విశ్వక్సేన్ నటించిన ‘లైలా’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఆకాంక్ష శర్మ. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ కన్నడలో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. మహేష్‌బాబు, కార్తీ, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోల సరసన పలు ప్రకటనల్లో కనిపించింది. ఇప్పుడు హీరోయిన్‌గానూ రాణిస్తున్నది. ‘లైలా’లో టామ్ బాయ్‌గా ఆకట్టుకున్న ఆకాంక్ష పంచుకున్న కబుర్లు..
చిన్నప్పటి నుంచీ చదువులో చురుగ్గా ఉండేదాన్ని. ఆర్కిటెక్చర్ చదువుకున్నా.. దాన్ని కెరీర్‌గా ఎంచుకోలేదు. దీపికా పదుకొణె నాకు స్ఫూర్తి. ఆమె స్టయిల్, నటిగా ఎదిగిన తీరు.. నాకు ఆదర్శం. ఆమెలా కష్టపడి నటిగా గొప్పస్థాయికి చేరుకోవాలని ఉంది.
ఎలాంటి ప్లానింగ్ లేకుండానే నటిగా మారాను. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చాను. ప్రస్తుతానికి ఒక మంచినటిగా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా కష్టపడుతున్నాను. కన్నడలో వరుస అవకాశాలతో, నా కెరీర్ సాఫీగా సాగిపోవడానికి అభిమానులే కారణం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
హిస్టారికల్, పీరియాడిక్ డ్రామాల్లో నటించాలని ఉంది. అలాంటి పాత్రల్లో నన్ను నేను చూసుకోవాలని అనుకుంటున్నా. ప్రస్తుతం ఒక రొమాంటిక్ మూవీ చేస్తున్నా. నటిగా ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రల్లో కనిపించాలని కోరుకుంటా. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.
‘లైలా’ స్టోరీ విన్నప్పుడు భిన్నంగా అనిపించింది అందుకే ఒప్పుకొన్నా. తెలుగులో ఇదే నా ఫస్ట్ సినిమా. షూటింగ్లో తెలుగు అర్థంకాక ఇబ్బందిపడ్డాను. కానీ, ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతున్నా. ఖాళీ సమయంలో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా! తెలుగు బాగా నేర్చుకుని రాబోయే సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్తా!
కథని ఎంచుకునేటప్పుడు నా పాత్ర పెద్దదా చిన్నదా అని ఆలోచించను. ఆ కథలో దాని ప్రాధాన్యం ఎంత ఉందని మాత్రమే చూస్తాను. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
ఫ్యాషన్‌ను ఫాలో అవుతా! విభిన్నమైన సంస్కృతులను తెలుసుకోవాలని ఉంటుంది. ప్రయాణాలు, పుస్తకాలు చదవడం, ఫొటోగ్రఫీ నా హాబీ!
సుదూర ప్రయాణాలు కొత్త సంస్కృతుల అన్వేషణకు తోడ్పడతాయి. లోతైన ఆలోచనలు చేయడానికి పుస్తకాలు చదవడం చక్కని మార్గం.
మహేష్‌బాబుతో ఓ యాడ్ షూట్ జరిగింది. సెట్లో ఆయన అందరితో సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యం కలిగింది. అంతపెద్ద యాక్టర్ అంత ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోవడం భలేగా అనిపించింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం గొప్ప విషయం కదా!