ఆకాశవాణి.. హైదరాబాద్ కేంద్రం.. మీరు చదువుతున్నది బాతాఖానీ చెబుతున్న రమేశన్న విశేషాలు. ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ స్టేషన్‌కు ఆయన కార్యక్రమ అధిపతిగా ఎంపికయ్యారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ రేడియో స్టేషన్‌కు పోగ్రామ్ హెడ్ బాధ్యతలు చేపట్టిన తొలి తెలంగాణ బిడ్డ. పిల్లలకు సామెతల మామయ్యగా, పెద్దలకు నర్సింగన్నగా వినోదం పంచే రమేశ్ సుంకసారి.. తెలంగాణ జానపదానికి పెద్దపీట వేస్తూ, ఆకాశవాణి ఆనందాలను రెట్టింపు చేస్తానంటున్నారు.
పసివాడిగా ఉన్నప్పుడు నిద్రపోకుండా ఏడుస్తుంటే.. మా మేనమామలు ఆ ఊయలకు రేడియో కట్టారట. ఆ రేడియో వింటూ ఉండేవాడినట. శనివారం బాలానందం, ఆదివారం బాలవినోదం తప్పకుండా వినేవాడిని. పెద్దయ్యాక క్రికెట్ కామెంటరీ చెవులు రిక్కించి వినేవాణ్ని. నేను ధారాళంగా, గట్టిగా మాట్లాడేవాణ్ని. అందుకేనేమో ‘వీడి నోరు ఆల్ ఇండియా రేడియో’ అనేవాడు మా నాన్న. రేడియోలో పని చేయాలని ఏనాడూ కోరిక లేదు. ఇక్కడ ఉద్యోగం చేస్తానని ఎప్పుడూ అనుకోనూ లేదు. అంతా కాకతాళీయంగా జరిగింది.
సివిల్స్ సాధించడం నా లక్ష్యంగా ఉండేది. మా మేనమామ రవీంద్రనాథ్ మెడిసిన్ చదివి, ఐపీఎస్కి ఎంపికయ్యారు. ఆయన నన్ను బాగా ప్రోత్సాహించారు. ఆయనే నాకు ఫ్రెండ్, స్ఫూర్తి, మార్గదర్శి. నా బలం. నిజాం కాలేజ్‌లో బీఏ చదివాను. తర్వాత ఎల్ఎల్బీ చదివాను. సివిల్స్ మెయిన్స్ వరకే క్లియర్ చేశాను. సీనియర్ అడ్వకేట్ ప్రభంజన్ రెడ్డి గారి దగ్గర జూనియర్‌గా చేరాను. లా ప్రాక్టీస్ చేస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ పరీక్షలు రాశాను. రెండు ఉద్యోగాలు వచ్చాయి. ఆల్ ఇండియా రేడియో కొలువును ఎంచుకున్నాను. కడప స్టేషన్లో 1996లో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో చేరాను. ఇక్కడినుంచి జీవితంలో అన్నీ వినోదాలే!
ఓరోజు ‘అమ్మా రమేశ్.. ఇది నువ్వు మర్నాడు చదివేసెయ్. మాండలికంలో చదివితే రైతులకు బాగా చేరుతుంది’ అని స్టేషన్ డైరెక్టర్ ఆదేశించారు. నాకు తెలిసింది తెలంగాణ మాండలికం. కాబట్టి తల్లి యాసలోనే చదివాను. ‘రాయలసీమ మాండలికంలో చదవగలిగితే చదువు. లేకపోతే మామూలుగా చదివేయ్’ అని మీటింగ్‌లో స్టేషన్ డైరెక్టర్ అన్నారు. రేడియో బ్రాడ్‌కాస్ట్‌లో కళ్లకు కాదు చెవులకు రాయాలి. ఇది రాయడం తెలిస్తే బ్రాడ్‌కాస్టర్‌గా ఎదగడం ఖాయం. ఆ రోజు నుంచి పట్టుదలతో రాయలసీమ మాండలికం నేర్చుకున్నాను. కడపలో జనం నిత్యం వాడుకునే మాటలు పట్టుకున్నాను. ఆ మాటలతో కార్యక్రమాలు నడిపించాను.
