తెలుగు లోగిళ్లలో కలబంద అతి సాధారణంగా కనిపిస్తుంది. కలబంద అన్ని రకాల నేలల్లో, చిన్న కుండీల్లోనూ పెరుగుతుంది. ఇది ఎడారి మొక్క. ఎక్కువ సూర్యరశ్మిలో పెరుగుతుంది. ఎప్పుడన్నా.. నీళ్లు పోస్తే సరిపోతుంది. అతి శీతలం తట్టుకోలేదు. దీనిని ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. గాలిలో తేమను గ్రహించి జీవించగలదు. వేసవిలో పూలు పూస్తాయి. ఇంటికి దిష్టి తగలకుండా కలబందను కుండీల్లో పెంచుకుంటారు.
కలబంద ఆకులతో నిండి కాండం కనిపించకుండా ఉంటుంది. ఆకులు దళసరిగా ఉన్న కత్తిని పోలి ఉంటాయి. ఈ ఆకులో ఉండే గుజ్జు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కలబంద గుజ్జు కాలిన గాయాలపై పై పూతగా రాస్తే ఉపశమనం కలిగిస్తుంది. పిప్పిళ్లకు, దంత క్షయానికి కారణమైన బ్యాక్టీరియాను కలబంద జెల్ నివారిస్తుంది. కలబంద గుజ్జులో చెక్కర కలిపి సేవిస్తే శరీరానికి చలువ చేస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. కలబంద గుజ్జు ఉడికించి వాపులు, గడ్డలపై పెడితే తగ్గుతాయి. సెగ రోగం, గనేరియా వ్యాధులూ తగ్గుతాయి. మలబద్ధకం, కాలేయ, చర్మ వ్యాధుల నివారణలోనూ వాడతారు.
ఈజిప్టు రాణి క్లియోపాత్రా కాలంలోనే ఈ కలబంద గుజ్జు వాడినట్లుగా చరిత్ర చెబుతున్నది. కలబంద గుజ్జును సౌందర్య సాధన కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కలబంద గుజ్జుకు పసుపు జోడించి ముఖానికి రాసి, పది నిమిషాల్లో ముఖం కడిగితే ముఖం కొత్త కాంతులీనుతుందంటారు. చర్మ సౌందర్యం కోసం ఆకులో గుజ్జును ముల్తానీమట్టితో కలిపి పూస్తే మృతకణాలను మాయం చేస్తుంది. ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగనిగలాడేలా చేస్తుంది. అలొవెరా జెల్ అంటే కలబంద గుజ్జే. దీనితో ఫేస్ ప్యాక్లూ, స్కిన్ ప్యాక్లే కాదండోయ్.. అలొవెరా జ్యూస్లూ తయారుచేసి మార్కెట్లో అమ్ముతున్నారు. కలబంద కుదురులో అనేక పిలకలు వేస్తుంది. చిన్నచిన్న పిలకలు పీకి జూన్, జూలై మాసాల్లో రైతులు నాటతారు. ఈ పంటను ఆయుర్వేద మందుల తయారీదార్లకు, సౌందర్య సాధనాల తయారీ సంస్థలకు సరఫరా చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు