందని భావిస్తున్నాను. అందుకే నాలాంటి మరో నలుగురితో కూడా ఈ విషయం పంచుకుంటూ ఉంటాను.
– సాయి సత్యజిత్
మా సొంత ఊరు ఖమ్మం. ఇంటర్మీడియెట్ తర్వాత హెచ్‌సీఎల్ వాళ్ల కార్యక్రమం గురించి విని ఐప్లె చేశాను. అందులో ఎంపికయ్యాను. నాకు సాఫ్ట్వేర్ కెరీర్ అంటే తొలి నుంచీ ఆసక్తి. దాన్ని కొనసాగించడానికి టెక్ బీ ఒక మంచి వేదికలా తోచింది. అందుకే కోర్సులో చేరాను. ఇప్పుడు బిట్స్‌పిలానీ నుంచి బీఎస్సీ చదువుతున్నాను. ఇక ఈ కోర్సు, ఉద్యోగం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఎక్కడ నేర్చుకోగలమో అక్కడే సంపాదించగలం. ఎంత నేర్చుకుంటే మన కెరీర్ అంత బాగుంటుంది. ఇక్కడ నేర్చుకుంటూ సంపాదించుకోవచ్చు. ఒక పక్క ఆఫీస్, మళ్లీ చదువు ఎలా అనుకోవచ్చు. కానీ ఈ వాతావరణం అందుకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. నేను రెండూ చక్కగ మేనేజ్ చేస్తున్నా.
– వీరబోయిన భానుతేజ
సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలంటే స్కిల్స్ చాలా అవసరం. వాటిని చిన్న వయసులోనే నేర్చుకునేందుకు నాకు టెక్బీ మంచి మార్గంలా తోచింది. అందుకే అందరికన్నా భిన్నంగా ఒకింత ధైర్యం చేసి ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే ఇందులో చేరాను. ఇక్కడ ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. చదువుకోవడం అయినా ఉద్యోగం చేయడం అయినా అంతా కెరీర్‌కి పనికొచ్చేలాగే సాగుతుంది. ఇక, మాది పెద్దపల్లి జిల్లా. 2021లో ఈ కోర్సులో చేరాను. అది విజయవంతంగా పూర్తి చేసుకుని ఉద్యోగంతో పాటు బిట్స్ పిలానీ బీఎస్సీలో చేరాను. ఇప్పుడు నేనొక సాఫ్ట్వేర్ డెవలపర్. టెక్ బీ నాకు నైపుణ్యాలు నేర్పడమే కాదు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
– బంగారి గాయత్రి
Hcl Students
ఇంటర్మీడియెట్ 75 శాతంతో ఉత్తీర్ణత. గణిత శాస్త్రంలో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. చదువు పూర్తయిన ఏడాదిలోపు వాళ్లు అర్హులు.
టెక్బీ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసుకున్న వాళ్లు ముందుగా ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ల ఆధారంగా సంస్థ పెట్టే తొలి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
కోర్సుకు ఎంపికైన వాళ్లు ఐటీ ఉద్యోగాల కోసం 1.40 లక్షల రూపాయలు, అసోసియేట్ రోల్స్ కోసం 51 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం సంస్థ బ్యాంక్‌లోన్ ఇప్పిస్తుంది.
శిక్షణ సమయంలో నెలకు 10 వేల రూపాయల ైస్టెఫండ్ అందజేస్తారు. ఉద్యోగంలో చేరాక పోస్టును బట్టి రూ.1.96-2.20 లక్షల మధ్య వేతనం లభిస్తుంది.
దాంతో పాటు మెడికల్ ఇన్సూరెన్సు, రెగ్యులర్ హెల్త్ చెకప్ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.
ఐఐటీ గౌహతి, బిట్స్ పిలానీ- పిలానీ, దుబాయ్, గోవా, హైదరాబాద్, ఐఐఎం కొట్టాయం, ఐఐఎం సిర్మౌర్, శాస్త్ర యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీలు.
పైన చెప్పిన సంస్థల్లో మూడేండ్ల కోర్సులో (బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ తదితరాలు) చేరితే ఆ ఫీజులో ఏడాదికి 30 వేల రూపాయల చొప్పున సంస్థ చెల్లిస్తుంది. అలాగే నాలుగేండ్ల కోర్సు (బీఎస్సీ)లో చేరితే మొత్తం 1.4 లక్షలు, ఆరేళ్ల కోర్సు (ఎంటెక్)కు 2.4 లక్షల రూపాయలు ఇస్తారు.
హెసీఎల్ టెక్బీ కార్యక్రమానికి ఏడాది పొడవునా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ కింది లింక్ ద్వారా అభ్యర్థులు ఈ కోర్సు కోసం ఐప్లె చేసుకోవచ్చు.
లింక్: https://www.hcltechbee.com/job-programs/