రైతుల కోసం శివయ్య, గౌరీ, గంగ పాత్రలతో ‘ముచ్చట్లు’ ప్రోగ్రామ్ ఉండేది. శివయ్య క్యారెక్టర్ చేసే వ్యక్తి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ క్యారెక్టర్‌కి రాయలసీమ మాండలికంపై పట్టున్నవాళ్లు కావాలి. ఆ క్యారెక్టర్ నాకు అప్పగించారు. అలా నీలయ్య క్యారెక్టర్ ఎంటరైంది. దానికి నా గొంతునిచ్చాను. అలాగే ఉదయం పొలం కబుర్లు, సాయంత్రం రైతులకు సూచనలు చెప్పేవాణ్ని. ప్రతి భాషకు ఓ తీయదనం ఉంటుంది. రాయలసీమ తీపిని కొన్నాళ్లు రుచి చూశాను. ఒక ప్రోగ్రామ్ కోసం చిత్తూరు జిల్లాలో మారుమూలకు వెళ్లాను. అక్కడ ఓ రైతుతో మాట్లాడుతుంటే రెండు నిమిషాల్లో నా మాట గుర్తుపట్టి.. ‘రోజూ పొద్దున పొలం కబుర్లు మనదేగా సార్’ అన్నాడు. రేడియో విని అభిమానించే మనిషిని చూసి ఎంతో ఆనందం కలిగిందో!
మూడున్నర సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రేడియో స్టేషన్‌కు బదిలీ అయ్యాను. పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఓ సామెత చెప్పి, ఆ తర్వాత సామెత ఉత్పత్తికి సంబంధించిన కథ చెప్తుండేవాణ్ని. పిల్లలు నాతో ఆడుకుంటూ వినేవాళ్లు. సందేహాలు అడిగేవాళ్లు. దీంతో ‘సామెతల మామయ్య’ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సామెతల మామయ్య’గా నాకూ గుర్తింపు దక్కింది.
హైదరాబాద్ స్టేషన్ నుంచి ‘హలో హైదరాబాద్’ కార్యక్రమం ప్రసారం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో నర్సింగ్ అనే ఫిక్షన్ క్యారెక్టర్‌ను ప్రవేశపెట్టాం. ఆయన ముచ్చట్లను రమేశన్న అనే పాత్ర శ్రోతలతో పంచుకుంటుంది. ఆ రమేశన్న పాత్ర నేను చేశాను. నర్సింగన్న పాత్రకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ‘బాతాఖానీ’ అనే కార్యక్రమం ప్రారంభించాం. ఇందులో ‘నర్సింగన్న’గా మాట్లాడుతున్నాను. ఆకాశవాణిలో తెలంగాణ యాసను ప్రవేశపెట్టింది నేనేనోమో! ఆకాశవాణి ఏర్పడినప్పటి నుంచి స్టేషన్ డైరెక్టర్, కార్యక్రమ విభాగాధిపతి కుర్చీలో తెలంగాణ బిడ్డ కూర్చోలే. నాతోనే మొదలు. తెలంగాణ భాషకు ఉండే ఆత్మీయతను ఈ రేడియోలో వినిపించాలన్నది నా కోరిక. జానపద కళలకు ప్రోత్సాహం, జానపద కళాకారులకు అవకాశాలు ఇవ్వడమే నా సంకల్పం.త్యాగఫలం మా తాత పుట్టపాగ మహేంద్రనాథ్.. నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజక వర్గాల నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో సబ్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేశారు. అమ్మ లక్ష్మమ్మ, నాన్న సందయ్య నన్ను బాగా చదివించారు. నా కోసం ఎంతో కష్టపడ్డారు. వారి త్యాగ ఫలితమే నా విజయం.