భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మహోజ్వల విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్ధిస్తుందని విశ్వసించి ఆ దిశలో బ్రిటిష్ ఆధిపత్యంపై పోరు చేసి అమరుడైన తెలుగుబిడ్డ. అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని, వీరగాథను, సాహసోపేత పోరాటాలను తరతరాలకు గుర్తుండిపోయేలా దృశ్యకావ్యంగా ఆవిష్కరించాలని సంకల్పించిన నటశేఖర కృష్ణ అందుకు ఉద్యమించారు. అంతకు ముందే ఎన్.టి.రామారావు సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో అది ప్రారంభం కాలేదు. త్రిపురనేని మహారథి కథ, సంభాషణలతో రూపుదిద్దుకున్న కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని ఆయన సోదరులు జి.హనుమంతరావు, జి. ఆదిశేషగిరిరావులు నిర్మించగా అగ్రేసర దర్శకుల్లో ఒకరైన వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ప్రారంభం నుంచీ అన్ని సంచలనాలను నమోదు చేసింది. తొలుత అల్లూరి పాత్రలో కృష్ణ ఎలా మెప్పిస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లకు 175 రోజులు ఆడటమేకాదు కోటి రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా నిలిచి, రికార్డు సాధించింది. అంతేకాదు, సినిమా స్కోప్లో రూపొందిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే! ఇంకా శ్రీశ్రీకి జాతీయ పురస్కారాన్ని అందించింది, భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, తాష్కంట్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుంది ఈ సినిమా. అంతేకాదు రాముడు, కృష్ణుడు అంటే ఇలానే ఉంటాడు అంటూ నందమూరి ఖాయం చేసినట్టు… అచ్చంగా అల్లూరిగా నటశేఖర కృష్ణ ఈ చిత్రంతో ఖ్యాతి పొందారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక అల్లూరి విగ్రహాలు ఆ విషయాన్ని చెబుతాయి కూడా!
ఈ వీరరస ప్రధానమైన ఈ చిత్రం కోసం డా॥సి.నారాయణరెడ్డి ‘వస్తాడు నారాజు ఈరోజు’ అనే లలిత సుందర ప్రణయ గీతం రాశారు. ఈ చిత్రకథ ప్రకారం అల్లూరి సీతారామరాజు పేరులోని ‘సీత’ అనే అమ్మాయి రామరాజును ప్రేమిస్తుంది. వీరి ప్రణయబంధం వివాహబంధంగా మారేవేళలో కర్తవ్యపథగామి అయిన రామరాజు పోరాటం వైపునకు మరలుతాడు. ఆయన ఆశయాన్ని గౌరవించిన సీత ఆత్మార్పణంతో పంచభూతాల్లో కలిసిపోతుంది. అల్లూరి రామరాజు ఈమె పేరుతోనే ‘సీతారామరాజు’ అయ్యాడని చిత్రకథ చెబుతుంది. సన్నివేశం విన్న ఒక్కపూటలోనే పూర్తిచేసిన ఈ గీతం గురించి చెబుతూ సినారె “…మూడు ముక్కల్లో కృష్ణ తన ఆమోదముద్ర ప్రకటించాడు. ‘సీత’ పాత్రను ధరిస్తున్న విజయనిర్మల మౌనంగా తన ప్రశంసను అందించింది. ఆ పాటను ఒకపూటలోనే ట్యూన్ చేశారు ఆదినారాయణరావు గారు” అని పేర్కొన్నారు. ఈ గీతాన్ని సుశీలమ్మ ఆలపించిన తీరు అత్యద్భుతం. ఇప్పటికీ తాజాగా ఉన్న ఆ గీతాన్ని మనసుతో విందాం.
పల్లవి
ఆమె: వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈరోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాల పైన.. తేలి
వస్తాడు నా రాజు ఈ రోజు
ఈ పాట అప్పుడే కాదు ఇప్పటికీ ఒక మాస్టర్ పీస్. ‘శ్రీ’రాగంలో కూర్చిన ఈ గీతం ఆదినారాయణరావు ‘రసనిర్భర’ సంగీత ప్రతిభకు తార్కాణమే కాదు, కవి సినారె అలంకారిక రచనకు అద్దం. ఇది తన ‘రాజు’ను గురించి జ్ఞాపకం చేసుకుంటూ సీత పాడుతుంది. ఇక్కడ ‘రాజు’ అంటే ప్రభువు, ‘రాజు’ అంటే చంద్రుడు అని అర్థం. సినారె పేర్కొన్నట్టు తరువాతి చరణంలో ‘రాజు లక్షణాన్ని, నెలరాజు గుణాన్ని కలగలిపి’ చెబుతారు.

వేలతారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి
వీచే గాలి వినిపించేను
అతని పావన పాదధూళికై
అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే
పాలసంద్రమై పరవశించేను ॥వస్తాడు॥
నాయిక ప్రకారం ఆకాశంలోని వేలాదివేల చుక్కలు కళ్లుగా తన రాజును వీక్షిస్తున్నాయట! దేశం కోసం, ధర్మం కోసం స్వాత్రంత్య పోరాటంలో పాల్గొన్న రాజు పాదధూళి కోసం భూమి పలవరిస్తుందంట. తన అంతరంగం మాత్రం ఆయన కోసం పాల సముద్రమై పరవశిస్తున్నదట. ఇక్కడ కవి సమయం కూడా చూడొచ్చు… పున్నమి రోజున చంద్రుని రాకతో సముద్రం పొంగడం అనేది కవి సమయం. నాయకుని కోసం నాయిక అంతరంగం కూడా పాల సంద్రంలా ఉందట. ఎంత చక్కని ఊహ! అంతకు మించిన అభివ్యక్తి! ప్రణయ బంధం గురించి, అనురాగం గురించి సినారె చివరి చరణంలో చెప్పిన మాటలు… అనుబంధాలు, ఆత్మలు, ప్రేమలు ఎంత విలువైనవో, అవిచ్ఛిన్నమైనవో తెలుపుతాయి. ఇవి నాయిక ముగ్ధ ప్రేమను కూడా తెలుపుతుంది.
వెన్నెలలెంతగా విరిసినగానీ
చంద్రుణ్ని విడిపోలేవు
కెరటాలెంతగా పొంగినగానీ
కడలిని విడిపోలేవు
కలిసిన ఆత్మల అనుబంధాలు
ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైనా.. దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే ॥వస్తాడు॥